Wednesday, August 24, 2011

న్యూస్: ఈ సారైనా ఎన్టీఆర్, పూరి కాంబినేషన్ హిట్ కొట్టేనా?

ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందబోతోంది. ఈ కాంబినేషన్‌లో తయారయ్యే రెండో సినిమాని బండ్ల గణేశ్ నిర్మించనున్నాడు. ఈ బండ్ల గణేశ్ మరెవరో కాదు. ఇదివరకు రవితేజతో 'ఆంజనేయులు', పవన్ కల్యాణ్‌తో 'తీన్‌మార్' నిర్మించిన హాస్యనటుడు గణేశ్‌బాబు. మనవాళ్లకి న్యూమరాలజీ అంటే పిచ్చి కాబట్టి, ఆ రెండు సినిమాలు సరిగా ఆడకపోవడంతో ఇప్పుడు పూర్తిపేరుని తెరపేరుగా వాడుతున్నాడు. పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్స్ బేనర్‌పై నిర్మాణమయ్యే ఈ సినిమా వచ్చే యేడాది ఏప్రిల్లో మొదలు కానున్నది. ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, మాటల్ని సహజంగానే జగన్నాథ్ అందించనున్నాడు. "జగన్ కాంబినేషన్‌లో మళ్లీ సినిమా చెయ్యాలని ఎప్పట్నించో అనుకుంటున్నా. ఇప్పటికి కుదిరింది. ఎనిమిదేళ్లుగా ప్రేక్షకులు, అభిమానులు, నేను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంబినేషన్ ఇది. జగన్, నేను కలిసి పనిచేస్తున్నామంటే అంచనాలు భారీగానే ఉంటాయి" అని చెప్పాడు ఎన్టీఆర్.
నిజమే. ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన 'ఆంధ్రావాలా' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టరై ఆ సినిమా నిర్మాత గిరికి పీడకలగా పరిణమించిన సంగతి చాలామంది గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా దెబ్బతో గిరి తన ఆస్తుల్ని అమ్ముకోవాల్సి వచ్చింది. 20 యేళ్ల వయసులో తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం ఆ సినిమాకి పెద్ద మైనస్ అయ్యింది. అంతేనా.. తండ్రి పాత్రకి జోడీగా అప్పటికే ముదురు తార అయిన సంఘవి చేయడం ఇంకా ఎబ్బెట్టు అనిపించింది ప్రేక్షకులకి. అందుకే ఆ సినిమాని మరో ఆలోచనకు తావులేకుండా తిరస్కరించారు. మిస్ కేస్టింగ్ అనేది ఓ మోస్తరు సినిమాని ఎలా ఘోరమైన సినిమాగా మారుస్తుందో 'ఆంధ్రావాలా' చక్కని ఉదాహరణ. చాలా సన్నిహితులైన ఎన్టీఆర్, జగన్నాథ్ కాంబినేషన్ రెండో సినిమాకి ఎనిమిదేళ్లు పట్టిందంటే ఆ సినిమా అనుభవమే కారణం. వచ్చే యేడాది రూపొందే ఈ రెండో సినిమా అయినా ఆ పీడకలని మర్చిపోయేలా చేస్తుందా?

No comments: