Saturday, August 20, 2011

మన చరిత్ర: తెలంగాణలో ఆంధ్రోద్యమ ఆరంభం

1901లో హైదరాబాద్ నగరంలో శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం ఏర్పడింది. కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, మునగాల రాజా నాయని వెంకటరంగారావు దీన్ని తెలుగు గ్రంథాలయంగా స్థాపించారు. దీని తర్వాత వరుసగా తెలంగాణా అంతటా గ్రంథాలయాలు ఆవిర్భవించాయి. ఇవి నాడు కేవలం పఠనాలయాలుగా మాత్రమే కాకుండా పాఠశాలలు, వయోజన విద్యానిలయాలు, సాంస్కృతిక, రాజీయాభిప్రాయాల చర్చావేదికలుగా కూడా ఉపయోగపడుతుండేవి.
సరిగ్గా అదే కాలంలో ఇక్కడ యాదవ, ముదిరాజ, మున్నూరు, పద్మశాలి, గౌడ తదితర వర్ణాలవారి సభలూ జరగడం ఆరంభమయ్యాయి. సంఘ సంస్కరణ, జీవరక్షా ప్రచారాలు కూడా ముమ్మరమయ్యాయి. హిందూ సంఘ సంస్కార సభ, ఆది హిందూ సేవాసమితిలాంటి సంస్థలు ఆవిర్భవించాయి. నాడిక్కడున్న పత్రికలు చాలా తక్కువ. నీలగిరి, గోలకొండ, తెనుగు ప్రతిభ, సుజాత వంటివి ఉండేవి. ఉర్దూలో అనేక పత్రికలుండేవి.
తెలంగాణా ప్రాంతం ఉన్న చారిత్రక పరిస్థితిననుసరించి విభిన్న భాషలవారూ ఉన్నారు. ఇక్కడి తెలుగువారికి కన్నడిగులు, మహారాష్ట్రులు, ఉత్తర హిందూస్థానీయులు, మహమ్మదీయులవంటి ఆంధ్రేతర భాషీయులతో సత్సంబాంధాలుంటుండేవి.
1921లో ఓ సంఘటన జరిగింది. నవంబరులో హైదరాబాద్‌లోని వివేకవర్థినీ థియేటరులో హిందూ సంస్కార సభలు జరిగాయి. ఆ సభలకు సరళాదేవి చౌధరాణి అధ్యక్షత వహించారు. అనేకమంది వక్తలు హిందీ, ఉర్దూ, మరాఠీ, ఇంగ్లీషు భాషల్లో మాట్లాడారు. అల్లంపల్లి వెంకట్రామారావు అనే న్యాయవాది తెలుగులో మాట్లాడటం ఆరంభించగానే సభలోని ఆంధ్రేతరులు అల్లరిచేయడం ఆరంభించారు. సభలో ఈలలు, కేకలు. సభాధ్యక్షురాలు కూడా వక్తను ఆపడానికి ప్రయత్నించారు. వెంకట్రామారావు తమ ఉపన్యాసం ఆపక తప్పిందికాదు. తెలుగువాళ్లలో ఈ సంఘటన ఆవేశానికి దారితీసింది. తర్వాత కొద్ది రోజులకు హైదరాబాద్‌లోని ట్రూప్ బజారులో ఉన్న టేక్‌మాల్ రంగారావు ఇంట్లో తెలుగువాళ్లు సమావేశమై 'ఆంధ్రజన సంఘం' అనే పేరుతో ఓ సంఘాన్ని ఏర్పాటుచేశారు. మాడపాటి హనుమంతరావును కార్యదర్శిగా ఎన్నుకున్నారు. హైదరాబాద్ సంస్థానంలో ఆంధ్రోద్యమంగా పైకి రావడానికి అది నాంది.

No comments: