Sunday, September 18, 2011

ఇంటర్వ్యూ: 'శ్రీరామరాజ్యం' నిర్మాత సాయిబాబు

'శ్రీరామరాజ్యం'కు శ్రీకారం ఎలా జరిగింది?
- ఓ ఆదివారం మధ్యాహ్నం రామసాయిమందిరం గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. రాముడు గురించి సినిమా తీస్తే ఎలా ఉంటుందన్న భావన అప్పుడే వచ్చింది. వెంటనే నా స్నేహితుడిని రమ్మని కబురుపెట్టాను. ఐదు నిమిషాల్లో వచ్చాడు. విషయం చెప్పగానే వెంటనే ముళ్ళపూడి రమణగారితో మాట్లాడించారు. వెంటనే బయలుదేరి చెన్నై వెళ్ళాం. మరుసటి రోజు బాపు-రమణగార్లను కలిశాం. అక్కడి నుంచి ఇళయరాజాగారిని కలిశాం. 'శ్రీరామరాజ్యం' శ్రీకారం చుట్టుకున్న వైనమిది.
ఇప్పటి రోజుల్లో పౌరాణికమంటే చాలా ఖర్చుతో కూడుకున్నది కదా. అనుకున్న బడ్జెట్‌లో తీయగలిగారా?
- మెరుపులాంటి ఆలోచన రావడమే తరువాయిగా అన్నీ హుటాహుటిన కుదిరాయి. ఈ చిత్రం పరిధి విస్తృతమైంది కాబట్టి ద్విభాషా చిత్రంగా తెరకెక్కించమని చాలా మంది సలహా ఇచ్చారు. సీత పాత్రకు ముందు మేం మాధురీదీక్షిత్‌ను సంప్రదించాం. తెలుగు, హిందీల్లో చిత్రీకరిస్తేనే నటిస్తానని చెప్పింది. కానీ ద్విభాషా చిత్రమంటే తెలుగుతనం మరుగునపడే ప్రమాదముంది. పలు చోట్ల రాజీపడాలి. సంగీతం నుంచి సన్నివేశాల వరకు ఎక్కడో ఏదో అడ్డు తగులుతూనే ఉంటుంది. అది నాకు ఇష్టం లేదు. అందుకే బడ్జెట్ గురించి ఆలోచించలేదు. సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా రామాయణాన్ని తెరకెక్కించాలన్నదే నా సంకల్పం అని బాపుగారితో చెప్పాను.
'లవకుశ' అని గాక 'శ్రీరామరాజ్యం' అనే టైటిల్ పెట్టడంలో ఉద్దేశం?
- ముళ్ళపూడివారు కొన్ని హిందీ పౌరాణిక చిత్రాల పేర్లు చెబుతూ మధ్యలో 'శ్రీరామరాజ్య్' అని అన్నారు. 'శ్రీరామరాజ్యం'... పేరు చాలా బాగుంటుంది కదా. మన చిత్రానికి ఆ పేరే ఖరారుచేసుకుందాం అనుకున్నాం. నెల్లోపే పాటల రికార్డింగ్ పనులు కూడా మొదలయ్యాయి.
జొన్నవిత్తులతోనే అన్ని పాటలూ రాయించారెందుకు?
- 'అందరి బంధువయ భద్రాచల రామయ్యా...' అని జొన్నవిత్తుల అంతకుముందే ఓ పాట రాశారు. అంతకన్నా సరళంగా ఇంకెవరు రాయగలరు? అనిపించింది. అందుకే ఆయనతో అన్ని పాటలూ రాయించాం. ఇళయరాజాగారి బాణీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మా పాటల్ని ఇవాళ యువతే ఎక్కువగా ఇష్టపడుతోంది. అంత తాజాదనం గుబాళిస్తోంది గీతాల్లో.
చిత్రంలో మీకు బాగా నచ్చిన సన్నివేశం?
- మొదటి రోజు బాలకృష్ణగారు షూటింగ్‌లో ఉన్నారు. నేను కారు దిగి వెళ్తున్నాను. సీతాదేవిని భూదేవి తనతో తీసుకెళ్లే సన్నివేశమది. ముఖంలో పలు భావాలను పలికిస్తూ నటించాలి. దూరం నుంచి బాలకృష్ణ నటన చూస్తే చాలా ముచ్చటేసింది. ఆ తర్వాత ఆయన ఎన్ని సన్నివేశాలు చేసినా, నేను చూసినా... నాకు నచ్చింది తొలి సన్నివేశమే.
సీతారాములుగా నయనతార, బాలకృష్ణ నటన గురించి ఏం చెబుతారు?
- పూర్తిగా పాత్రలో లీనమై నటించే నటుడు బాలయ్య. ఈ చిత్రంలో నటించినన్నాళ్ళూ ఆయనలో ఏదో తేజస్సు కనిపించేది. అది దినదినప్రవర్ధమానమైనట్టు అనిపించింది. రాముడి పాత్రలో ఆయన్ని చూసిన కొంతమంది యువకులు 'అచ్చం రామారావుగారిలా ఉన్నారు కదా' అనడం స్వయానా నేనే విన్నాను. చాలా ఆనందమనిపించింది. అంతే భక్తి శ్రద్ధలతో నయనతార నటించింది. సీత పాత్ర చేసినన్నాళ్ళూ తను శాకాహారమే తీసుకుంది. ఏరోజూ గుడికెళ్ళకుండా సెట్‌కు రాలేదు. నేను చూసిన వారందరిలోకీ నయనతార గొప్ప వ్యక్తిత్వమున్న అమ్మాయి. తన వృత్తికి పూర్తి న్యాయం చేసే తరహా మనిషి.
వాల్మీకి పాత్రని చేయడానికి అక్కినేని గారు అంత సులువుగా ఒప్పుకున్నారా?
- అసలు ఈ చిత్రాన్ని ఎందుకు తీయాలనిపించింది అని ఆయన అడిగారు. 'ప్రతి మనిషికీ ఓ తృప్తి ఉంటుంది. ఈ సినిమా తీస్తే నేను తృప్తిగా ఉంటాను. రామాయణాన్ని ఎవరూ మర్చిపోకూడదు. రామచరిత్రలో లేనిది లేదు. ఉమ్మడి కుటుంబం, అన్నదమ్ముల సఖ్యత, సుపరిపాలన, ఈర్ష్యా ద్వేషాలకు అతీతంగా మసలడం.. అంటూ అన్ని విషయాలు అందులో ఇమిడి ఉన్నాయి. విశ్వం ఉన్నంతకాలం రాముడుంటాడని నా నమ్మకం ' అని చెప్పాను. పెద్దాయన పాత్రను చేయడానికి అంగీకరించారు. వాల్మీకి పాత్రకు వందశాతం సరిపోయారు.
మిగతా పాత్రధారుల గురించి చెబుతారా?
- తక్కువ సన్నివేశాల్లో కనిపించినా జనకుడి పాత్రలో మురళీమోహన్ అచ్చుగుద్దినట్టు సరిపోయారు. లక్ష్మణుడి పాత్రకు శ్రీకాంత్ అయితే బాగుంటుందని అనుకున్నాం. చానాళ్ళు ఆయన కాల్షీటు కుదరలేదు. కానీ ఆఖరినిమిషంలో శ్రీకాంత్ కూడా మా యూనిట్‌లో కలవడం ముదావహం. లవకుశుల నుంచి... ప్రతి పాత్రధారీ ఈ చిత్రంలో చాలా గొప్పగా చేశారు.
సాంకేతికంగా ఈ సినిమా ఎలా ఉంటుంది?
- నేననుకున్నట్టు బాపుగారు కావ్యంలాగా తీర్చిదిద్దారు. ముళ్ళపూడివారి కథాకథనాల్ని తెరమీద అద్భుతంగా ఆవిష్కరించారు. సాంకేతికంగా ఎక్కడా వెనకడుగేయలేదు. షూటింగ్ జరిగిన 85 రోజులూ జిమ్మీజిప్ మా దగ్గరే ఉంది. నాలుగు ప్రత్యేకమైన సెట్‌లు వేశాం. ఏ ఫ్రేమ్ చూసినా చాలా గొప్పగా, కనులపండువగా ఉంటుంది. పాటలను అత్యంత సౌందర్యవంతంగా తెరకెక్కించారు బాపుగారు. ఆద్యంతం భారీతనంతో తీర్చిదిద్దాం.
సినిమాని ఎప్పుడు విడుదల చేస్తున్నారు?
ప్రస్తుతం నేపథ్యసంగీతం పనులు జరుగుతున్నాయి. హంగేరి రాజధాని బుడాఫెస్ట్‌లో ట్రాక్ మిక్సింగ్ కార్యక్రమాలు త్వరలో ఉంటాయి. హంగేరి నుంచి ఎనిమిది మంది సభ్యులు ఇప్పుడున్న రీరికార్డింగ్ బృందంతో త్వరలో కలుస్తారు. మరోవైపు గ్రాఫిక్స్ పనులు కూడా పూర్తి కావచ్చాయి. ఇక డీఐ, డీటీయస్ పనులున్నాయి. వాటిని కూడా ముగించి అక్టోబర్ లోపు చిత్రాన్ని ప్రేక్షకులకు కనువిందు చేయాలనుకుంటున్నాం.

No comments: