Sunday, July 10, 2011

న్యూస్: మంచి కమర్షియల్ హిట్ కావాలి!

'పరుగు' తర్వాత అల్లు అర్జున్‌కి ఇంతవరకు సరైన్ హిట్ లభించలేదనే చెప్పాలి. తెలంగాణ గొడవలతో 'ఆర్య 2' నైజాంలో నష్టపోగా, 'వరుడు' డిజాస్టర్‌గా నిలిచింది. క్రిష్ డైరెక్ట్ చేసిన 'వేదం' నటుడిగా అతడికి మంచి పేరైతే తెచ్చింది కానీ కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. ఇక 40 కోట్ల రూపాయల భారీ వ్యయంతో అల్లు అరవింద్ నిర్మించగా, వీవీ వినాయక్ రూపొందించిన 'బద్రీనాథ్' విపరీతమైన అంచనాలతో రిలీజై, బ్రహ్మాండమైన ఓపెనింగ్స్‌ని రాబట్టింది. కానీ నేల విడిచి సాము చేసిన కథ, నేటివిటీని మిస్సయిన కథాంశం, 'ఓవర్' అయిన సన్నివేశాలు ఈ సినిమాకి మైనస్సులుగా మారి, క్రమేణా ప్రేక్షకుల సంఖ్యని పలుచన చేశాయి. పబ్లిసిటీతో కొంతవరకే సినిమాని నిలబెట్టగలమే కానీ, అంతిమంగా సినిమా బాగుంటేనే లాంగ్ రన్ ఉంటుందని 'బద్రీనాథ్' ఉదంతం తెలియజేసింది. అర్జున్ చేసిన డాన్సులు, ఫైట్లకి అన్ని వర్గాల నుంచి గొప్ప రెస్పాన్స్ వచ్చింది కానీ సినిమాని వారు మెచ్చలేకపోయారు. ఈ నేపథ్యంలో ఓ మంచి సినిమా, అదీ కమర్షియల్‌గా పెద్ద హిట్టయ్యే సినిమా అర్జున్ ఖాతాలో జమ కావాలి. ఈ నెల్లోనే మొదలు కాబోతున్న కొత్త సినిమాపై అతడు ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాకి డైరెక్టర్ త్రివిక్రం. దాంతో సహజంగానే దీనిపై అంచనాలు మొదలయ్యాయి. ఇలియానా లేదా కాజల్ అగర్వాల్ నటించనున్న ఈ సినిమా అయినా అర్జున్ దాహాన్ని తీరుస్తుందా?

No comments: