Wednesday, July 6, 2011

న్యూస్: రాజశేఖర్‌కి మంచిరోజులు వచ్చేనా?


అదేంటో గానీ రాజశేఖర్ ఏం చేయాలనుకున్నా పరిస్థితులు ఎదురు తిరుగుతున్నాయి. గడచిన పదేళ్లలో అతని సినిమాలు రెండంటే రెండే హిట్టయ్యాయి. అవి 'సింహరాశి', 'గోరింటాకు'. ఈ రెండింటి నిర్మాత ఒక్కరే. ఆయన మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి. చౌదరి. 'ఎవడైతే నాకేంటి'ని కూడా రాజశేఖర్, జీవిత హిట్టు కింద జమ చేస్తారు కానీ, దానికి పెట్టిన డబ్బు వసూలు కాలేదు. అప్పులు తీరలేదు. హీరో పాత్రలు తప్ప ఇతర ప్రధాన పాత్రలు చేయనని మునగదీసుకు కూర్చోవడంతో తాను ఎంత నష్టపోతున్నదీ ఆయన గ్రహించడం లేదు. పరిస్థితులకు తగ్గట్లు మారినందునే హీరో పాత్రలకంటే ఇతర పాత్రల ద్వారానే శ్రీహరి ఎక్కువ సొమ్ము చేసుకో గలుగుతున్నాడు. సరే. అసలే 'లేట్ లతీఫ్' అనే బిరుదు సంపాదించుకున్న రాజశేఖర్‌తో సినిమా తీయాలంటేనే నిర్మాతలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు దర్శకులు కూడా ఆయనతో సినిమా అంటే ఠారెత్తుతున్నారు. ఎక్కడ మధ్యలో తమని తీసేసి జీవితనే డైరెక్టర్ అనేస్తాడేమోనని సందేహిస్తున్నారు. ఆయన తాజా సినిమా 'మహంకాళి' విషయంలో అదే జరిగింది. కార్తికేయ అనే ఓ కొత్త డైరెక్టర్ ఈ సినిమాని ప్రారంభించాడు. మధ్యలో అతని పనితనం నచ్చలేదనే వంకతో అతన్ని తొలగించి జీవితే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తోంది. ఇటీవల చెన్నైలో ఓ ఫైట్ సీన్ తీస్తుంటే పైనుండి కిందపడి బాగా గాయపడ్డాడు రాజశేఖర్. నాలుగైదు రోజుల్లో షూటింగంతా అయిపోతుందని అనుకునేంతలో ఇలా జరగడంతో నిర్మాతలు యేలూరు సురేందర్‌రెడ్డి, పరంధామరెడ్డి బాధ వర్ణనాతీతం. 50 యేళ్లకు దగ్గరవుతున్నా ఇంకా 20 యేళ్ల కుర్రాడిలా ఊహించుకుని రిస్క్ సీన్లు చేయడమెందుకు? ఇలా దెబ్బలు తినడమెందుకు? నిర్మాతల్ని ఇబ్బంది పెట్టడమెందుకు? ఇంతకీ 'మహంకాళి'తో అయినా ఈ భార్యాభర్తల జోడీ విజయాన్ని సాధిస్తుందా? డౌటే!

No comments: