Tuesday, July 5, 2011

న్యూస్: ఆర్తీ అగర్వాల్‌కి ఏం గతి పట్టింది?

ఆర్తీ అగర్వాల్ టాప్ హీరోయిన్‌గా వెలుగొంది ఎంతకాలమైందనీ? అప్పుడే ఆమెకి ఇప్పటి స్థితి దాపురిస్తుందని ఎవరైనా అనుకున్నారా? ప్రస్తుతం ఆమె 'వనకన్య వండర్ వీరుడు' అనే సినిమాలో నటిస్తోంది. అందులో తప్పేముంది అనుకోవచ్చు. కానీ ఇప్పటివరకు నాసిరకం సినిమాలే తీస్తూ వచ్చిన శివనాగు దర్శకత్వం వహిస్తున్న సినిమా అది. అందులో ఆయన కుమారుడే హీరో. ఇప్పుడే ఆ కుర్రాడు టెంత్ క్లాస్‌కి వచ్చాడు. అతడి పేరు కూడా చిత్రంగా ఉంటుంది. 'మెగా సుప్రీం' అనేది అతడి పేరు. మొదట్లో 'సుప్రీం' అనే పెట్టాడు. తర్వాత 'మెగా'ని కూడా జోడించాడు. చిరంజీవిని మొదట్లో సుప్రీం హీరో అనీ, తర్వాత మెగా స్టార్ అనీ పిలిచారు కదా. అందుకని ఆ రెండు పేర్లనీ కలిపి మనవాడికి 'మెగా సుప్రీం' అని పెట్టేశాడు శివనాగు. కేవలం అది స్క్రీన్ నేం అనుకునేరు. సర్టిఫికెట్లలో ఉండే పేరు అదే. ఆ కుర్రాడు 'వండర్ వీరుడు' అయితే, ఆర్తీ అగర్వాల్ 'వనకన్య' అంట. భయపడక్కర్లేదు. ఆర్తీ ఆ కుర్రాడికి జోడీ కాదు. సినిమాలో ఆర్తీని అతను 'అక్క' అనే పిలుస్తాడంట. బతికిపోయాం. తెలిసిన విషయమేమంటే చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించగా సూపర్ హిట్టయిన్ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమానే కాస్త అటూ ఇటూ మార్చి ఈ సినిమాని శివనాగు రూపొందించాడు. మంచి అవకాశాలు ఆమడ దూరంలో ఉండటంతో చేసేది లేక, డబ్బుల కోసం ఏదో ఓ సినిమాని చేసేస్తున్నట్లుంది ఇప్పటికీ అందం చెదరని ఈ ముద్దుగుమ్మ. చేసుకున్న వాళ్లకి చేసుకున్నంత అని ఊరకే అనలేదు కదా. తొందర్లోనే 'వనకన్య వండర్ వీరుడు' ప్రేక్షకుల మధ్యకు రాబోతున్నారు. జాగ్రత్త!

No comments: