Thursday, August 25, 2011

ఇంటర్వ్యూ: జె.డి. చక్రవర్తి

"ఖాన్‌దాదాగా బ్రహ్మానందం విశ్వరూపం చూపించారు. ఈ సినిమాని నేనెలా ప్రేమించానో, ఆయనా అంతగా ప్రేమించారు. అయితే ఆయన వల్ల నాకు నష్టం జరిగింది'' అని చెప్పారు జె.డి. చక్రవర్తి. చక్రవర్తి ప్రొడక్షన్స్, ఫస్ట్ చాయిస్ మీడియా హౌస్ సంయుక్తంగా నిర్మించిన 'మనీ మనీ మోర్ మనీ' చిత్రానికి ఆయన దర్శకత్వం వహించడంతో పాటు ఓ కీలక పాత్రనీ చేశారు. కె. సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదలవుతున్న సందర్భంగా చక్రవర్తి చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే...
ఎంత పబ్లిసిటీ చేసినా ప్రేక్షకులు ముందే నిర్ణయించుకుంటారండీ. వాళ్లకి ఆ సినిమా మీద ఇంటరెస్ట్ ఉండాలి. అంతే. సినిమా బాగుందనే టాకే వాళ్లని థియేటర్లకి తీసుకువస్తుంది. కొన్ని సినిమాలకి ఎంత పబ్లిసిటీ ఇచ్చినా జనం రారు. కొన్నింటికి పెద్దగా లేకపోయినా జనం చూస్తారు.
ఇది స్క్రీన్‌ప్లే సీక్వెల్
ఇది సీక్వెలే కానీ మునుపటి వాటిలాంటి సినిమా కాదు. ఇది స్టోరీ సీక్వెల్ కాదు, స్క్రీన్‌ప్లే సీక్వెల్. 'మనీ' నుంచి కొన్ని పాత్రలు తీసుకున్నా. వాటి ప్రోగ్రెస్ ఉంటుంది కానీ కథ కొత్తది. ఈ కథ 2009లో మొదలవుతుంది. రియల్ ఎస్టేట్‌లో బాగా సంపాదించిన ఖాన్‌దాదా 2011కు వచ్చేసరికి డబ్బంతా పోగొట్టుకుని ఉంటాడు. కాకపోతే జూబ్లీహిల్స్‌లో అతనికి పెద్ద ఇల్లుంటుంది. అప్పులపాలై దాన్ని అమ్మేసుకుందామని అనుకుంటుంటాడు. ఆ టైమ్‌లో నలుగురు వ్యక్తులు అతని ఇంట్లో ప్రవేశించి, అతన్ని ఎలా ఆడుకున్నారనేదే కథ. ఆ తర్వాత ఆ ఇంట్లోకి ఎంతోమంది వస్తారు. వాళ్లందరి నుంచీ ఎదురైన సమస్యని ఖాన్‌దాదా ఎలా పరిష్కరించుకున్నాడనేది క్లైమాక్స్. ఖాన్‌దాదా ఇంట్లో ప్రవేశించే నలుగురు కిడ్నాపర్లుగా నేను, బ్రహ్మాజీ, ముకుల్‌దేవ్, కెవిన్ (మోడల్) నటించాం. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఫిల్మ్. డబుల్ మీనింగ్స్, అసభ్యకరమైన మాటలు, సన్నివేశాలు ఉండవు.
బ్రహ్మానందం విశ్వరూపం
ఈ సినిమాలో ఎవరూ కామెడీ చెయ్యరు. సందర్భాలే కామెడీని సృష్టిస్తాయి. ఖాన్‌దాదాగా బ్రహ్మానందం విశ్వరూపం చూపించారు. ఈ సినిమాని నేనెలా ప్రేమించానో, ఆయనా అంతగా ప్రేమించారు. అయితే ఆయన వల్ల నాకు నష్టం జరిగింది. ఎలాగంటే ఆయన నటిస్తున్నప్పుడు 'కట్' చెప్పడం మర్చిపోయేవాణ్ణి. అలా నెగటివ్ ఎక్కువ ఖర్చయింది. ఆయన నటనలో ఎన్ని కోణాలున్నాయో అప్పుడు అర్థమైంది. ఖాన్‌దాదా ఇంట్లో, అతని చుట్టూ తిరిగే కథ కాబట్టి ఫోకస్ అంతా ఆయనమీద ఉండటం సహజం.
వాటిని ఇష్టపడి చెయ్యలేదు
'హోమం', 'సిద్ధం' నా తరహా సినిమాలు కావు. వాటిని నేను ఇష్టపడి చెయ్యలేదు. నాకు కామెడీ ఇష్టం. అందుకే బాపు, కె. విశ్వనాథ్ సినిమాలకంటే రాఘవేంద్రరావు, జంధ్యాల సినిమాలు ఎక్కువ ఇష్టం. నిజానికి నవ్వించడం కష్టమైన ప్రక్రియ. 'మనీ మనీ మోర్ మనీ' నా తరహా సినిమా. మనం అన్ని సినిమాల్ని కాక కొన్ని సినిమాల్నే ఎంజాయ్ చేస్తాం. అలాగే నేను చేసిన వాటిలో కొన్నింటినే ఎంజాయ్ చేశా. 'కాశి', 'సూరి, 'సర్వం' (తమిళం) వంటివి సరిగా ఆడలేదు. కానీ వాటిని ఎంజాయ్ చేశా. 'ఎగిరే పావురమా', 'హోమం' వంటివాటిని నేను ఎంజాయ్ చెయ్యలేదు. ఇక్కడ ఎంజాయ్ చెయ్యడమనేది ఆ సినిమా మేకింగ్‌కి సంబంధించింది. ఇప్పుడు 'మనీ మనీ మోర్ మనీ' మేకింగ్‌ని బాగా ఎంజాయ్ చేశా.
ఇదే తొలిసారి
ఒక సినిమాకి సీక్వెల్ రావడమనేది నాకు తెలిసి దేశం మొత్తం మీద 'మనీ మనీ'తోటే మొదలు. ఇప్పుడు సెకండ్ సీక్వెల్ రావడం ఇదే తొలిసారి. తొలి రెండు సినిమాలకి దర్శకుడు శివనాగేశ్వరరావు. నేను 'మనీ మనీ మోర్ మనీ' టైటిల్ రిజిస్టర్ చేసిన రెండు రోజులకి ఆయన నుంచి ఫోన్ వచ్చింది. 'మనీ మనీ మోర్ మనీ'తో ఇంకో సినిమా చేద్దామనుకుంటున్నానని ఆయన చెప్పారు. నేను నవ్వేసి, ఆల్రెడీ టైటిల్ రిజిస్టర్ చేశాననీ, సినిమా స్టార్ట్ చేస్తున్నాననీ చెప్పా. ఆయన 'ఆల్ ద బెస్ట్' చెప్పారు.
నాది బాధ్యతారాహిత్యం
నా కెరీర్‌కి నాదే బాధ్యత. తెలుగులో వరుసగా మంచి హిట్లిచ్చి బూమ్‌లో ఉండగా రాము గారు (రాంగోపాల్‌వర్మ) రమ్మనగానే ఇక్కడన్నీ వదిలేసి బాంబే వెళ్లిపోయా. 'సత్య' సినిమా చేశా. ఆయన దగ్గరే ఉన్నా. ఇదంతా పరిణతి లేక, బాధ్యతారాహిత్యంతో చేసింది. నా కెరీర్‌ని ఎలా మలచుకోవాలన్నది నా చేతిలో పని. కానీ నేనప్పుడు అలా చెయ్యలేదు. అయితే జరిగినదానికి నేనేమీ బాధపడట్లేదు.

No comments: