Tuesday, August 31, 2010

Movies: Pawan Kalyan's film launched in Jerusalem


పవన్ కల్యాణ్ ముఖ్య పాత్రధారిగా సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు రూపొందించే సినిమా మంగళవారం (ఆగస్టు 31) జెరూసలేంలో లాంఛనంగా ప్రారంభమయ్యింది. ఆదిత్య ప్రొడక్షన్స్ బానరుపై కొండా కృష్ణంరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు చిత్రసీమలోనే తొలిసారిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెరూసలేం నుంచి మీడియాతో మాట్లాడారు పవన్ కల్యాణ్. "ప్రేమతత్త్వం బోధించే, సమాజానికి మంచి సందేశాన్నిచ్చే ఈ సినిమాలో నటించడాన్ని గౌరవంగా భావిస్తున్నా. చిన్నప్పుడు మిషనరీ స్కూలులో చదువుకునేప్పుడే జీసస్ అంటే ఆరాధనా భావం ఏర్పడింది. ఈమధ్య మా అబ్బాయి కిందపడితే మోకాలికి గాయమయ్యింది. అదిచూసి నాకే దెబ్బ తగిలినట్లు బాధపడ్డా. అలాంటిది తన కళ్లముందు ఎదిగిన కుమారుణ్ని చిత్రహింసలు పెడుతుంటే మేరీ మాత ఇంకెంతగా వ్యథచెంది ఉంటుందా అనుకున్నా. అదే సమయంలో కృష్ణంరాజు ఈ ప్రాజెక్టుతో నా వద్దకు వచ్చారు. వాళ్లు తయారు చేసుకున్న సబ్జెక్టు, అందులో నాకు చెప్పిన పాత్ర బాగా నచ్చి చేయడానికి ఒప్పుకున్నా. వయసు పెరిగేకొద్దీ సామర్థ్యం పెరుగుతున్న సింగీతం గారి డైరెక్షనులో పనిచేయడం సంతోషంగా ఉంది. ఇమేజ్ గురించీ, రేంజ్ గురించీ ఆలోచించి సినిమాలు చేయను. నా మనసులో అనిపించింది చేసుకుంటూ వెళ్తుంటా. 25 నుంచి 30 రోజుల పాటు ఈ సినిమాకి పనిచేయబోతున్నా. ఇందులో నా పాత్రేమితో ఇప్పుడు చెప్పడం సరికాదు. ఇందులో నాకు హీరోయిన్లు ఉండరు. ఇది రెగ్యులర్ సాంగ్ అండ్ డాన్స్ సినిమా కాదు" అని చెప్పారు పవన్ కల్యాణ్.
డైరెక్టర్ సింగీతం మాట్లాడుతూ "ఇది విశిష్టమైన సినిమా. జీసస్ క్రిస్ట్ మీద చాలా సినిమాలు వచ్చాయి. అయినా ఓ సాహసంగా తీసుకుని ఈ సినిమా చేస్తున్నాం. పిల్లలతో ఇదివరకు రామాయణం, భారతం తీశారు. ఇప్పుడు ఈ జీసస్ సినిమాని పిల్లలతో తీస్తున్నాం. పవన్ కల్యాణ్ ఇందులో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. జీసస్ పుట్టుక నుంచి శిలువ వేయడం వరకు ఇందులో ఉంటుంది" అని తెలిపారు.
నిర్మాత కృష్ణంరాజు మాట్లాడుతూ "ఇండియాలోని హయ్యస్ట్ బడ్జెట్ సినిమాల్లో ఇదొకటి అవుతుంది. తెలుగుతో బాటు హిందీ, మలయాళం, ఇంగ్లీషు భాషల్లో ఈ సినిమా తీస్తున్నాం. అక్టోబరులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, వచ్చే యేడాది చివరలో సినిమా విడుదల చేస్తాం" అన్నారు.
జె.కె. భారవి రచన చేస్తున్న ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ: శేఖర్ వి. జోసెఫ్, ఆర్ట్: రవీందర్, మేకప్: క్రిస్టియానా టెన్స్ లే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శేషు.

No comments: