Wednesday, September 7, 2011

న్యూస్: మెహర్ రమేశ్ భలే మాయగాడు!

మాయగాడంటే మెహర్ రమేశే అంటున్నారు ఫిలింనగర్ జనాలు. అతను తీసిన మూడు తెలుగు సినిమాల్లో ఏ ఒక్కటీ హిట్ కాకపోయినా పెద్ద హీరోలతో వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా అతను రవితేజని డైరెక్ట్ చేసే ఛాన్స్ సంపాదించిన సంగతి తెలిసిందే. 'పవర్' టైటిల్‌తో రూపొందే ఈ సినిమాకు మళ్ల విజయప్రసాద్ నిర్మాత.
తెలుగులో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన 'కంత్రి'తో దర్శకుడిగా పరిచయమైన మెహర్ రమేశ్‌కి ఆ సినిమా ఆడకపోయినా ప్రభాస్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ సినిమా 'బిల్లా'ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. అన్ని భాషల్లోనూ సూపర్ హిట్టయిన ఈ సినిమా తెలుగులోనే అనుకున్నట్లు ఆడలేదు. అయినా ఏకంగా 40 కోట్ల రూపాయల మెగా బడ్జెట్‌తో సి. అశ్వనీదత్ నిర్మించిన 'శక్తి' సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం పొందాడు. అది ఎన్టీఆర్‌తో రెండో సినిమా. బాక్సాఫీసు వద్ద 'శక్తి' ఎంత ఘోరంగా ఫ్లాపయ్యిందీ తెలిసిందే. ఆ సినిమాని కొన్న బయ్యర్లంతా మట్టికొట్టుకు పోయారు.
మరో డైరెక్టర్‌కైతే అంతటితో కెరీర్ దాదాపు క్లోజ్ అయ్యేదే. లేదంటే చిన్నా చితకా హీరోల సినిమాలతో సరిపెట్టుకోవాల్సిందే. కానీ మెహర్ రమేశ్ అలాంటి వాడు కాడయ్యే. మాటల్తో ఎలాంటివాళ్లనైనా చిత్తుచేసే కోడి రామకృష్ణ తరహాకి చెందినవాడయ్యే. అందుకే రవితేజతో 'పవర్' సినిమాని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. అతనెంతగా మళ్ల విజయప్రసాద్‌ని నమ్మించాడో ఆయన మాటల్ని బట్టి అర్థమవుతుంది."ఈ సినిమాకి వక్కంతం వంశీ అద్భుతమైన కథను అందించారు. రవితేజ పవర్, ఎనర్జీతో పాటు, మెహర్‌ రమేష్ టేకింగ్ స్టయిల్ నచ్చి ఈ సినిమా నిర్మిస్తున్నాం. బడ్జెట్ లిమిట్ లేకుండా చాలా లావిష్‌గా, స్టయిలిష్‌గా రూపొందే ఈ చిత్రం షూటింగ్ 'ఇడియట్-2' తరువాత 2012 మార్చిలో ప్రారంభిస్తాం" అన్నారు విజయప్రసాద్. మెహర్ రమేశ్ మాయ చూసి ఫిలింనగర్ వాసులంతా ముక్కుమీద వేలేసుకుంటున్నారు.

No comments: