Tuesday, August 2, 2011

టర్నింగ్ పాయింట్: చంద్రబోస్

"నేను గాయకుణ్ణి కావాలనుకొని, సొంతంగా కొన్ని పాటలు రాసి వాటిని పాడుకునేవాణ్ణి. నా ఫ్రెండ్ ఒకతను వాటిని చూసి, అవి బాగున్నాయనీ, గేయ రచయితగా కెరీర్‌ని మలచుకుంటే బాగుంటుందనీ అభిప్రాయపడ్డాడు. అప్పుడు కొత్తగా సినిమాని ప్లాన్ చేసిన డైరెక్టర్ ముప్పలనేని శివను కలిశాం. ఆ తర్వాత ఆ సినిమాని నిర్మిస్తున్న గొప్ప నిర్మాత డి. రామానాయుడు గారినీ, దానికి సంగీత దర్శకురాలైన ఎం.ఎం. శ్రీలేఖనూ కలిశాం. ఆమె నాకో ట్యూన్ ఇచ్చింది. ఆ సినిమా శ్రీకాంత్ హీరోగా నటించిన 'తాజ్‌మహల్'. అప్పుడు నేను రాసిన పాట 'మంచుకొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో..'. ఆ అనుభవాన్ని మాటల్లో వర్ణించలేను. నా తొలి సినిమాలోనే సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువనచంద్ర వంటి గేయ రచయితల సరసన నాకూ చోటు లభించిండం నాకు దక్కిన గొప్ప భాగ్యం. నేను బాగా అభిమానించే బాలు, చిత్ర నా పాటల్ని పాడారు. అదో గొప్ప అనుభవం.
ఆ తర్వాత నా జీవితంలో మరో టర్నింగ్ పాయింట్ చోటు చేసుకుంది. నేను రాసిన ఓ పాట షూటింగ్ సందర్భంగా సంజీవయ్య పార్క్‌కి వెళ్లా. అక్కడ కొరియోగ్రాఫర్ కంపోజ్ చేస్తున్న మూవ్‌మెంట్స్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఆమె పేరు సుచిత్ర. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె నా భార్య అయ్యింది.
ఇప్పుడు గేయ రచయితగా నా కెరీర్‌లో 16వ యేడు నడుస్తోంది. ఈ కాలంలో చాలా అవార్డులే సంపాదించా. నా కెరీర్ ఎంతో సంతృప్తికరంగా, సంతోషకరంగా కొనసాగుతోంది. అయితే దాని వెనుక ఎంతో శ్రమ ఉన్నదనేది మరచిపోకూడదు."

No comments: