Monday, July 11, 2011

న్యూస్: హిట్టు కోసం తొమ్మిదేళ్లుగా నిరీక్షణ!

త్రివిక్రం దర్శకుడిగా పరిచయమైన 'నువ్వే నువ్వే'  (2002) తర్వాత హీరో తరుణ్‌కి ఇంతవరకు చెప్పుకోదగ్గ మరో హిట్ దక్కకపోవడం ట్రాజెడీ. తప్పకుండా హిట్టవుతాయనకున్న 'నవ వసంతం', 'భలే దొంగలు', 'శశిరేఖా పరిణయం' సినిమాలు కూడా అతనికి హేండిచ్చాయి. వీటిలో మొదటి దాన్ని ఆర్.బి. చౌదరి నిర్మిస్తే, రెండోది బాలీవుడ్ సూపర్ హిట్ 'బంటీ ఔర్ బబ్లీ'కి రీమేక్. ఇక మూడోదాన్ని డైరెక్ట్ చేసింది కృష్ణవంశీ. 'శశిరేఖా పరిణయం' వచ్చి రెండేళ్లయినా ఇంతవరకు తరుణ్ సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. విమలా రామన్ జతగా అతను నటించిన 'చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి' చిత్రం 2010లోనే విడుదల కావాల్సి ఉండగా ఇప్పటికీ జనం మధ్యకు రాలేకపోయింది. 2011లోనూ రెండుసార్లు విడుదల తేదీ ప్రకటించినా ఆ పని చేయలేకపోయారు నిర్మాతలు. ఈ సినిమాకి ఇద్దరు నిర్మాతలు, వారిలో ఒకరు సుప్రీం మ్యూజిక్ అధినేత రాజు హర్వాణీ కాగా, మరొకరు సినీ జర్నలిస్టు అయిన గోగినేని శ్రీనివాస్. ఆరంభంలో ఈ సినిమా షూటింగ్ సవ్యంగా నడవలేదు. మొదట డైరెక్టర్‌గా పెట్టుకున్న వి.ఎన్. ఆదిత్య నిర్మాతలతో పొసగక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దాంతో తమిళుడైన కన్మణితో ఈ సినిమాని పూర్తి చేశారు నిర్మాతలు. చివరిగా మే 27న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు వారు ప్రకటించారు. కానీ ఆ రోజున ఈ సినిమా రిలీజ్ కాలేదు. తిరిగి ఇప్పటివరకు ఈ సినిమా పరిస్థితి ఏంటో తెలీదు. ఇందులో తరుణ్, విమల హాట్ హాట్ బాత్ రూం సీన్‌లో నటించినట్లు నిర్మాతలు విడుదల చేసిన స్టిల్స్ వల్ల తెలుస్తోంది. తెరమీద ఆ సీన్లని తిలకించే అవకాశం ప్రేక్షకులకి ఎప్పుడొస్తుందో మరి. ఈ సినిమా సంగతి అలా ఉంచితే ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు తరుణ్. వాటిలో ఒకటి శ్రీకాంత్ కాంబినేషన్‌తో చేస్తున్న 'అనుచరుడు' కాగా, మరోటి శ్రీహరి కాంబినేషన్‌తో చేస్తున్న 'యుద్ధం'. ఈ సినిమాలైనా సకాలంలో విడుదలై, తరుణ్‌కి మంచి కెరీర్‌ని ఇస్తాయో, లేదో చూడాలి.

No comments: