Tuesday, August 23, 2011

మన చరిత్ర: నిజాం రాష్ట్ర ప్రథమ ఆంధ్ర మహాసభ

తెలంగాణాలోని ప్రతి జిల్లా, తాలూకాల్లో 'ఆంధ్ర జనసంఘం'కు శాఖలేర్పడ్డాయి. దీనితో గ్రంథాలయోద్యమాన్ని కూడా జోడించారు. తెలంగాణా అంతటా ఉన్న వివిధ ప్రజాసంఘాల సమన్వయ భారం మాడపాటివారు వహిస్తుండేవారు. చివరకు 1923 మార్చి నెలలో హనుమకొండలో ఓ సభ జరిగింది. తెలంగాణా అంతటినుండీ ఈ 'జనసంఘ' ప్రతినిథులు పాల్గొన్నారు. ఇందులోనే 'నిజాం రాష్ట్ర ఆంధ్రజన కేంద్రసంఘం' ఆవిర్భవించింది. ఈ సంఘం సభలు 1924 మార్చిలో నల్లగొండలోనూ (రెండవది), 1925 ఫిబ్రవరిలో మధిరలోనూ (మూడవది) జరిగాయి. నిజాం ప్రభుత్వం అనుమతి ఇవ్వని కారణంగా 1928 మేలో సూర్యాపేటలో జరిగే సభవరకూ మధ్యకాలంలో సభలు జరగలేదు. అంటే నాలుగవ మహాసభ 1926లో జరగాల్సింది 1928లో జరిగింది. సాధారణంగా ఈ ఆంధ్రజన కేంద్రసంఘం సభలతో గ్రంథాలయ సభలూ, యువజన, వైశ్య యువజన, సంఘ సంస్కరణ, మహిళాసభలు కూడా జరుగుతుండేవి.
గ్రంథాలయాలు, పఠనాలయాలు, అప్పుడున్న తెలుగు పత్రికలు తెలంగాణాలోని తెలుగు ప్రజల్లో సాంస్కృతిక చైతన్యానికి విశేషంగా దోహదం చేశాయి. తెలుగు చరిత్రలో పరిశోధన చేసి కృషిచేయడం, తెలుగు ప్రజలకు తమ భాషలో, సంస్కృతిలో ఆసక్తి కలిగించడమే కాకుండా దాన్ని రక్షించుకోవాలన్న ధైర్యస్థయిర్యాల్ని కలిగించడం ఈ అన్ని సంఘాల ఆశయం. దానికి ఆనాడు ఉన్నవ వెంకట్రామయ్యను పూర్తికాలపు ప్రచారకునిగా ఈ సంఘం నియమించింది. ఈ సంఘం ఆశయాల్ని ఊరూ వాడా ప్రచారం చేశారాయన. ఈ కృషి క్రమంగా సమన్వయం చెంది 1930లో జోగిపేటలో జరిగిన నిజాం రాష్ట్ర ప్రథమ ఆంధ్ర మహాసభగా రూపుచెందింది. సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షులు. 1931లో భువనగిరిలో బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షతన రెండో మహాసభ, 1934 ఖమ్మంలో పులిజాల వెంకటరంగారావు అధ్యక్షతన మూడో మహాసభ, 1935లో సిరిసిల్లలో మాడపాటి హనుమంతరావు అధ్యక్షతన నాలుగో మహసభలు జరిగాయి. 1936లో కొండా వెంకటరంగారెడ్డి, 1937లో ముందుముల నరసింగరావు (నిజామాబాద్) అధ్యక్షతన సభలు జరిగాయి.
1937 నుండి 1944 సభలవరకూ జరిగిన అన్ని ఆంధ్ర మహాసభల్లోనూ రావి నారాయణరెడ్డి నాయకత్వం కింద అతివాద భావాలు వెలువడటం ఆరంభమయ్యాయి. కార్యవర్గంలో చురుకుదనం రావాలనీ, కేవలం స్వాతంత్ర్య కాంక్షను నిజాం ప్రభువుకు విన్నవిస్తే సరిపోదన్న భావం ఈ యువకుల్లో ఉండేది. బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల సోదరులు, ఇంకా అనేకులు ఈ వర్గంలో ఉండేవారు.

No comments: