Wednesday, August 17, 2011

న్యూస్: 'టీ.. సమోసా.. బిస్కెట్'తో బాబ్జీ నమ్మకం ఫలిస్తుందా?

'నల్లపూసలు' సినిమాతో పేరు తెచ్చుకున్న బాబ్జీ పదకొండేళ్ల విరామంతో మరోసారి దర్శకత్వం చేపట్టాడు. చివరిసారి ఆయన డైరెక్ట్ చేసిన సినిమా 'ఎన్.టి.ఆర్. నగర్'. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ డూపులే హీరోలుగా ఈ సినిమాని ఆయన తీశారు. ఇందులో చిరంజీవి డూపుగా రాజ్‌కుమార్ నటించాడు. తీసిన సినిమాలేవీ కమర్షియల్‌గా వర్కవుట్ కాకపోవడంతో ఆయనతో సినిమాలు తీయడానికి మళ్లీ ఏ నిర్మాతా ముందుకు రాలేదు. ప్రజా నాట్యమండలి కళాకారుడు కూడా అయిన బాబ్జీ ఇన్నాళ్లకి సొంతంగా నిధులు సమకూర్చుకుని ఇప్పుడు 'టీ.. సమోసా.. బిస్కెట్' సినిమాని ప్రారంభించాడు. ఇందులో శ్రీహరి, హంసానందిని జంటగా నటిస్తున్నారు. ఇటీవలే వచ్చిన అల్లరి నరేశ్ సినిమా 'అహ నా పెళ్లంట'లో భార్యాభర్తలుగా దర్శనమిచ్చిన వారు ఇప్పుడు ఇందులో హీరో హీరోయిన్లుగా నటిస్తుండటం గమనార్హం. "ఈ రోజుల్లో నగరాలు కాఫీ క్లబ్బులు, పబ్బులమయమై పోతున్నాయి. పేదవాడు పది నిమిషాలు సేదతీరుదామన్నా దగ్గర్లో ఎలాంటి హోటల్సూ ఉండటం లేదు. ఈ పాయింటునే ప్రధానాంశంగా తీసుకుని ఈ సినిమా చేస్తున్నా" అని చెప్పాడు బాబ్జీ. పీపుల్స్ థియేటర్ పతాకంపై ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్న బాబ్జీని ఎందుకింత రిస్క్ తీసుకుంటున్నారని ప్రశ్నిస్తే "ఈసారి తప్పకుండా కమర్షియల్ హిట్ కొడతా. సబ్జెక్ట్ అంత బాగా వచ్చింది" అని ఎంతో కాంఫిడెంట్‌గా చెప్పాడు. ఈ సినిమా ఫ్లాపైతే అప్పలపాలైపోతానని ఆయనకి బాగా తెలుసు. ఆయన నమ్మకం ఫలిస్తుందా?

No comments: