Thursday, September 1, 2011

బిగ్ స్టోరీ: మోహన్‌బాబు రావణావతారం!

'శ్రీరామరాజ్యం''లో బాలకృష్ణని రామావతారంలో బాపు చూపిస్తే, మోహన్‌బాబుని రావణావతారంలో చూపించాలని దిగ్దర్శకుడు కె. రాఘవేంద్రరావు సంకల్పించారు. రావణాసురునిగా మోహన్‌బాబు నటించే సినిమా షూటింగ్ మొదలయ్యేది 2012 ప్రథమార్థంలో. ప్రస్తుతం తెలుగులో భక్తి రస చిత్రాలు, పౌరాణిక చిత్రాల మీద ధ్యాస మళ్లినట్లే కనిపిస్తోంది. సాధారణంగా సోషల్ సినిమాల కంటే ఇలాంటి భక్తి, పౌరాణిక చిత్రాలకి ఖర్చు ఎక్కువవుతుంది. కారణం అప్పటి వాతావరణానికి తగ్గట్లు సెట్లు నిర్మించాల్సి రావడం, కాస్ట్యూమ్స్ తయారు చేయించడం. నాగార్జున నటించిన 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' సినిమాలకు మంచి పేరొచ్చింది. అయితే చాలామంది జనానికి తెలీని విషయం ఆ రెండూ కాస్ట్ ఫెయిల్యూర్లే. 'అన్నమయ్య'ని మించి 'శ్రీరామదాసు'కు కమర్షియల్‌గా ఎక్కువ నష్టాలు వచ్చాయి. అయితే సంకల్పమే అలాంటి తరహా సినిమాల నిర్మాణానికి దారితీస్తోంది. అటువంటి సినిమాలతో చరిత్రలో నిలిచిపోవచ్చనే ఆశే దానికి కారణం. రావణాసురుని పాత్ర అనగానే మనకి 'భూకైలాస్'లోని ఎన్టీ రామారావు, 'సంపూర్ణ రామాయణం'లోని ఎస్వీ రంగారావు జ్ఞాపకం వస్తారు. ఆ పాత్రల్లో ఆ ఇద్దరూ అమోఘంగా రాణించారు. ఆ ఇద్దరూ మినహా ఇంతదాకా మరొకరు ఆ పాత్రలో రాణించలేదు. ఇప్పుడు అలాంటి రావణుని పాత్ర చేయాలని విలక్షణ నటునిగా పేరుపొందిన మోహన్‌బాబు సంకల్పించారు. ఇప్పుడు హఠాత్తుగా ఆ పాత్రని చేయాలనే తలంపు ఆయనకు కలగడానికి 'శ్రీరామరాజ్యం' ప్రేరణ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
"రావణుడు 'నవమబ్రహ్మ'. బ్రాహ్మణ ధర్మాన్ని పాటిస్తూ వైరి విజయానికి ముహూర్తాన్ని నిర్ణయించి, తన మరణాన్ని తానే ఆహ్వానించిన ధర్మనిరతుడు. రాముడు పితృవాక్య పరిపాలకుడైతే... రావణుడు మాతృవాక్య పరిపాలకుడు. శివాంశసంభూతుడు. శ్రీహరి పథాన్ని త్వరితగతిన చేరాలని తపించిన అపర హరిభక్తుడు. ఆ మహనీయుడి కథాంశంతో గతంలో చాలా సినిమాలొచ్చినా, రావణావతారానికి సంబంధించిన పూర్తి వృత్తాంతంతో ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నది రావణుడి పాత్ర ఔన్నత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించే సినిమా. ఆయన జననం నుంచి మరణం వరకూ ఈ కథ సాగుతుంది. ఎన్టీఆర్, ఎస్వీఆర్ లాంటి మహానటులు చేసిన పాత్రను నేను చేయబోతున్నాను. వారి స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా నా స్టైల్‌లో ఈ పాత్ర రక్తికట్టించడానికి ప్రయత్నిస్తాను" అని చెప్పారు మోహన్‌బాబు.
ఈ సినిమాకి సంబంచించిన మరో విశేషం, ఇందులో కేవలం తెలుగు నటులే కాకుండా, భారత దేశంలో పేరెన్నికగన్న నటులు నటించనుండటం. కారణం దీనికి భారీ బడ్జెట్ అవుతుంది కాబట్టి దేశవ్యాప్తంగా ప్రేక్షకులకి సుపరిచితులైన నటులు ఇందులో పాత్రధారులైతే కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లోనూ దీన్ని విడుదల చేసే అవకాశం ఉంటుంది కనుక. త్రీడీ కెమెరాను ఉపయోగించి, అత్యాధునిక టెక్నాలజీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకోవడం కూడా అందుకే.
"ఎలాంటి పాత్రనైనా తనదైన నటనాపటిమతో మెప్పించగల నటుడు మోహన్‌బాబు. ఎన్టీఆర్ తర్వాత అంతటి సంభాషణా పటిమ గల నటుడు ఆయన మాత్రమే. ఈ సినిమాతో తనలోని నవరసాలను ఆవిష్కరించబోతున్నారాయన. మా కాంబినేషన్‌లో వచ్చిన 'అల్లుడుగారు', 'అల్లరిమొగుడు', 'మేజర్ చంద్రకాంత్' చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఆ వరుసలోనే వాటికన్నా మరింత అత్యద్భుతంగా ఈ సినిమా నిలుస్తుందని మా నమ్మకం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తాం'' అని తెలిపారు రాఘవేంద్రరావు.

No comments: