Wednesday, August 10, 2011

మన చరిత్ర: మొలకెత్తిన స్వరాష్ట్ర భావనలు

ప్రజలు మాట్లాడే భాషలో ప్రభుత్వాలు నడుస్తుంటే ప్రజలకూ, ప్రభుత్వానికీ మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. తమ దేశాన్ని తామే పరిపాలించుకోవాలన్న భావనలోనుండే తమ ప్రాంతాన్ని తామే పరిపాలించుకోవాలన్నది వచ్చింది. మరి ప్రాంతాల విభజన ఎలా జరగాలి అన్నప్పుడు ప్రజలు మాట్లాడే భాషాపరంగా అన్నది ఆచరణ యోగ్యం. ఆంగ్లేయుల పాలనా కాలంలో భారతదేశాన్ని తమ పాలనా సౌకర్యాన్ననుసరించీ, విభజించి పాలించాలన్న కుటిలనీతికి అనుగుణంగానూ, ఒకే భాష మాట్లాడే ఒకే జాతి ప్రజల్ని ముక్కచెక్కలుగా చీల్చి వివిధ ప్రాంతాలుగా విభజించారు.
ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్ష పెరుగుతున్న కొద్దీ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావాన్ని కూడా ఆశించడం ఆరంభమైంది. 1907లో సూరత్‌లో జరిగిన కాంగ్రెస్ సభలో స్వరాజ్య సాధనే రాజకీయ పరమావధిగా ఉండాలని దాదాభాయి నౌరోజీ అన్నారు. సూరత్ సభలకు కాంగ్రెస్ చరిత్రలో ప్రధాన స్థానం ఉంది. మితవాద వర్గాలు ఫిరోజ్‌షా మెహతా, సురేంద్రనాథ్ బెనర్జీ, గోఖలేల నాయకత్వాన ఉంటుండేవి. మహారష్ట్రలో తిలక్, పంజాబ్‌లో లాలాలజపతి రాయ్, బెంగాల్‌లో బిపిన్ చంద్రపాల్‌తో పాటు అనేకమంది వీరులు అతివాదులుగా స్వరాజ్య నినాదంతో చెదురు మదురుగా ఉంటుండేవారు. తిలక్ నాయకత్వాన సూరత్‌లో కాంగ్రెస్‌లోని అతివాదులు సమీకృతులయ్యారు. మితవాదులు సూరత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా రాస్‌విహారీ ఘోష్ పేరును ప్రతిపాదిస్తే, వెంటనే తిలక్ లేచి లజపతిరాయ్ పేరును ప్రత్యామ్నాయంగా సూచించాడు. అప్పటివరకూ కాంగ్రెసే మెహతా, మెహతాయే కాంగ్రెస్ అనే భావన ఉండేది. అది బద్దలైంది. ఈ సభలకు మద్రాసు ప్రాంతం నుండి టంగుటూరి ప్రకాశం, వి. కృష్ణస్వామయ్యర్, నటేశన్, దొరస్వామయ్యర్, చక్రయ్యశెట్టి తదితరులు అనేకులు వెళ్లారు. ఎప్పుడైతే ప్రత్యామ్నాయ సూచన తిలక్ చేశారో సభలో గందరగోళం, అలజడి చెలరేగింది. సభ్యులు బాహాబాహీ తలపడ్డారు. కుర్చీలు విసురుకున్నారు. తలలు పగిలాయి. మితవాదులు కంగుతిన్నారు. అతివాదులు పుంజుకున్నారు. అయినా ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతూ మితవాదుల కొద్దిపాటి ప్రభావం కిందే తర్వాత లక్నో కాంగ్రెస్ దాకా నడిచింది.
బీహార్, బెంగాల్ విభజన.. అటు దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్నీ, ఇటు లోలోపల రగుల్కుంటున్న తెలుగువారిలోని స్వరాష్ట్ర భావాలనూ జ్వాలామానం చేసింది. అప్పటివరకూ కాంగ్రెస్‌లోని వర్గాలు స్వల్ప సంస్కరణల కోసం అంటే నిర్బంధోచిత ప్రారంభ విద్య, న్యాయశాఖా కార్య నిర్వాహక శాఖల విభజన, దేశీయులకు ఉన్నతోద్యోగాలివ్వమని ప్రాధేయపడటం, శాసన సభల్లో సభ్యుల సంఖ్య పెంచమని అర్థించడం, ఐ.సి.ఎస్. పరీక్షల్ని ఇండియాలో కూడా జరిపించమని మహజర్లు పెట్టడంలాంటి పనులతోనే సరిపుచ్చుకునేవి. క్రమంగా తిలక్, దాదాభాయి నౌరోజీ చొరవతో కొంత అతివాదం వైపు మొగ్గింది. ఐతే అది 1917 దాకా స్థిరరూపం దాల్చలేదు. కాంగ్రెస్‌లో ఉంటున్న తెలుగు వ్యక్తుల్లో స్వరాష్ట్ర కాంక్ష ఈ మధ్యకాలంలోనే నారుబోసుకుంటోంది. అదే 1917లో ఆంధ్ర ప్రాంతాలకు ప్రత్యేకంగా రాష్ట్ర కాంగ్రెస్ సంఘం ఏర్పాటుకు దారితీసింది.
రిఫరెన్స్: టంగుటూరి ప్రకాశం 'నా జీవిత యాత్ర'.

No comments: