Friday, August 19, 2011

బిగ్ స్టోరీ: మన 'విలన్'పై చిన్న చూపెందుకు?

సాధారణంగా మన సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు మూడుంటాయి. హీరో, హీరోయినూ, విలనూ. హీరో హీరోయిన్లుగా అందమైన వాళ్లనే ఎంచుకుంటారు. కానీ విలన్‌కి మాత్రం ఎంత క్రూరంగా కనిపించే ముఖమైతే అంత నప్పుతుందని అట్లాంటి వాళ్లని గాలించి మరీ మన సినిమావాళ్లు విలన్లని చేస్తుంటారు. మన సినిమా విలన్లకు లేని దుర్గుణాలు కానీ, వాళ్లు చెయ్యని ఘోరాలు కానీ వుండవు. తెరమీద కనిపించడమే తాము చాలా దుర్మార్గులమని గట్టిగా చెప్పుకుంటారు. వాళ్లెంతటి దుర్మార్గంగా వుంటారంటే తేడా వస్తే తమ మనిషిని కూడా అతి సులువుగా చంపేస్తూ వుంటారు. కొంతమంది విలన్లు సూటూ బూటూ వేసుకుని పైకి బాగా మంచివాళ్లుగానే కనిపించినా వాళ్లు చేసేవన్నీ దుర్మార్గపు పనులే. కొంతమందయితే నల్ల కల్లజోళ్లు పెట్టుకునో, ఒక కన్ను లేకుండానో, చెంపమీద పెద్ద గాటుతోనో, ఒక చెయ్యి లేదా ఒక కాలు లేనివాళ్లుగానో కనిపించి అసలు సిసలు విలన్లు తామే అనిపిస్తుంటారు. ఈ ప్రతినాయకుల ముఖ్య కర్తవ్యం హీరో హీరోయిన్లని తిప్పలు పెట్టడం, వాళ్లు కలుసుకోకుండా చూస్తూ రీళ్లని పెంచడం. ఈ పనికోసం సినిమా ఆరంభం నుంచి ఆఖరుదాకా హీరోయిన్ వంక కోరచూపులు చూస్తూవుంటారు. ఈ విలన్లకు గుర్రపుస్వారీ, ఫైట్లు అన్నీ బాగావచ్చు. హీరోకంటే కూడా వాటిలో అతడికి ఎక్కువ సామర్థ్యం వుంటుంది. కండబలంతో పాటు తెలివితేటలూ ఎక్కువే. అయితే రచయితా, దర్శకుడూ, కథా - వీళ్లంతా కుట్రతో విలన్నే ఎప్పుడూ ఓడిస్తూ వుంటారు. సినిమా ఆఖర్న విసిగిపోయిన విలన్ చావనైనా చస్తాడు లేదంటే పోలీసులతో సంకెళ్లయినా వేయించుకుంటాడు. లేదంటే బుద్ధి వచ్చిందని లెంపలేసుకుంటాడు. మొత్తానికి ఈ విలనే లేకపోతే హీరోగారి హీరోయిజం బయటపడదు కాబట్టి నూటికి తొంభై అయిదు సినిమాలకి ఈ విలనే ఆధారం.
ఇప్పుడిదంతా చెప్పడం ఎందుకంటే ఇంతటి ప్రాధాన్యత వున్న విలన్ పాత్రధారుల్ని ఇవాళ మన సినిమావాళ్లు చిన్నచూపు చూస్తున్నారని. అలనాటి గోవిందరాజుల సుబ్బారావు నుంచి ఇప్పటి జయప్రకాశ్‌రెడ్డి దాకా విలనిజాన్ని గొప్పగా ప్రదర్శిస్తున్నా వాళ్లకి దక్కాల్సిన గౌరవం దక్కడం లేదనిపిస్తుంది. ఈ విషయంలో అప్పటివాళ్లు చాలా మెరుగు. గోవిందరాజుల సుబ్బారావు, సీఎస్సార్ ఆంజనేయులు, ధూళిపాళ, ఎస్వీ రంగారావు, ముక్కామల, రాజనాల, జగ్గయ్య, ఆర్. నాగేశ్వరరావు, నాగభూషణం, రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు వంటి విలన్ పాత్రధారులకి పేరు ప్రతిష్ఠలూ, గౌరవమూ దక్కాయి. శకుని పాత్ర పోషణలో సీఎస్సార్, ధూళిపాళ; విశ్వామిత్ర పాత్రలో ముక్కామల; రావణాసురుడు, దుర్యోధనుడి పాత్రల్లో ఎస్వీ రంగారావు; దుష్ట మాంత్రికుడి పాత్రలో ఎస్వీ రంగారావు, రాజనాల; దుష్ట సైన్యాధిపతి పాత్రలో రాజనాల; 'అల్లూరి సీతారామరాజు'లో బ్రిటీష్ అధికారి రూథర్‌ఫర్డ్ పాత్రలో జగ్గయ్య పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఎస్వీ రంగారావు కేవలం దుష్ట పాత్రల్లోనే కాకుండా సాత్త్విక పాత్రల్లోనూ గొప్పగా రాణించి మహానటుడు అనిపించుకున్నారు.
ఆయన తర్వాత అట్లాంటి ఖ్యాతి కైకాల సత్యనారాయణకీ, కోట శ్రీనివాసరావుకీ దక్కింది. హీరోగా వచ్చి విలన్‌గా నిలదొక్కుకొని, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రూపాంతరం చెందిన సత్యనారాయణని అందుకే అందరూ 'నవరస నటనాసార్వభౌమ' అనేది. కేవలం డైలాగ్ మాడ్యులేషన్‌తోటే విలన్లుగా గొప్పగా రాణించినవాళ్లు నాగభూషణం, రావు గోపాలరావు. సీరియస్ విలనిజంలో హాస్యాన్ని జోడించి మాటని విరిచి మాట్లాడే నాగభూషణాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. డైలాగుల్లో గోదావరి యాసని జోడించి కొన్ని మాటల్ని వత్తి పలుకుతూ విలన్‌గా రావు గోపాలరావు కొత్త రూపంతో కనిపించడంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది. 'ముత్యాల ముగ్గు', 'యమగోల' చిత్రాల్లో ఆయన డైలాగుల్ని ఇప్పటికీ చాలామంది తెలుగువాళ్లు మరచిపోలేదు. 'అహ నా పెళ్లంట'లో పిసినారి విలన్‌గా, 'గాయం'లో గుండు విలన్‌గా కోట శ్రీనివాసరావు నటనకి శభాష్ అన్నారు ప్రేక్షకులు. ఒక్క విలన్‌గానే కాక హాస్య పాత్రల్లోనూ, 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ తను తక్కువవాణ్ణి కానని కోట నిరూపించుకున్నారు.
ఇంతమంది నటులు విలన్‌గా రాణించి హీరోలతో పాటే (తక్కువగానైనా) స్థిరంగా పేరు తెచ్చుకున్నా ఇప్పుడు అట్లాంటి స్థిరమైన విలన్ వేషధారులు కనిపించకపోవడమే బాధాకరం. జయప్రకాశ్‌రెడ్డి, తనికెళ్ల భరణి వంటి నటులు విలన్ వేషాల్లో మెప్పిస్తున్నా వాళ్లు ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు. 'ప్రేమించుకుందాం రా' చిత్రంలో జయప్రకాశ్‌రెడ్డి విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నా తగినన్ని అవకాశాలు మన నిర్మాతలు, హీరోలు ఇవ్వడం లేదు. అతను ఆహార్యంలో కానీ, హావభావాల్లో కాన్నీ పచ్చి దుర్మార్గాన్ని పలికించడంలో నేర్పరి. ఇతన్ని తెలుగు చిత్రసీమ సరైన రీతిలో వినియోగించుకుంటే ఈసరికే తిరుగులేని విలన్ అయ్యుండేవాడు. 'మాతృదేవోభవ', 'నువ్వు నేను' సినిమాల్లో అతి క్రూరమైన విలన్ పాత్రల్లో బాగా రాణించిన తనికెళ్ల భరణిని విలన్‌గా కంటే హాస్య నటుడి పాత్రల్లోనే ప్రేక్షకులు ఎక్కువగా చూస్తున్నారు. కాబట్టి భరణిని హాస్యనటుల జాబితాలోనే వేసుకోవాలి. చలపతిరావుది మరో రకం కథ. పక్కా విలన్‌గా కనిపించే రూపం వున్నా ఎందుకనో పరిశ్రమ ఆయన్ని సరిగా ప్రమోట్ చేయలేదు. తెలుగులో ద్వితీయ శ్రేణి సినిమాల్లోనే ఎక్కువగా ప్రధాన విలన్ పాత్రలు వేసిన ఆయన 'నిన్నే పెళ్లాడుతా' నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడ్డాడు.
ప్రస్తుతం విలన్ వేషాల్లో పేరు తెచ్చుకుంటున్న వాళ్లంతా హీరో వేషాలు వేయడానికే ఆసక్తి చూపిస్తూ రావడం గమనార్హం. హీరోగా పరిచయమై, మళ్లీ అవకాశాలు లేకపోవడంతో 'జయం'తో విలన్‌గా మారిన గోపీచంద్ ఆ పాత్రలకి అచ్చుగుద్దినట్లు సరిపోయాడు. 'వర్షం', 'నిజం' సినిమాలు ఆ కోవలేనివే. తెలుగు సినిమాకి మంచి తెలుగు విలన్ లభించాడని అందరూ ఆనందిస్తున్న కాలంలోనే అనూహ్యంగా 'యజ్ఞం'తో హీరో అయిపోయాడు గోపీచంద్. ఇప్పుడు ఆ పాత్రల్లో తనకంటూ సొంత ఇమేజ్ కూడా సంపాదించేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన కుర్ర విలన్లు అజయ్, సుబ్బరాజు కూడా హీరో పాత్రల కోసం ట్రై చేస్తున్నారు. అజయ్ ఇప్పటికే రెండు సినిమాల్లో హీరోగా నటించేశాడు కూడా. సుబ్బరాజు కూడా అదే బాటలో పయనించాలని చూస్తున్నాడు.
మనం ఇక్కడ ఇంకో ఇద్దరు నటుల గురించి కూడా చెప్పుకోవాలి. విలన్లుగా పేరు తెచ్చుకుని, తర్వాత హీరోలుగా కూడా రూపాంతరం చెంది, అట్లా కూడా పేరు తెచ్చుకున్న ఆ నటులు - మోహన్‌బాబు, శ్రీహరి. కొత్తరకం డైలాగ్ మాడ్యులేషన్‌తో మోహన్‌బాబు, యాక్షన్ విలన్‌గా శ్రీహరి బాగానే పేరు తెచ్చుకున్నారు. కానీ మరింతకాలం విలన్లుగా వాళ్లు నటించి వుంటే వాళ్ల సేవలు అటు పరిశ్రమకీ, ఇటు ప్రేక్షకులకీ దక్కేవి. సో, ఇద్దరు మంచి విలన్లని అట్లా మిస్సయ్యాం. పోతే ఇప్పుడు మన పెద్ద నిర్మాతలు, పెద్ద హీరోలు తమ చిత్రాల్లో విలన్లుగా మన నటుల్ని కాక ఇతర భాషల నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకుంటుండటం వల్ల కూడా మన 'విలన్' నటులకి మంచి అవకాశాలు దక్కడం లేదు. ముఖేష్‌రుషి, మోహన్‌రాజ్, ఆనంద్‌రాజ్, సాయికుమార్ (మలయాళీ), సాయాజీ షిండే, ప్రదీప్ రావత్, రాహుల్‌దేవ్, ముకుల్‌దేవ్, దండపాణి వంటి పరభాషా విలన్లనే మన అగ్రహీరోలు కోరుకుంటున్నారు. ఈ పరిస్థితి మారాలి. పెద్ద హీరోలు మన వాళ్లలోని టాలెంటుని గుర్తించి అవకాశాలు ఇవ్వాలి. నిర్మాతలు కూడా ఈ విషయంలో ఒత్తిడికి లోంగిపోకూడదు. అలా జరిగితే మరికొందరు మంచి తెలుగు 'విలన్లు' తయారవుతారు. వాళ్లలో కొందరైనా చరిత్రలో స్థానం పొందగలిగే అవకాశం వుంటుంది.

No comments: