Wednesday, July 20, 2011

విశ్లేషణ: మంచి కథకు మంచి నేపథ్యం తోడైతే సూపర్‌హిట్టే!

ఏ కథకైనా నేపథ్యం (బ్యాక్‌డ్రాప్) ముఖ్యం. మంచి కథకు మంచి నేపథ్యం తోడైతే సినిమా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఒక ప్రాంతాన్ని నేపథ్యంగా హైలైట్ చేస్తూ తెలుగులో తీసిన సినిమాలు బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన సందర్భాలు అనేకం. గతంలో కాశ్మీర్, అమెరికా, సింగపూర్ తదితర ప్రాంతాల నేపథ్యంలో వచ్చిన సినిమాలు చెప్పుకోదగ్గ రీతిలో ప్రజాదరణ పొందాయి. ఈ మధ్య కాలంలో చెప్పుకోవాలంటే చిన్న సినిమా అయినా గోదావరి నేపథ్యంలో వంశీ రూపొందించిన 'గోపి గోపిక గోదావరి' పెద్ద మ్యూజికల్ హిట్టయ్యింది. గోపిక అనే లేడీ డాక్టర్ పేదలకు సేవ చేసే ఉద్దేశంతో గోదావరి గ్రామాల్లో పనిచేసే ఓ బోటు హాస్పిటల్లో పనిచేస్తుంటుంది. సెల్‌ఫోన్ ద్వారా పరిచయమైన గోపి అనే ఆర్కెస్ట్రా సింగర్‌ని ప్రేమిస్తుంది. అయితే ఓ యాక్సిడెంట్లో గోపి చనిపోయాడని విని హతాశురాలవుతుంది. చిత్రమేమంటే తలకి దెబ్బ తగిలి గతం మర్చిపోయిన గోపి ఆమె వల్లే కోలుకుని ప్రభుగా చలామణి అవుతాడు. చివరకు ఆ ఇద్దరూ ఎలా ఒక్కటయ్యారన్నది కథ. చక్రి సంగీతం సమకూర్చగా రామజోగయ్యశాస్త్రి రాసిన 'నువ్వక్కడుంటే నేనిక్కడుంటే' పాట ఏ నోట విన్నా వినిపించింది. చక్రి సంగీత మాయాజాలంతో పాటు గోదావరి తీరంలో వంశీ తీసిన సన్నివేశాలన్నీ జనాన్ని ఆకట్టుకోవడంతో 'గో గో గో' చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించింది.
దాని తర్వాత వచ్చిన పెద్ద సినిమా 'మగధీర' ఏ స్థాయి విజయాన్ని పొందిందో మనకు తెలుసు. అంతకు ముందు బాక్సాఫీస్ పరంగా నెంబర్‌వన్ స్థానంలో ఉన్న 'పోకిరి'ని వెనక్కినెట్టి ఏకంగా దానికి దాదాపు రెట్టింపు వసూళ్లతో అదరగొట్టింది. అలాంటి 'మగధీర'లోనూ ఓ ప్రాంతపు నేపథ్యం ఉంది. అది ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఉదయగఢ్ సామ్రాజ్యం. ఆ సామ్రాజం నేపథ్యంలో వచ్చే అన్ని సన్నివేశాలూ (ముఖ్యంగా రాంచరణ్-కాజల్, రాంచరణ్-దేవ్‌గిల్, రాంచరణ్-శ్రీహరి సన్నివేశాలు) ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఉదయఘడ్‌ని రక్షించే కాలభైరవ పాత్రలో రాంచరణ్ బ్రహ్మాండంగా ఆకట్టుకున్నాడు. ఉదయఘడ్‌ని కళా దర్శకుడు ఆనంద్‌సాయి తీర్చిదిద్దిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. రానున్న అరిష్టాన్ని పోగొట్టడానికి రాజకుమారి చేసే కాలభైరవ పూజా సన్నివేశాల చిత్రీకరణ, అక్కడ విలన్లతో హీరో కాలభైరవ పోరాడే తీరు అద్భుతమనిపించాయి.
అంతకుముందు గంగోత్రి, హరిద్వార్ నేపథ్యంలో వచ్చిన అల్లు అర్జున్ తొలి చిత్రం 'గంగోత్రి', చార్మినార్ నేపథ్యంలో వచ్చిన మహేశ్ 'ఒక్కడు', వరంగల్ నేపథ్యంలో వచ్చిన ప్రభాస్ 'వర్షం', కలకత్తా నేపథ్యంలో వచ్చిన చిరంజీవి 'చూడాలని ఉంది', రాయలసీమ నేపథ్యంలో వచ్చిన కొన్ని సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. వీటిలాగే ఘన విజయం పొందిన మరో సినిమా 'సింహాద్రి'. జూనియర్ ఎన్‌టీఆర్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాకు రాయలసీమతో పాటు కేరళను నేపథ్యంగా ఎంచుకున్నారు. 'ఇంద్ర'లో కాశీ, 'సింహాద్రి'లో కేరళ నేపథ్యాలు వాటి భారీ విజయాల్లో తమవైన పాత్ర పోషించాయి. 'వర్షం' సినిమా ప్రభాస్‌కు స్టార్‌డంను తీసుకొచ్చిందనేది వాస్తవం. శోభన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథకు నేపథ్యం వరంగల్. హీరో హీరోయిన్ల రొమాన్స్‌కు సాక్షీభూతంగా వరంగల్ నిలుస్తుంది. అంతదాకా వేయిస్తంభాల గుడి, కాకతీయ తోరణాన్ని ఎవరూ చూపించని రీతిలో ఈ సినిమాలో అందంగా చూపించారు.
అయితే కేవలం ఓ ప్రాంతాన్ని హైలైట్ చేస్తూ సినిమా తీసేస్తే కచ్చితంగా హిట్టు దక్కుతుందా? అనే ప్రశ్నకు 'కాదు' అనే జవాబే వస్తుంది. కథకు అనుగుణమైన నేపథ్యం, వాస్తవికంగా ఉండే చిత్రీకరణ మాత్రమే సినిమాను అందంగా తీర్చిదిద్దగలుగుతాయి. లేదంటే కోరి అపజయం తెచ్చుకున్నట్టే. ఉదాహరణకు అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'బద్రినాథ్'ను తీసుకోండి. ఈ సినిమా కథకు నేపథ్యంగా హిమాలయాల్లోని తక్షశిలనీ, అక్కడి బద్రీనాథ్ దేవాలయాన్నీ ఎంచుకున్నారు. అయితే కథలో లోపాలు, గురు (ప్రకాష్‌రాజ్), శిష్య (అల్లు అర్జున్) అనుబంధాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోవడం, ఇలాంటి సినిమాలకి అత్యవసరమైన ఎమోషన్‌ని క్యారీ చేయకపోవడం, దర్శకత్వ లోపాలు ఈ సినిమాకి ఆశించిన రీతిలో విజయాన్ని ఇవ్వలేకపోయాయి. అయితే బద్రీనాథ్ దేవాలయం సెట్లో తీసిన సన్నివేశాలు బాగుండటం గమనార్హం.
అలాగే పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన 'తీన్‌మార్' సినిమా కొంతవరకు దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ నేపథ్యంలో నడుస్తుంది. అక్కడ హీరో చెఫ్‌గా పనిచేస్తుంటాడు. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'లవ్ ఆజ్ కల్'కి రీమేక్‌గా వచ్చినప్పటికీ తెలుగు నేటివిటీని మిస్సవడం, స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా లేకపోవడం ఈ సినిమాకి మైనస్సులయ్యాయి. ఇక మహా శక్తిపీఠాల నేపథ్యంతో పాటు రాజస్థాన్, కాశ్మీర్ నేపథ్యంలో వచ్చిన ఎన్‌టీఆర్ సినిమా 'శక్తి' అసహజమైన సన్నివేశాల కారణంగా ఘోర పరాజయం పాలైంది. ఇష్టమొచ్చినట్లు భారీగా ఖర్చుపెట్టేసి, 'మగధీర'ని మించిన సినిమా తీయాలనుకునే యత్నంలో నేల విడిచి సాము చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఈ సినిమా బాక్సాఫీసు ఫలితం మరోసారి స్పష్టం చేసింది. దీన్నిబట్టి మంచి కథకు మంచి నేపథ్యం అనేది మరింత శోభను చేకూర్చిపెడుతుందనే సంగతితో పాటు కథలో దమ్ము లేకపోతే మంచి నేపథ్యం కూడా వృథా అవుతుందనే విషయం అర్థమవుతుంది.
తాజాగా కొన్ని సినిమాలు అమెరికా, మలేషియా, బ్యాంకాక్ వంటి విదేశీ నేపథ్యాలతో తయారవుతున్నాయి. ఓవర్సీస్‌లోని తెలుగువాళ్లని కూడా మెప్పించే ఉద్దేశంతో ఇప్పుడు ఈ తరహా నేపథ్యాలు తెలుగు సినిమాల్లో ఎక్కువవుతున్నాయి. అయితే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సత్తా వీటికి ఉంటుందా?

No comments: