Thursday, September 8, 2011

'ఆంధ్ర' అంటే ద్వేషం ఎందుకు?: 'చిల్లర దేవుళ్లు' చెబుతున్న నిజాలు-1

'ఆంధ్ర' అన్నా, 'తెలుగు' అన్నా, 'తెలుగుతల్లి' అన్నా తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు మండి పడటం మనకు తెలుసు. 'ఆంధ్ర' అనే పదం పట్ల తెలంగాణాలో విద్వేషాన్ని రగిల్చే అన్ని పనులూ ఆయన చేస్తున్నారు. కోస్తా ప్రాంతం నుండి వచ్చి ఇక్కడ వేలాది ఎకరాల్లో భూములు కొని వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకున్న అతి కొద్దిమంది నాయకుల మీద కోపంతోనో, ద్వేషంతోనో ఆయన మొత్తంగా 'ఆంధ్ర' పదం పట్ల తెలంగాణా ప్రజల్లో ద్వేషాన్ని రగిలిస్తున్నారు. బాధాకరమైన విషయమేమంటే సొంత లాభం కోసం ఆయన చేస్తున్న పనులకూ, చెబుతున్న మాటలకూ అనేకమంది తెలంగాణా కళాకారులూ, రచయితలూ, కవులూ, మేధావులూ వంత పాడుతుండటం. 'ఆంధ్ర' ప్రాతంవాళ్లు అన్ని విషయాల్లోనూ తమని అణగదొక్కుతున్నారనే అభిప్రాయం నిజమేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు సామాన్య తెలంగాణా ప్రజల్ని నానా హింస పెట్టింది గడీల్ని ఏలిన రెడ్డి దొరలూ, వెలమ దొరలూ. ఇవాళ తెలంగాణాలో పెత్తనం చేస్తున్నది ఆ వర్గాలకు చెందిన నాయకులే. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం వస్తే పాలించబోయేదీ ఆ దొరలే. ఈ సంగతి తెలిసి కూడా అదే దొరలకి వంత పాడటం ఎంతవరకు న్యాయం? ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడటంలో తప్పులేదు. కానీ ఆ పోరాటం మొత్తంగా మరో ప్రాంతం వారి మీద ద్వేషంగా మారడం ధర్మమేనా? అసలు తెలంగాణాలో ఇదివరకు 'ఆంధ్ర', 'తెలుగు' పదాలు ఏ తీరున చలామణీ అయ్యాయి? మొదట్నించీ ఆ రెండు పదాల పట్ల తెలంగాణా ప్రజలు ద్వేషభావాన్ని చూపించారా? దీనికి సమాధానాలు దాశరథి రంగాచార్య రచించిన ప్రఖ్యాత నవల 'చిల్లర దేవుళ్లు'లో మనకి లభిస్తాయి. 1938 పూర్వపు తెలంగాణ ప్రజా జీవితాన్ని చిత్రించిన ఈ నవలని ఆయన 13.10.1964న ప్రారంభించి, 10.11.1964న ముగించారు. ఈ నవల 'ప్రగతి' అనే వార పత్రికలో 21.3.1969 నుంచి 13.12.1969 వరకు సీరియల్‌గా వచ్చింది. అదే పేరుతో కాకతీయ పిక్చర్స్ అనే సంస్థ 1974లో సినిమాని నిర్మించింది. అలాగే ఈ నవల అనేక గౌరవాలు పొందింది. అలాంటి నవల చెబుతున్న నిజాలు ఏమిటో పరిశీలించడం ఈ వ్యాసం ఉద్దేశం.

2 comments:

sai ramesh said...

Yagna murthy asalu Telanga history neku theliyadu anukunta mana ramesh chinamulla o bokk rasthundu oka sari refer cheyava plese ikkada Andra ante evriki devesham ledu KCR kuda ade anadu makopamatnha Andra palakula medi Prajala mida kadu dayachesi ilante Abhndalu mayukulaimina ma Telagana Prajalme veyavadu

Yagna said...

అన్నా. ఒకట్రెండు సార్లు కేసీఆర్ నువ్వన్నట్లే చెప్పి ఉండవచ్చు. కానీ ఎక్కువసార్లు ఆయన సీమాంధ్రులంటూ జనరలైజ్ చేసే మాట్లాడాడు. అందుకు తగ్గట్లే 'ఆంధ్ర' అనే శబ్దం పట్ల ద్వేషాన్ని వెళ్లగక్కుతూ ఇప్పటికే ఎన్నో వ్యాసాలూ, కవితలూ వచ్చాయి. తెలంగాణాలో 'ఆంధ్ర' అనే పదం ఎక్కడ కనిపించినా దాన్ని ఎందుకు చెరిపేయాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు? కేసీఆర్ 'ఎక్కడిదీ తెలుగుతల్లి?' అని ఈసడించుకోలేదా? అన్నా. నేను ఇవాళ తెలంగాణ గడ్డ మీదే ఉన్నా. ఇక్కడ ఉన్నంత కాలం నన్ను ఇక్కడివాడిగానే భావిస్తా. నా తెలంగాణ సోదరులు ప్రత్యేక తెలంగాణ కావాల్నంటే అది వాళ్ల న్యాయమైన హక్కుగానే నమ్ముతున్నా. రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోడానికి భావోద్వేగాలు రెచ్చగొడుతుంటే మనం వాళ్ల మాయలో పడి కోస్తా వాళ్లనీ, రాయలసీమ వాళ్లనీ శత్రువులుగా భావించవద్దనేదే నా ఆకాంక్ష. అన్నా. ఇప్పుడు నేను తెలంగాణ చరిత్రను అధ్యయనం చేస్తున్నా. అందుకేగా 'చిల్లర దేవుళ్లు'లో దాశరథి ఏం రాశారో చూపిస్తోందీ.