Friday, August 5, 2011

న్యూస్: మంచి సినిమాలకే నందులు!

గతంలో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకే ఎక్కువ అవార్డుల్ని కట్టబెడుతూ వచ్చిన నంది అవార్డుల జ్యూరీ గత యేడాది నుంచీ అర్థవంతమైన, మంచి చిత్రాలకు అవార్డులనిస్తూ 'నంది'కి గౌరవాన్ని కల్పిస్తోంది. 2010 సంవత్సరానికి దర్శకుడు ఎన్. శంకర్ ఆధ్వర్యంలోని జ్యూరీ ప్రకటించిన అవార్డులు ఈ సంగతిని స్పష్టం చేశాయి. ఈసారి ఉత్తమ అవార్డులు మూడూ విమర్శకుల ప్రశంసల్ని పొందిన సినిమాలకే రావడం గమనార్హం. అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క ప్రధాన పాత్రలు పోషించగా క్రిష్ డైరెక్ట్ చేసిన 'వేదం' ఉత్తమ చిత్రంగా బంగారు నందిని గెలుగుకోగా, 2009 సంవత్సరంలో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని పొందిన 'సొంత ఊరు' దర్శకుడు పి. సునీల్‌కుమార్‌రెడ్డి మత్స్యకారుల దయనీయ జీవితాన్ని ఆవిష్కరించిన 'గంగపుత్రులు' ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. సునీల్‌కుమార్‌రెడ్డికే ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కడం గమనార్హం. ఇక తృతీయ ఉత్తమ చిత్రంగా సాయికుమార్, శర్వానంద్, సందీప్ నటించగా దేవా కట్టా డైరెక్ట్ చేసిన 'ప్రస్థానం' నిలిచింది. ప్రజాదరణ పొందిన చిత్రంగా నిజంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన రాజమౌళి చిత్రం 'మర్యాద రామన్న'ని జ్యూరీ ఎంపిక చేసింది. గతంలో ఈ కేటగిరీలో చాలా చోట్ల అసలు రిలీజే కాని 'పెళ్లాం పిచ్చోడు' అనే రాజేంద్రప్రసాద్ సినిమాని ఎంపిక చేసిన సంగతి జ్ఞాపకం చేసుకుంటే జ్యూరీ ఈసారి ఎంత వాస్తవికంగా పనిచేసిందో అర్థమవుతుంది. అలాగే సకుటుంబంగా చూడదగ్గ ఉత్తమ చిత్రం అవార్డుని చంద్రసిద్ధార్ట్ డైరెక్ట్ చేసిన 'అందరి బంధువయ'కు ప్రకటించారు. సమాజంలో నైతికత, మానవత్వం ముఖ్యమని చెప్పిన ఈ సినిమాని విమర్శకులు ఎంతగానో అభిమానించారు. ఇక జాతీయ సమగ్రతా చిత్రంగా బాలకృష్ణ హీరోగా దాసరి నారాయణరావు రూపొందించిన 'పరమవీరచక్ర'కు ఇచ్చారు.
వ్యక్తిగత అవార్డుల విషయానికొస్తే ఉత్తమ నటుడి అవార్డు బాలకృష్ణకు దక్కింది. 2001 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 'నరసింహనాయుడు' పాత్ర పోషణకు గాను ఉత్తమ నటుడి అవార్డును అందుకున్న ఆయన మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఆ అవార్డును పొందడం విశేషమే. 'పరమవీరచక్ర'కు కాకుండా, చాలా కాలం తర్వాత ప్రేక్షకాభిమానాన్ని పొందిన 'సింహా'లో చేసిన రెండు పాత్రలకు గాను ఈ అవార్డు ఆయనకు లభించడం గమనార్హం. 2011 సంక్రాంతికి విడుదలైనా, 2010లోనే సెన్సార్ సర్టిఫికెట్ పొందిన 'అలా మొదలైంది'లో అద్భుతంగా అభినయించిన నిత్యమీనన్ ఉత్తమ నటిగా ఎంపికవగా, ఆ చిత్రాన్ని జన రంజకంగా మలిచిన నందినీరెడ్డి ఉత్తమ తొలిచిత్ర దర్శకురాలిగా నిలిచింది. 'సింహా"కి చక్కని సంగీతాన్నిచ్చిన చక్రి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. తొలి చిత్రమే అయినా 'మర్యాద రామన్న'లో విశేషంగా రాణించిన నాగినీడు ఉత్తమ విలన్‌గా అవార్డును అందుకోనున్నారు. ఇలా అనేక అవార్డులు పారదర్శకంగా ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.

No comments: