Saturday, September 3, 2011

న్యూస్: 'బెజవాడ' గొడవ రాముకే తెలుసు!

మొత్తానికి 'బెజవాడ రౌడీలు' టైటిల్ పేరు కుదించుకుపోయి 'బెజవాడ'గా మారిపోయింది. 'బెజవాడ రౌడీలు' అనే టైటిల్ ప్రకటన వచ్చినప్పట్నించీ విజయవాడకు చెందిన వివిధ పార్టీల రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు ఆ టైటిల్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే ఆ సినిమా నిర్మాత రాంగోపాల్‌వర్మ మాత్రం ఆరునూరైనా టైటిల్ మార్చేదిలేదని ఇప్పటిదాకా భీష్మించారు. నాగచైతన్య, అమలా పాల్ ('ప్రేమఖైదీ' ఫేం) జంటగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా వివేక్‌కృష్ణ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో "ఈ బెజవాడ నాదిరా" అనే డైలాగ్ అదిరిపోతుందని రాము చెబుతున్నాడు. వివేక్‌కృష్ణ "రాముగారు 'బెజవాడ' సినిమాని ఎంతో ఇష్టపడి తీస్తున్నారు. దుర్గమ్మ-కృష్ణమ్మ ఉన్న బెజవాడ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎంత అందంగా కనిపిస్తుందో, కోపంగా ఉన్నప్పుడు అంత రౌద్రంగా ఉంటూ ప్రళయం సృష్టిస్తుంది. అది బెజవాడలో ఉన్న ఎమోషన్. బెజవాడని ఓ కేరక్టర్‌గా తీసుకుని చేస్తున్న సినిమా ఇది. నాగచైతన్య హీరోయిజాన్ని పూర్తిగా చూపించే సినిమా 'బెజవాడ'. నాలా ఫస్ట్ టైం డైరెక్టర్‌కి నాగచైతన్య బెస్ట్ చాయిస్" అని చెప్పాడు. అక్టోబర్ చివరి వారంలో అంటే దీపావళికి ఈ సినిమాని రిలీజ్ చెయ్యాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఇప్పుడు హఠాత్తుగా టైటిల్‌ని 'బెజవాడ'గా ఎందుకు మార్చినట్లు? "అనేకానేక కారణల వల్ల 'బెజవాడ రౌడీలు' పేరును 'బెజవాడ'గా మార్చడం జరిగింది. ఆ కారణాలు ఏమిటని ఎవరెవరు ఏమేమి ఊహాగానాలు చేసుకున్నా అసలు కారణం నా ఒక్కడికే తెలుసు. కానీ ఆ కారణం ఏమిటన్నది నేను ఎప్పటికీ చెప్పను" అని చెప్పుకొచ్చారు రాము. ఆ కారణం ఆయన ఎప్పటికీ చెప్పకపోయినా జనానికి తెలుసు. "అసలు కారణం నా ఒక్కడికే తెలుసు" అని ఆయన ఎంత చెప్పినా సినిమా పేరు మార్చకపోతే దాన్ని విడుదల కానివ్వమని విజయవాడ జనం ప్రతిన పట్టడంతోనే ఆయన దిగివచ్చి టైటిల్ మార్చారని అంతా నమ్ముతున్నారు. దీనికోసం వాళ్లేమీ ఊహాగానాలు చేయాల్సిన పనిలేదు. కానీ ఆ సంగతి ఒప్పుకుంటే రాంగోపాల్‌వర్మ ఎందుకవుతాడు? అందుకనే టైటిల్ మార్చడానికి గల కారణం తనకొక్కడికే తెలుసని సర్దిచెప్పుకుంటున్నాడు. అంతే!

No comments: