Thursday, August 25, 2011

న్యూస్: 'శంఖం' దర్శకుడితో రవితేజ కొత్త సినిమా!

రవితేజ హీరోగా కొత్త సినిమా మొదలైంది. ఇదివరకు గోపీచంద్ హీరోగా 'శౌర్యం', 'శంఖం' సినిమాల్ని రూపొందించిన సినిమాటోగ్రాఫర్ శివ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ బేనర్‌పై సీనియర్ ప్రొడ్యూసర్ బూరుగపల్లి శివరామకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 18న లాంఛనంగా మొదలైంది. ఈ సినిమా గురించి రవితేజ మాట్లాడుతూ "శివ సెన్సిబుల్ డైరెక్టర్. అతనికి మాస్ పల్స్ బాగా తెలుసు. అతను చెప్పిన కథ ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉంది" అని చెబితే, "రవితేజ ఇప్పటివరకు చెయ్యని కేరక్టర్ ఇది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మంచి మాస్ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపొందుతుంది" అని శివ తెలిపాడు. ఇంకా హీరోయిన్‌ని ఎంపికచేయని ఈ సినిమాకి ఇద్దరు తమిళ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. ఒకరు సంగీత దర్శకుడు విజయ్ ఆంథోని, మరొకరు సినిమాటోగ్రాఫర్ వెట్రి. ఇంకో చెప్పుకోదగ్గ సంగతేమంటే సీనియర్ కామెడీ హీరో రాజేంద్రప్రసాద్ ఇందులో ఓ కీలక పాత్ర చేస్తుండటం.
డైరెక్టర్ శివకి మాస్ పల్స్ బాగా తెలుసని రవితేజ అన్నాడు కానీ 'శంఖం' సినిమా చూసినవాళ్లు మాత్రం ఆ మాటలతో ఏకీభవించరు. నిజానికి అది క్రేజీ కాంబినేషన్‌తో తయారైన సినిమా. అదివరకు విలన్, హీరోయిన్‌గా 'వర్షం'లో నటించిన గోపీచంద్, త్రిష ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించడంతో విడుదలకి ముందు దానికి ఎంతో క్రేజ్ వచ్చింది. కానీ సినిమా చూశాక జనం ఉసూరుమన్నారు. సినిమా అంతా పాత చింతకాయ పచ్చడి వాసన వేయడం, చాలా సీన్లు బోర్ కొట్టించడంతో 'శంఖం'ని వారు తిరస్కరించారు. దాంతో నిర్మాతలు జె. భగవాన్, జె. పుల్లారావు భారీగా నష్టపోయారు. దానికి ఓవర్ బడ్జెట్ అవడం కూడా ప్రధాన కారణం. ఇప్పుడు రవితేజ సినిమాకి అతను ఖర్చుపెట్టించే దానిపైనే దాని విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. కాకపోతే రవితేజ అంటే మినిమం గ్యారంటీ హీరో కాబట్టి ఆ మేరకు నిర్మాతకి ఒకింత లాభం కలగవచ్చు.

No comments: