Wednesday, September 28, 2011

న్యూస్: సినిమా పాటల ప్రియులకు విలువైన కానుక 'మరో నూట పదహార్లు'

తెలుగు సినిమా ప్రియులు, సంగీత ప్రియులు పదిలంగా చదివి, దాచుకోదగ్గ అత్యుత్తమ పుస్తకం 'మరో నూట పదహార్లు'. 1940-85 మధ్య కాలంలో వచ్చిన వందలాది సినిమాల్లోని వేలాది పాటల్లోంచి సాహిత్యమూ, సంగీతమూ నువ్వా నేనా అని పోటీపడిన 116 పాటల విశేషాలతో భమిడిపాటి రామగోపాలం (భరాగో) తీసుకొచ్చిన పుస్తకమిది. 1981లో ఆయనే వెలువరించిన '116 గొప్ప తెలుగు సినిమా పాటలు' పుస్తకానికి ఇది కొనసాగింపు. ఈ పుస్తకంలో సినిమాలు 116 అయినప్పటికీ 'సాంగ్ ఐటంస్' (పాటలు, పద్యాలు, శ్లోకాలు, అష్టపదులు, బుర్రకథలు, యక్షగానాలు, దండకాలు, తత్త్వాలు) అన్నీ కలిపి 150 దీనిలో చేరాయి. ఈ పాటలని ఎంపిక చేయడంలో భరాగో ముదుసలి వయసులో చాలా శ్రమకోర్చారు. ఎంపిక చేసిన పాటల ట్రాకులు వాడుకోడానికి హక్కుల కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించకపోయినా పట్టు విడవకుండా ఈ పుస్తకాన్ని వెలువరించారు. ఇందుకు ఆయనకి అనేకమంది హితులు, స్నేహితులు సహకరించారు. వారిలో విజయవాడకు చెందిన నేమాని సీతారాం ముఖ్యులు.
ఈ పుస్తకంలో 1940లో వచ్చిన 'సుమంగళి'లోని 'ప్రేమమయమీ జీవనము' పాట మొదలుకుని 1985లో వచ్చిన 'మయూరి'లోని 'అందెలు పిలిచిన' పాట వరకు ఉన్నాయి. ఈ పాటల పూర్తి పాఠంతో పాటు వాటికి సంబంధించిన విశేషాల్నీ సాధ్యమైనంతవరకు అందించారు భరాగో. కొన్ని సినిమాల కథాంశాలూ తెలియజేశారు. 'భాగ్యలక్ష్మి' ద్వారా మరాఠీ నటి కమలా కోట్నిస్, గాయనిగా రావు బాలసరస్వతి పరిచయమైన సంగతి మనం తెలుసుకుంటాం. ఇలాంటివే మనకి తెలీని పలు సంగతుల్ని ఈ పుస్తకం ద్వారా తెలియపర్చారు రచయిత. ప్రస్తుతం భరాగో మన మధ్య లేకపోయినా (2010 ఏప్రిల్లో మరణించారు) తన రచనలు, '116 గొప్ప తెలుగు సినిమా పాటలు', 'మరో నూట పదహార్లు' ద్వారా ఆయన చిరంజీవిగానే ఉంటారు.

No comments: