Monday, September 5, 2011

న్యూస్: రాజేంద్రప్రసాద్ 'డ్రీం' ప్రాజెక్ట్!

సీనియర్ హాస్య కథానాయకుడు రాజేంద్రప్రసాద్ ఇప్పుడు హాస్యాన్ని కాకుండా ప్రయోగాల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. 'ఆ నలుగురు' నుంచి ఆయనలో ఈ మార్పు కనిపిస్తోంది. ఆ మధ్య 'శ్రేయోభిలాషి'ని చేసిన ఆయన ఇప్పుడు 'డ్రీం' అనే మరో ప్రయోగాత్మక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో కొత్త టెక్నీషియన్లు టాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు. ఇదివరకు 'ఐ వోట్ ఫర్' అనే షార్ట్ ఫిలింకు నేషనల్ అవార్డ్ పొందిన భవానీ శంకర్ ఆ ఉత్సాహంతో ఈ సినిమాని సొంతంగా నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్నాడు. "కల్ట్ థ్రిల్లర్ కథాంశంతో ఇంతవరకూ తెలుగులో ఏ చిత్రం రాలేదు. ఆ తరహాలో రూపొందుతున్న తొలి సినిమా మాదే. సినిమాలోని సన్నివేశాలను సింగిల్ షాట్స్‌లో తీస్తున్నాం. టెక్నికల్ హైఎండ్ టీమ్‌తో రూపొందుతున్న ఎంటర్‌టైనర్ ఇది. ఓ ఆర్మీ మేజర్ అంతవరకూ జీవితంలో తను చేయాలనుకున్న పనులు రిటైర్ అయిన తరువాత ఒక్కొక్కటీ చేయడం మొదలుపెడతాడు" అని ఆయన చెప్పాడు. ఈ చిత్రంలో మరో 30 ప్రధాన పాత్రల్ని రంగస్థల నటులు చేస్తుండటం విశేషం.
సత్యజిత్‌రాయ్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందిన రవికుమార్ నీర్ల ఈ చిత్రానికి ఛాయాగ్రాహకునిగా, ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ స్కూల్‌కి చెందిన సంతోష్ సంగీత దర్శకునిగా పనిచేస్తున్నారు. అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో ఆర్మీ మేజర్‌గా రాజేంద్రప్రసాద్ ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.

No comments: