Friday, September 2, 2011

న్యూస్: అవినీతి మీద టాలీవుడ్‌కి చిత్తశుద్ధి ఉందా?

అన్నా హజారే వెంట టాలీవుడ్ కూడా కదిలి వచ్చింది. ర్యాలీలు నిర్వహించింది. పాదయాత్రలు చేపట్టింది. దీక్షలూ నిర్వహించింది. ఎప్పుడో తుఫానులు సంభవించినప్పుడు తప్పితే, సామాజిక సమస్యలపై అంతగా స్పందించని టాలీవుడ్ ఇప్పుడిప్పుడే సమాజంలోకి వస్తోంది. సినిమా ఒక శక్తివంతమైన మాధ్యమమని గుర్తించాక, నిజానికి దీనిని ఉపయోగించి అవినీతి మీద యుద్ధం ప్రకటించి ఉంటే ఇవాళ అన్నా హజారే స్థానంలో టాలీవుడ్ ఉండేది. అవినీతి మీద సినిమాలు తీయలేదని కాదు. తీసినవి చిత్తశుద్ధిలేని ఫక్తు కమర్షియల్ మసాలాలు. వాటిలో నినాదాల్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. వెంకటేశ్‌తో 'గణేశ్' తీసినా, చిరంజీవితో 'ఠాగూర్' తీసినా వాటిలో కొన్ని జ్వలింపజేసే సన్నివేశాలకి అప్పటికప్పుడు రక్తం ఉడుకుతుంది. సినిమా చూసి వచ్చాక ఆ చూసి ఉద్రేకపడిపోయిన ఆ అవినీతి రక్కసినే మర్చిపోతారు ప్రేక్షకులు. కమర్షియల్ సినిమాల ప్రయోజనం అంతవరకే. అయితే ఇదే అన్నా హజారే కథతో చిరంజీవితో కె. బాలచందర్ తీసిన వాస్తవిక కథా చిత్రం 'రుద్రవీణ'ని భారత ప్రభుత్వం గుర్తించి, జాతీయ అవార్డుతో సత్కరించిన విషయం గుర్తించుకోవాలి. ఇప్పుడు అవినీతి వ్యతిరేక సమరంతో దేశవ్యాప్త ప్రజానీకంలో ఉత్తేజాన్ని రగిలిస్తున్న అన్నా హజారే దీక్షలకు స్పందించిన టాలీవుడ్ ప్రముఖులు ఆయనకు తమ మద్దతు ప్రకటిస్తున్నారు.
ఇటీవల 2జి స్పెక్ట్రం స్కాం నేపథ్యంలో ఓ ప్రముఖ తెలుగు దర్శకుడు ఓ పేరుపొందిన హీరోని దృష్టిలో ఉంచుకుని కథ తయారు చేసుకున్నాడు. అది పూర్తిగా మూస ఫార్ములా పాతరోతే. అందులో స్టార్ చేసే కమర్షియల్ విన్యాసాలే కనిపిస్తాయి తప్పితే అసలు స్కాం మీద చిత్తశుద్ధి ఉండదు. దీన్ని కూడా కాసేపు ఆనందించి మర్చిపోతారు ప్రేక్షకులు. స్కాములు కానీ, దేశాన్ని పీడిస్తున్న ఏ సమస్యయినా గానీ.. వాటిని పబ్లిసిటీకి ఉపయోగించుకుంటూ సినిమాలు చుట్టేస్తారు తప్పితే, వాస్తవికంగా ప్రజల్లోకి సమస్య తీవ్రతని తీసుకెళ్లి జాగృతం చేయాలన్న సదాశయాలేవీ ఉండవు. ఈ సామాజిక ప్రయోజనాన్ని సాధించలేని టాలీవుడ్ ప్రముఖులు ఇప్పుడు అన్నా హజారేని పట్టుకుని అవినీతి మీద మాట్లాడుతూ జనంలోకి వస్తున్నారు. మీరేం చేశారని జనం అడిగితే, పోనీ వాళ్లతో ర్యాలీల్లో, పాదయాత్రల్లో అనుసరిస్తున్న కుర్రాళ్లే నిలదీస్తే సమాధానం ఉండదు. సమస్యల మీద సరుకులేని సినిమాలు తీసి సొమ్ములు చేసుకుని, ఆ సమస్యల మీదే జనంలోకి వెళ్లడం తమ వైఫల్యాన్ని చాటుకోవడం కాదా? ద్వంద్వ వైఖరిని వెల్లడించుకోవడం కాదా? సినిమా అనే శక్తివంతమైన సాధనాన్ని దుర్వినియోగం చేశామని చెప్పుకోవడం కాదా? ఆలోచించండి.

No comments: