Thursday, July 7, 2011

స్టోరీ: విదేశీ లొకేషన్లకే టాలీవుడ్ ఓటు

తెలుగు నిర్మాతలు, దర్శకుల ధోరణి మారుతోంది. తన సినిమాలకి హంగులు అద్దడంలో భాగంగా ఫారిన్ లొకేషన్లకి పరుగులు పెడుతున్నారు. భారతీయ, తెలుగు అందాల స్థానంలో విదేశీ సోయగాలకు పట్టం కడుతున్నారు. ఫారిన్ లోకేషన్లలో షూటింగ్ జరగని సినిమాలు టాలీవుడ్లో తగ్గిపోతున్నాయి. ప్రకృతి సౌందర్యాన్ని పోతపోసుకున్న తెలుగు, భారతీయ ప్రదేశాల్ని వదిలి విదేశీ లొకేషన్ల వేట అన్నది కొన్నేళ్లుగా ఎక్కువైంది. ఇందుకు కారణం.. తెలుగు సినిమాకు ఓవర్సీస్ మార్కెట్ పెరగడమే. మనవాళ్ల విదేశీ వ్యామోహాన్ని సొమ్ము చేసుకోడానికి అనేక దేశాలు ముందుకొస్తున్నాయి. తమ తమ దేశాల్లో ఉన్న అందమైన ప్రదేశాలు, అరుదైన కట్టడాలు, నిర్మాణాల్లో షూటింగులు జరుపుకునేందుకు ఇబ్బడి ముబ్బడిగా అనుమతులు ఇచ్చేస్తున్నాయి.
ముఖ్యంగా ఆసియా, ఐరోపా, ఆస్ట్రేలియా దేశాలు నిరాటంకంగా షూటింగులు జరుపుకోడానికి అనుమతులతో పాటు అనేక రాయితీలు కల్పిస్తున్నాయి. నిజం చెప్పాలంటే మన రాష్ట్రంలో షూటింగ్ జరుపుకోవడమే ఇప్పుడు కష్టమైపోతోంది. విదేశాల్లో కంటే ఇక్కడే ఖరీదెక్కువ అవుతోంది. ఇటీవలి కాలంలో థాయిలాండ్, మలేషియా దేశాల్లో తెలుగు సినిమాల షూటింగ్ అనేది సాధారణ విషయమైపోయింది. దర్శకుడు పూరి జగన్నాథ్‌కి థాయిలాండ్ అంటే ఎంతిష్టమో తెలిసిందే. ఒకట్రెండు సినిమాలు మినహా అన్ని సినిమాలకీ అతను థాయిలాండ్ వెళ్లి బ్యాంగ్‌కాక్, ఫుకెట్, పట్టాయాలలో షూటింగ్ చేసుకొచ్చాడు. పోకిరి, చిరుత, ఏక్ నిరంజన్, గోలీమార్, నేను నా రాక్షసి సినిమాల్లో కొన్ని సీన్ల కోసమో, పాటల కోసమో అతను థాయిలాండ్ వెళ్లాడు.
ఇటీవలి కాలంలో పాపులర్ అయిన మరో విదేశం మలేషియా. బిల్లా, కిక్, ప్రయాణం, గోలీమార్‌తో పాటు ఇప్పుడు నిర్మాణంలో ఉన్న నా ఇష్టం, రేయ్, ముగ్గురు వంటి సినిమాల్ని అక్కడి కౌలాలంపూర్, పుత్రజయ, లంకావి వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపారు. వెంకటేశ్ సినిమా 'జయం మనదేరా', నాగార్జున సినిమా 'మన్మథుడు' సినిమాల్ని ఫ్రాన్స్, జర్మనీ, యుకెలలో చిత్రీకరించారు. నాగచైతన్య తాజా చిత్రం 'దడ'లోని కొన్ని సన్నివేశాల్ని జర్మనీలో, అమెరికాలో తీశారు. ఇదివరకు ఎడారుల్లో షూటింగ్ అంటే రాజస్తాన్‌కి వెళ్లేవాళ్లు. ఇప్పుడు దుబాయ్, ఒమన్, జోర్డాన్, టర్కీ వంటి ప్రదేశాలకి వెళ్తున్నారు. 'పౌరుడు', 'బృందావనం' సినిమాలు అందుకు ఉదాహరణ.
ఆఫ్రికా ఖండం ఏమీ తక్కువ తినలేదు. ఈజిప్టు, దక్షిణాఫ్రికా దేశాలు టూరిజానికీ, సినిమాలకీ పేరుపొందాయి. ఎన్‌టీఆర్ 'కంత్రి'లోని ఓ పాటని దక్షిణాఫ్రికాలోని మ్యూజెన్‌బర్గ్ బీచ్ (కేప్‌టౌన్)లో చిత్రీకరించారు. రవితేజ ఇటీవలి సినిమా 'డాన్ శీను' చిత్రీకరణ కోసం స్పెయిన్‌లోని బార్సిలోనాకు వెళ్లారు. గ్రీస్‌లో 'కేడి' చిత్రీకరణ సందర్భంగా నాగార్జునని ఆ దేశపు ప్రభుత్వం సత్కరించింది. భారతీయుల పట్ల జాతి వివక్ష ఆరోపణలతో భారత్-ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న సమయంలో రాంచరణ్ 'ఆరెంజ్' షూటింగ్ అక్కడి మెల్బోర్న్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆ సినిమా యూనిట్‌కి ఆస్ట్రేలియా అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించారు.
ఇలా విదేశీ లొకేషన్లు మన టాలీవుడ్ వ్యక్తుల్ని బాగా ఆకర్షిస్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని సినిమాల షూటింగులు విదేశాల్లో జరగడం ఖాయం.

No comments: