Saturday, July 2, 2011

న్యూస్: చిరంజీవి ఊగిసలాట

మెగాస్టార్ చిరంజీవి ఊగిసలాట ధోరణి మరోమారు స్పష్టమైంది. 149వ సినిమా 'శంకర్‌దాదా జినాదాబాద్' తర్వాత 150వ సినిమా చేస్తానని ఓసారి, చేయనని ఓసారి పలుమార్లు చెబుతూ వచ్చిన చిరంజీవి నాలుగు రోజుల తర్వాత ఇక సినిమాలకి పూర్తిగా గుడ్‌బై చెప్పి, రాజకీయాల్లోనే కొనసాగుతాననీ, సినిమాల సంగతి తన కుమారుడు రాంచరణ్ చూసుకుంటాడనీ తేల్చి చెప్పారు. కానీ జూన్ 30 రాత్రి ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ఏర్పాటైన 'బుడ్డా హోగా తేరా బాప్' ప్రీమియర్ షోలో పరిస్థితి మరోసారి మారింది. అందులో చిరంజీవి 149 సినిమాలతో ఆగిపోవడం ఏమీ బాగాలేదనీ, 150వ సినిమా చేస్తే బాగుంటుందనీ అమితాబ్ బచ్చన్ అనడం, రాంగోపాల్ వర్మ కూడా దానికి వంత పాడటం, ఆ సినిమాని తనే డైరెక్ట్ చేస్తానని పూరి జగన్నాథ్ చెప్పడంతో వెంటనే మనసు మార్చేసుకున్నారు. వర్మ పర్యవేక్షణలో, పూరి డైరెక్షన్లో, అమితాబ్ ఓ గెస్ట్ రోల్ చేస్తే తాను నటిస్తానని కమిటైపోయారు. చిరంజీవి 150వ సినిమా చేస్తే గనుక తాను గెస్ట్ రోల్ చేస్తానని అమితాబ్ అప్పటికప్పుడే చెప్పేశారు.
ఈ ప్రహసనమంతా చూసినవారు చిరంజీవి రెండు రోజుల్లోనే ఇలా తన మనసు మార్చుకోవడం చూసి ముక్కుమీద వేలేసుకున్నారు. మాటిమాటికీ ఇలా మాటలు మార్చేవాడు, కమిట్‌మెంట్ లేనివాడు ఎలా నాయకుడిగా రాణిస్తాడని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఈ ఊగిసలాడే ధోరణి వల్లే రాజకీయాల్లో ఆయన సక్సెస్ కాలేకపోతున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. తిరుపతిలో అత్యంత ఆర్భాటంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టి, ఎన్నికల్లో నిల్చుని, 18 సీట్లలో మాత్రమే తన పార్టీని గెలిపించుకో గల్గిన చిరంజీవి పాలకొల్లులో స్వయంగా ఓడిపోవడం ఆయనతో సహా అందర్నీ దిగ్భ్రమగొల్పగా, పార్టీ పెట్టిన రెండేళ్లలోనే ఏ పార్టీమీద కోపంతో కొత్త పార్టీ పెట్టారో, అదే కాంగ్రెస్‌లోనే దాన్ని కలిపేయడం ఆయన చపల మనస్థత్వానికి గట్టి నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు సినిమా చేయాలా, వద్దా అనే విషయంలోనూ ఆయనలో స్పష్టత కొరవడిందనీ, ఒక్క మాట మీద నిల్చునే దృఢ సంకల్పం ఆయనలో లేదనీ దీనివల్ల స్పష్టమవుతున్నదనీ వాళ్లు తేల్చి చెబుతున్నారు. ఇక ''అన్నయ్య 150వ సినిమా చేస్తారు, దాన్ని చరణ్ నిర్మిస్తాడు'' అని నాగబాబు ప్రకటించడం కొసమెరుపు.

No comments: