Tuesday, September 6, 2011

మన చరిత్ర: పొట్టి శ్రీరాములు మరణం - నెహ్రూ ఆంధ్ర రాష్ట్ర ప్రకటన

1950 నాటికి రాష్ట్ర సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. స్వామి సీతారాం సత్యాగ్రహమంటూ మొదలుపెట్టాడు. తెలంగాణాలో పోలీసుల దురంతాలు, కమ్యూనిస్టులపై చిత్రహింసలు అధికమయ్యాయి. 1952 అక్టోబర్ 18న పొట్టి శ్రీరాములు రాష్ట్ర సాధనకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. నాయకులకు చీమ కుట్టినట్టయినా లేదు. నాటి ముఖ్యమంత్రి రాజగోపాలాచారి దీన్ని పట్టించుకోలేదు. చివరకు 1952 డిసెంబర్ 15న శ్రీరాములు చనిపోయారు. తెలుగుదేశం అట్టుడికినట్లుడికింది. తెలుగునాడు మంటల్లో మునిగింది. డిసెంబర్ 19న పార్లమెంటులో 1953 అక్టోబర్ 1లోగా ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించారు నెహ్రూ. దేశం శాంతించింది. ఈ ఉదంతాన్ని జనవాణి పత్రికలో 'శ్రీరాములు నిర్యాణం' అంటూ ఓ సంపాదకీయం రాశారు తాపీ ధర్మారావు. కాంగ్రెసువారి అలసత్వానికీ, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వేసిన కమిటీల రిపోర్టుల్ని పాతేసిన ప్రభుత్వ సాచివేత విధానాలకూ, ప్రభుత్వ నిరాదరణకూ, కాంగ్రెస్ నాయకుల్లో ప్రాంతీయ దురభిమానాలకూ, వ్యక్తి దురహంకారాలకూ శ్రీరాములు ఆహుతయ్యారని ఖండితంగా రాశారు (17.12.1952).
ఇప్పటివరకూ 'మన చరిత్ర' శీర్షికన రాసిన వ్యాసాలకు ఆధారమైన పుస్తకాలు:
కొండా వెంకటప్పయ్య 'స్వీయ చరిత్ర'.
రావి నారాయణరెడ్డి 'వీర తెలంగాణ'.
అయ్యదేవర కాళేశ్శ్వర్రావు 'నా జీవితకథ నవ్యాంధ్ర'.
ఎం.ఎల్. నరసింహారావు 'తెలంగాణా వైతాళికులు'.
టంగుటూరి ప్రకాశం 'నా జీవిత యాత్ర'.
ఆరుట్ల రామచంద్రారెడ్డి 'తెలంగాణ పోరాట స్మృతులు'

No comments: