Wednesday, September 28, 2011

ఇంటర్వ్యూ: పబ్లిసిటీ ఆర్టిస్ట్ ఈశ్వర్

పబ్లిసిటీ ఆర్టిస్టుగా మరచిపోలేని సంఘటనలెన్నో 

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'సినిమా పోస్టర్'కి ఉండే ప్రాధాన్యత ఏమిటో అందరికీ తెలిసిందే. ఆ రంగంలో ఆయనే అత్యంత సీనియర్ పబ్లిసిటీ ఆర్టిస్టు. ఇవాళ చేతితో పనిలేకుండా కంప్యూటర్‌తో సునాయాసంగా సినిమాల డిజైన్లు చేస్తున్నారు. కానీ తన కాలంలో కుంచెతో అద్భుతమైన పోస్టర్లకి ప్రాణం పోసి, ఆ సినిమాలపట్ల ప్రేక్షకుల్లో అనురక్తిని కలిగించిన అపురూప పబ్లిసిటీ చిత్రకారుడు ఈశ్వర్. ఇటు రాసిపరంగా కానీ, అటు వాసిపరంగా కానీ సినీ ఆర్ట్ రంగంలో ఎవరెస్టు శిఖరం, ఎన్నటికీ చెరిగిపోని సంతకం ఈశ్వర్. 45 సంవత్సరాల కాలంలో ఏకంగా 2,500 చిత్రాలకు పనిచేసిన ఆ కళాశిల్పి ఇటీవలే తన జీవితానుభవాలతో పాటు, తాను గీసిన సినీ బొమ్మలతో 'సినిమా పోస్టర్' అనే పెద్ద పుస్తకాన్ని వెలువరించారు. ఈ సందర్భంగా  ప్రత్యేకంగా సంభాషించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...

నా కెరీర్‌లో నేను పనిచేసిన సుమారు రెండు వేల పైచిలుకు సినిమాల ప్రతిఫలంలో నాకు దక్కింది మూడవ వంతు కూడా లేదు. నాకే కాదు. ప్రతి సినీ జీవికి ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది. అందరి విజయం వెనుక ఈ రహస్యం దాగి ఉంటుంది. డబ్బు కంటే అందరి మన్ననలూ పొందడం ముఖ్యం. ఆయా కంపెనీలకు పర్మినెంట్ టెక్నీషియన్‌గా సాగిపోవడం ఇంకా ముఖ్యం. ఆ రకంగా ఇవాళ నేను సాధించిన దానికి ఎంతో ఆనందంగా ఉన్నా.
'సినిమా పోస్టర్'కి అదే ప్రేరణ
ఒక రోజున సేతు అనే తమిళ నటుడు ఆమ్‌స్టర్‌డామ్ (నెదర్లాండ్స్)కి చెందిన ఎడో బౌమన్ అనే వ్యక్తిని తీసుకుని నా వద్దకు వచ్చాడు. తాను బాలీవుడ్ సినీ పోస్టర్స్ మీద పరిశోధన చేస్తున్నానని బౌమన్ చెప్పాడు. హిందీ చిత్రసీమలోని అనేకమంది నిర్మాతల్నీ, పోస్టర్ డిజైనర్లనూ కలిశాడు. అనేక హిందీ సినిమాల పోస్టర్లని సేకరించాడు. వాటిలో నేను చేసిన పోస్టర్లు చాలానే ఉన్నాయి. మూడు గంటల పాటు నన్ను ఇంటర్వ్యూ చేశాడు బౌమన్. అతను సేకరించిన వివరాలతో ఆ తర్వాత లండన్‌లోనూ, లాజ్ ఏంజిల్స్‌లోనూ ఉన్న టాస్‌చెన్ పబ్లికేషన్స్ సంస్థ 'ఆర్ట్ ఆఫ్ బాలీవుడ్' అనే పుస్తకం తెచ్చింది. బౌమన్ నన్ను కలవడం నాకు స్ఫూర్తినిచ్చింది. మన పోస్టర్ల మీద విదేశీయులు సైతం పుస్తకాలు తెస్తుంటే మన పోస్టర్ల మీద మనమెందుకు ఓ పుస్తకం రాయకూడదనిపించింది. అలా మూడేళ్ల కష్టంతో 'సినిమా పోస్టర్' తెచ్చా. 

మామూలు శ్రమకాదు
దీని కోసం నిజంగా ఎంతో శ్రమించా. పుస్తకాన్ని ఎలా తీసుకు రావాలి? వెనక్కి తిరిగి చూసుకుంటే నా ఆర్ట్ వర్క్ ఏదీ నా వద్ద లేదు. అప్పుడు వాటిని వెతకడం ప్రారంభించా. నా వద్ద పనిచేసిన 52 మంది పబ్లిసిటీ ఆర్టిస్టుల్ని సంప్రదించా. వారిలో నలుగురైదుగురు నేను వేసిన పోస్టర్లనీ, ఆర్ట్ వర్క్‌నీ తీసుకొచ్చి ఇచ్చారు. అయినా 45 ఏళ్ల కాలంలో నా పనిలో నాకు లభ్యమైంది కేవలం 5 శాతం మాత్రమే. నేను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల సినిమాలకే కాక ఒరియా, బెంగాలీ, అస్సామీ చిత్రాలకూ పనిచేశా. అన్నీ కలిపి సుమారు 2500 సినిమాలకు పనిచేశా. కానీ నాకు వాటిలో 1900 సినిమాలే దొరికాయి. నా జీవిత కథతో పాటు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన ఆర్టిస్టులతో పాటు దక్షిణ, ఉత్తర భారతదేశంలో పేరుపొందిన ఆర్టిస్టుల జీవిత కథలు సేకరించి వారి గురించి రాశా. పద్నాలుగు మంది ప్రఖ్యాత తెలుగు చిత్రకారుల గురించి అధ్యయనం చేసి రాశా. సినీ ఇండస్ట్రీలో నేను అతి సన్నిహితంగా మెలిగిన మహోన్నత వ్యక్తులతో గడిపిన మధుర క్షణాలు గుర్తు చేసుకున్నా.

మరచిపోలేని సంఘటనలు
1970లలో ఓ దీపావళికి ఆరుగురు పేరుపొందిన తమిళ హీరోలు.. ఎంజీఆర్, శివాజీ గణేశన్, జెమిని గణేశన్, జయశంకర్, రవిచంద్రన్, శివకుమార్ సినిమాలు విడుదలయ్యాయి. వాటన్నింటికీ నేనే పబ్లిసిటీ ఆర్టిస్టుని. ఇలా అందరు హీరోల చిత్రాలకు ఒకే పబ్లిసిటీ ఆర్టిస్ట్ డిజైన్ చేయడం అదివరకే కాదు, ఆ తర్వాత కూడా ఎప్పుడూ జరగలేదు. అది నా అదృష్టం. తెలుగు చిత్రసీమ వజ్రోత్సవ వేడుకల్లో సినీ ప్రముఖుల నడుమ అశేష జన సందోహంలో నిష్ణాతులతో పాటు నాకూ గౌరవ పురస్కారాన్ని అందించడం నేనెన్నడూ మరువలేని సంఘటన. ఒకనాడు ఏకాకిగా బిక్కుబిక్కుమంటూ దిక్కుతోచని స్థితిలో పాండీ బజార్‌లో తిరిగిన నన్ను ఇవాళ సినీ జగత్తులో ఏకైక సీనియర్ పబ్లిసిటీ ఆర్టిస్టుగా గుర్తించి వజ్రోత్సవ వేడుకల్లో సెలబ్రిటీగా నన్ను గౌరవించడంతో నా శ్రమ చరితార్థమైందనిపించింది. అంతకుముందు 1974లో డిస్టిబ్యూటర్లందరూ కలిసి బెజవాడలో అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా చేసిన ఘన సన్మానాన్ని కూడా నేను మర్చిపోలేను. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదొరై 9 అడుగుల నిలువెత్తు ఆయిల్ పెయింటింగ్ వేసే అవకాశం రావడం నాకు లభించిన భాగ్యంగా భావిస్తా. దాన్ని వేసే అవకాశం కల్పించింది అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి. అది వేయడానికి నెల రోజుల సమయమిచ్చారు. ఈ మధ్యలో నేనెంతవరకు ఆ బొమ్మ వేశానో చూడ్డానికి కరుణానిధి స్వయంగా రెండుసార్లు మా ఇంటికి రావడం మరచిపోలేని అనుభూతి. ఆ పెయింటింగుని రాజాజీ హాలులో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆవిష్కరించడం నా జీవితంలో మరో గొప్ప ఘటన.

తొలి దర్శకుణ్ణి
'అయినవాళ్లు' సినిమాకి అనుకోకుండా దర్శకత్వం వహించా. భీమలింగం అనే అతన్ని దర్శకత్వం నుంచి తప్పించడంతో దానికి కథ ఇచ్చిన నేనే బలవంతంగా డైరెక్ట్ చేయాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం వల్ల నాకు మరో దారి లేకపోయింది. అంతా కొత్తవాళ్లతో తీసిన ఆ సినిమా ఆడలేదు. ఇప్పుడు దాని ప్రింటు కూడా దొరకడం లేదు. ఏదేమైనా తెలుగులో డైరెక్టర్ అయిన తొలి పబ్లిసిటీ ఆర్టిస్టుని నేనే. ఇతర భాషల్లో చూసుకుంటే నాకంటే ముందు మలయాళంలో పబ్లిసిటీ ఆర్టిస్టు పి.ఎన్. మీనన్ డైరెక్టర్ అయ్యాడు.

అక్కినేని గ్రూప్ అనే ముద్ర
నటుల్లో శోభన్‌బాబు నాతో సన్నిహితంగా మెలిగేవారు. అలాగే కృష్ణ కూడా. వాళ్ల అత్యధిక సినిమాలకి నేనే ఆర్టిస్టుని. రామారావు గారి సొంత సినిమాలకు పనిచేయకపోయినా ఆయన నటించిన 50 సినిమాలకి పనిచేశా. అయితే అక్కినేనిగారితో సినిమాలు తీసిన కంపెనీలన్నీ నాతో పనిచేయించుకోవడంతో నా మీద ఏఎన్నార్ గ్రూప్ అనే ముద్రపడింది. సీనియర్ దర్శకుడు దాసరి నారాయణరావు, నేను ఒకే ఊరినుంచి ఈ రంగానికి వచ్చాం. ఆయనకంటే నేను ఏడేళ్ల ముందు వచ్చా. ఆయన తీసిన 150 సినిమాల్లో 82 సినిమాలకి పబ్లిసిటీ ఆర్టిస్టుని నేనే. నాతో పాటు గంగాధర్ కూడా ఈ రంగంలో ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అయితే మేమెప్పుడూ ఒకరికొకరం పోటీ అనుకోలేదు.

అదే పెద్ద అవార్డు
నేనేనాడు అవార్డుల కోసం ప్రాకులాడలేదు. ఈ 50 సంత్సరాల కాలంలో చిత్రసీమ నా పట్ల చూపిన ఆదరాభిమానాలకు మించిన అవార్డు మరొకటి లేదు. సినీ అవార్డు అనేది ఓ కథను సెల్యులాయిడ్ మీదకు తీసుకురావడానికి శ్రమించిన నటీనటులు, సాంకేతిక వర్గానికి సంబంధించినది. పబ్లిసిటీ అనేది దానికి ఎంతవరకు వర్తిస్తుంది? సినిమా పూర్తయి తొలి కాపీ వచ్చాక మా అవసరం ఏర్పడుతుంది. ఇది నిర్మాణానికి అంటీ అంటనట్లుండే శాఖ. అందుకేనేమో దీనికి అవార్డులు ప్రకటించలేదు. అయినా చిత్ర పరిశ్రమలోని 24 శాఖల్లో పబ్లిసిటీని చేర్చడం సంతోషమే.

'సాక్షి' నుంచి 'దేవుళ్లు' దాకా
1967లో బాపు దర్శకత్వం వహించిన తొలి సినిమా 'సాక్షి'తో ప్రారంభమైన నా సినీ ప్రస్థానం 2000వ సంవత్సరంలో కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన 'దేవుళ్లు' సినిమాతో ముగిసింది. ఆ తర్వాత నేనే సినిమాకీ పనిచేయలేదు. నన్ను పరిశ్రమ వద్దనుకోలేదు. నేనే కావాలని దూరంగా ఉన్నా. ఒక ఉప్పెనలా కంప్యూటర్ సిస్టమ్ ఈ రంగంలోకి ప్రవేశించింది. మాన్యువల్స్‌లో ఎన్నో ప్రయోగాలు చేసిన మా తరం ఇప్పుడు ఈ కొత్తతరంలో పోటీకి దిగడం సరికాదనిపించింది. అలా అని నేను పూర్తిగా ఈ రంగానికి దూరం కాలేదు. పాత సినిమాలకి కొత్త పోస్టర్లు వేస్తూ వస్తున్నా. మా తరంలో మమ్మల్ని పబ్లిసిటీ ఆర్టిస్టులన్నారు. ఇప్పుడు పబ్లిసిటీ డిజైనర్స్ అంటున్నారు. నేడు ఈ శాఖకు 'ఆర్ట్'తో సంబంధంలేకుండా పోయింది. చెయ్యి తిరిగిన ఆర్టిస్టయితేనే కాని మా కాలంలో నెట్టుకు రాలేకపోయేవాళ్లం. ఇప్పుడు అన్ని వసతులు కంప్యూటర్‌లో ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేట్ చేసే పరిజ్ఞానం సంపాదిస్తే చాలనే పరిస్థితి ఉన్నప్పుడు నాలాంటి వాడు దూరంగా ఉండటమే మంచిదని నా గౌరవాన్ని నేను దక్కించుకున్నా. సాంకేతిక నైపుణ్యం పెరగడం, కొత్త కొత్త టెక్నాలజీ రావడం మంచిదే. కంప్యూటర్‌తో అద్భుతాలే చేయొచ్చు. హాలీవుడ్ సినిమాలకి చేస్తున్న పబ్లిసిటీ డిజైన్ల ప్రమాణాల్ని మనవాళ్లు అందుకోవాలి.


No comments: