Friday, September 30, 2011

సంస్కృతి: భాష, సంస్కృతి ఒకటేనా?

భాషపై మనకున్న ప్రేమ, గౌరవం కొద్దీ సంస్కృతికి అదే విధానమని చెప్పడం సరైంది కాదు. భాషా ప్రభావం సంస్కృతిపై ఎక్కువగానే పడుతుంది. కాని, అంతమాత్రం చేత భాషే సంస్కృతి కాదు. భాషకే కాక, భౌగోళిక, వాతావరణ పరిస్థితులకు సైతం సంస్కృతి స్వరూప స్వభావాల నిర్ణయంలో తగినంత ప్రాధాన్యం ఉంటుంది. భారతీయ సంస్కృతిపై ఇక్కడి హిమాలయాల, ఇక్కడి మహానదుల ప్రభావం స్పష్టం. సింధు, గంగా, యమునలకు జన్మస్థానం హిమాలయాలే. హరప్ప, మొహంజోదారోలు, ఇంద్రప్రస్థ, పాటలీపుతలు, వారణాసి, ప్రయాగలు, ఢిల్లీ, ఆగ్రాలు - ఆ నదీ తీరాలలోనో, వాటి లోయల్లోనో విలసిల్లిన మన జాతీయ సంస్కృతీ కేంద్రాలు. బౌద్ధ శిల్పకళ మహోన్నత శిఖరాల్ని అందుకున్నది కృష్ణానదీ పరిసరాల్లో. ఆంధ్ర మహాభారత రచన శ్రీకారం చుట్టుకుంది గోదావరి గట్టున. 'ఓం తత్సత్'ని రాసింది పెన్నానది ఒడ్డున. విజయనగర సామ్రాజ్య సంస్థాపన జరిగింది తుంగభద్ర తీరాన.
భాషాప్రభావానికి సంస్కృతి కొంతవరకు లోనవుతుంది కాబట్టి భాషకు, సంస్కృతికి భేదమే లేదనడం కరక్టేనా? భాషనే సంస్కృతిగా పేర్కొనడం భాష గురించీ, సంస్కృతి గురించీ మనకేమీ తెలీదని చాటుకోవడమే! ఒకరి భాష మరొకరికి పట్టుబడినట్లు, ఒకరి సంస్కృతి మరొకరికి సంక్రమించదు. బ్రిటీష్ వాళ్లు రెండు శతాబ్దాలపాటు మనదేశాన్ని పాలించడంతో మనలో చాలామందికి ఇంగ్లీసు భాషతో పరిచయమేర్పడింది. చాలామంది అందులో పండితులయ్యారు కూడా. అయినంత మాత్రాన బ్రిటీష్ సంస్కృతి మన వారసత్వమైందా?
సంస్కృతి అంటే భాష కాదు సరికదా, కొందరు చెబుతున్నట్లు అది ఆధ్యాత్మిక సంబంధమైందీ కాదు. అదే అయితే ఆధ్యాత్మిక దృష్టిలేనివాళ్లని సంస్కృతీ విహీనులనవలసి వస్తుంది. అప్పుడు నిరీశ్వరవాదులైన మార్క్స్, ఏంగెల్స్ వారసులైన కమ్యూనిస్టులందరూ సంస్కృతిలేనివాళ్లని చెప్పాల్సి వస్తుంది. అది తప్పు కాదా? ఆధ్యాత్మిక ప్రపంచానికి సంస్కృతిని పరిమితం చేయడం భాషకు మారుగా మతానికి, లేదా, దార్శనికానికి దాన్ని ఓ పర్యాయపదం చేయడమే అవుతుంది.
భాషకు భిన్నమైనట్లే మతానికీ, దార్శనికానికీ సైతం సంస్కృతి భిన్నం. జీవితానికున్న విస్తృతి, దానికున్న వైవిధ్యం, దానిలో ప్రస్ఫుటమవుతూ ఉండే విలక్షణత్వం సంస్కృతికీ ఉంటుంది. అందువల్లనే సంస్కృతిని నిర్వచించడం కష్టం.

No comments: