Friday, September 2, 2011

మన చరిత్ర: ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తామన్న నెహ్రూ

1947 నుండి తెలుగు జాతి సమైక్యతా భావం తెలంగాణాలో సాయుధ పోరాటాన్ని అందుకుంది. గెరిల్లా పోరాటం మొదలైంది. ఇది రాజకీయ రూపాన్ని సంతరించుకుని దుష్కర నిజాం పాలన నుండి విముక్తికోసం జరిగే సాయుధ పోరాటంగా మారింది. అప్పటికే తెలంగాణా ప్రాంతంలో ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్ట్ పార్టీల్ని నిజాం నిషేధించాడు. మద్రాసు ప్రభుత్వం కూడా ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించింది. ఈ ప్రజా ప్రతిఘటనోద్యమాలు 1948 సెప్టెంబర్ వరకూ తీవ్రరూపం దాల్చాయి. 1948 సెప్టెంబర్ 13న యూనియన్ సైన్యాలు సంస్థానం మీద మిలటరీ చర్యను ఆరంభించాయి. దీని వెనుక ప్రధానంగా మూడు కారణాలున్నాయి. ఒకటి - నిజాం రాష్ట్రాన్ని భారతదేశంలో కలపడం, రెండు - ఫ్యూడల్ శక్తుల ప్రాబల్యం కొంత తగ్గించడం, మూడు - కమ్యూనిస్ట్ పార్టీని అణచడం. ఇందులో మూడో ఆశయ సాధనను 1951 వరకూ యూనియన్ ప్రభుత్వం కొనసాగించింది. సాయుధపోరాటాన్ని 1951లో కమ్యూనిస్ట్ పార్టీ ఆపింది. 1952 ఎన్నికల్లో పాల్గొంది.
ఆంధ్రరాష్ట్ర సమస్య మొదట యుద్ధం ముగిసేదాకా వెనకబడింది. తర్వాత స్వాతంత్ర్యం వచ్చేదాకా మరుగునపడింది. 1948లో మద్రాసు రాష్ట్రం రెండు శాసన సభల్లో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలను ఏర్పాటు చెయ్యాలని అప్పటి న్యాయ శాఖా మంత్రి డా. సుబ్బరాయన్ తీర్మానం చేయించాడు. ఆ సంవత్సరం ఢిల్లీ పార్లమెంటులో రంగా ప్రశ్నకు సమాధానం చెబుతూ ఆంధ్ర రాష్ట్రం త్వరగా ఏర్పాటు చేస్తామని చెపారు నెహ్రూ. భాషా ప్రయుక్త రాష్ట్ర సమ్మేళనం ఢిల్లీలో ఆ సంవత్సరం డా. పట్టాభి అధ్యక్షతన జరిగింది.
1948లోనే ఆంధ్ర రాష్ట్ర విషయాన్ని పరిశీలించడానికి ధార్ కమిటీని వేసింది కేంద్ర ప్రభుత్వం. అది రాజధాని విషయం తగాదాని తేల్చలేకపోయింది. 1949లో జె.వి.పి. కమిటీ ఏర్పడింది. జవహర్‌లాల్, వల్లభాయ్, పట్టాభి ఇందులో సభ్యులు. రాష్ట్రాన్ని స్థాపించాలనీ, మద్రాసు మాత్రం రాజధాని కారాదనీ ఈ కమిటీ సిఫార్సు చేసింది.

No comments: