Saturday, September 24, 2011

మరపురాని చిత్రం: ప్రేమనగర్


రామానాయుడు సినీభవితవ్యాన్ని నిర్దేశించి, నిర్మాతగా ఆయన్ని నిలబెట్టిన 'ప్రేమనగర్' చిత్రం విడుదలై నేటికి సరిగ్గా నలభై ఏళ్లు. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలు..
ప్రఖ్యాత నిర్మాత డి. రామానాయుడు ఈరోజున అత్యధిక చిత్రాల నిర్మాతగా చరిత్రలో స్థానం దక్కించుకున్నారంటే అందుకు మూలస్తంభం 'ప్రేమనగర్' చిత్రం. ఈ సినిమాకి ముందు ఆయన కె. బాపయ్యను డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ 'ద్రోహి' చిత్రాన్ని నిర్మించారు. జగ్గయ్య, వాణిశ్రీ, నాగభూషణం కాంబినేషన్‌లో తయారైన ఈ సినిమా అట్టర్‌ఫ్లాపయ్యింది. దీనితో ఐదు లక్షల రూపాయల నష్టం చవిచూశారు రామానాయుడు. 40 ఏళ్ల క్రితం అది చాలా పెద్ద మొత్తం. అప్పుడాయనకు రెండే దార్లు మిగిలాయి. ఒకటి నిర్మాతగానే కొనసాగి, నష్టాన్ని పూడ్చుకోవడం, లేదంటే చెన్నై దగ్గరోని కోణంబాకంలో ఉన్న పొలాలతో వ్యవసాయం చేసుకోవడం. తాడో పేడో తేల్చుకుందామని చివరి ప్రయత్నంగా 'ప్రేమనగర్' ప్రాజెక్టుని ప్రారంభించారు.
కోడూరి కౌసల్యాదేవి అదే పేరుతో రాసిన నవల అప్పటికే పాపులర్ కావడంతో దాని హక్కుల్ని నిజామాబాద్‌కు చెందిన కొత్త నిర్మాత శ్రీధర్‌రెడ్డి కొన్నారు. అందులో నటించేందుకు అక్కినేని నాగేశ్వరరావు అంగీకరించారు. అయితే శ్రీధర్‌రెడ్డి ఎంతకీ ఆ సినిమా ప్రారంభించక పోవడంతో ఆయన నుంచి ఆ హక్కులు కొనుగోలు చేశారు రామానాయుడు. అప్పటికే తమ బేనర్‌లో 'స్త్రీజన్మ'ని తీసిన కె.ఎస్. ప్రకాశరావుని దర్శకునిగా తీసుకున్నారు. రచయిత ఆత్రేయతో కలిసి నవలలో చాలా మార్పులు చేశారు ప్రకాశరావు. సినిమా సెట్స్ మీదకు వెళ్లే ముందు రామానాయుడికి బౌండ్ స్క్రిప్ట్ అందించారు ఆత్రేయ.
రూ. 15 లక్షల ఖర్చు అంచనాతో ఈ సినిమా ప్రారంభించారు. అక్కినేని, వాణిశ్రీ, సత్యనారాయణ, రాజబాబు, రమాప్రభ, గుమ్మడి వంటి భారీ తారాగణంతో రామానాయుడు 'ప్రేమనగర్'ని మొదలు పెట్టారని తెలిసి సినీ వర్గాలు ఆశ్చర్యపోయాయి. అప్పటికే వాళ్లకి తెలుసు, రామానాయుడు నిండా మునిగిపోయి ఉన్నారని. కొంతమంది సన్నిహితులు రిస్క్ తీసుకోవద్దని వారించినా ఆయన లెక్కచెయ్యలేదు. 1971 జనవరి 20న చెన్నై వాహినీ స్టూడియోలో కొబ్బరికాయ కొట్టి షూటింగ్ ప్రారంభించారు అక్కినేని. పూజలకు అక్కినేని దూరమైనా రామానాయుడు అడిగేసరికి కాదనలేకపోయారు. ఆరు నెలల్లో సినిమా పూర్తయింది. 1971 సెప్టెంబర్ 24న 'ప్రేమనగర్' విడుదలైంది. అప్పుడే పెద్ద గాలివాన. రామానాయుడిని ఓవైపు ఆందోళన, మరోవైపు నమ్మకం కలిపి విచిత్రావస్థలోకి నెట్టాయి. అయితే ప్రేక్షకులు 'ప్రేమనగర్'కి బ్రహ్మరథం పట్టారు. ప్రేమ కథా చిత్రాల నాయకునిగా అక్కినేని ఇమేజ్‌ని మరింత పరిపుష్టం చేస్తూ అఖండ విజయం సాధించింది ఈ సినిమా.
హీరో కల్యాణ్‌వర్మ పాత్రకి జీవం పోశారు అక్కినేని. 'మనసు గతి ఇంతే', 'ఎవరి కోసం ఈ ప్రేమమందిరం' అంటూ ఆత్రేయ రాసిన అపూర్వ గీతాలని అంతే అపూర్వ స్థాయిలో అభినయించి వాటికి చిరస్థాయిని కల్పించడంలో తనవంతు పాత్ర పోషించారు. అలాగే నవలా నాయికగా వాణిశ్రీకి ఈ చిత్రం సరికొత్త ఇమేజ్ తెచ్చింది. ఆమె కట్టు, బొట్టు, కొప్పుని అనుకరించడానికి ఆ రోజుల్లో యువతులు పోటీపడ్డారు. అక్కినేని, వాణిశ్రీపై చిత్రీకరించిన డ్యూయెట్లు యువతని ఎంతగా రంజింపచేశాయో చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో సత్యనారాయణ చిన్నప్పటి పాత్రలో వెంకటేశ్ నటించడం విశేషం.
తెలుగు సినిమా సాధించిన అమోఘమైన విజయంతో దీన్ని తమిళంలోనూ నిర్మించాలనుకున్నారు రామానాయుడు. శివాజీ గణేశన్, వాణిశ్రీ జంటగా 'వసంత మాళిగై' పేరుతో రీమేక్ చేశారు. అక్కడా ఆ సినిమా దిగ్విజయం సాధించి, తమిళనాడులో రామానాయుడికి 'వసంత మాళిగై రామానాయుడు'గా పేరు తెచ్చింది. ఇలా రెండు భాషల్లో ఈ సినిమా సూపర్‌హిట్టయ్యాక ఆయన కన్ను బాలీవుడ్ మీద పడింది. హిందీ 'ప్రేంనగర్'కు రూపకల్పన జరిగింది. అందులో నటించేందుకు అప్పటి హిందీ రొమాంటిక్ హీరో రాజేశ్‌ఖన్నా, డ్రీం గర్ల్ హీమమాలిని సరేనన్నారు. అక్కడా ఈ సినిమా విజయకేతనం ఎగురవేసింది. రామానాయుడి బాలీవుడ్ ప్రవేశం ఘనంగా మొదలైంది. ఈ మూడు భాషల్లోనూ దర్శకుడు ప్రకాశరావే. ఇలా ఈ సినిమా విజయ విహారం చేయడంతో రామానాయుడు ఎక్కడికీ కదలాల్సిన అవసరం లేకపోయింది.

No comments: