Saturday, August 21, 2010

Movies: Why partiality on Telangana films?


నేటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేని తెలంగాణా నేపథ్య చిత్రాల్ని కొన్ని ప్రాంతాలవారే ఆదరించడం, కొన్ని ప్రాంతాలవారు నిరాకరించడం సబబేనా? 'కొమరం భీమ్', 'వీర తెలంగాణా' సినిమాల గురించే నేను ప్రస్తావిస్తున్నది. అమాయక గిరిజనులపై నిజాం పాలకుల, ఆనాటి పోలీసుల దుర్మార్గాల్ని ఎదిరించి, గోండుల స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ప్రాణాలొడ్డి పోరాడిన గోండు వీరుని కథతో 'కొమరం భీమ్' వస్తే, 1945-50 మధ్యకాలంలో నిజాం పాలకుల దౌర్జన్యాల్ని నిరసిస్తూ తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం మహోదృతంగా జరిగింది. ప్రపంచంలోనే ఇలాంటి పోరాటం ఎక్కడా జరగలేదని ప్రపంచ మేధావులే కొనియాడిన ఆ పోరాటంపై ఆర్. నారాయణమూర్తి 'వీర తెలంగాణా' తీశారు. ఈ రెండు సినిమాలకూ, ప్రత్యేక తెలంగాణతో కానీ, నేటి రాజకీయాలతో కానీ ఎలాంటి సంబంధం లేదు. అయినా ఆ సినిమాలవేపు మన కోస్తాంధ్ర, రాయలసీమ సోదరులు కన్నెత్తి చూడలేదు. అవి బాగాలేక కాదు. తెలంగాణ నేపథ్యం నుంచి వచ్చాయనే భావనతో. 'కొమరం భీమ్' సినిమా కేవలం తెలంగాణ ఏరియాలోనే విడుదలైతే, 'వీర తెలంగాణా'ను తెలంగాణతో పాటు కొన్ని కోస్తా, సీడెడ్ ఏరియాల్లో రిలీజ్ చేశారు. కానీ జనం అసలు రాకపోవడంతో ఆ ప్రింట్లను కూడా తెలంగాణ ప్రాంతాల్లోనే నారాయణమూర్తి రిలీజ్ చేయాల్సి వచ్చింది.
'కొమరం భీమ్'ని 20 ఏళ్ల క్రితమే డైరెక్టర్ అల్లాణి శ్రీధర్ రూపొందించారు. 1990 సంవత్సరపు నంది అవార్డుల్లో ఆ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు అవార్డుల్ని సాధించింది. విమర్శకుల ప్రశంసలూ దానికి దక్కాయి. 20 ఏళ్ల తర్వాత థియేటర్లలో విడుదలకు నోచుకున్న ఆ సినిమా తెలంగాణలో 50 రోజులు పూర్తి చేసుకుంది. కానీ ఆంధ్రా, రాయలసీమల్లో మాత్రం దాన్ని పట్టించుకున్నవాళ్లే లేరు. హాలీవుడ్, బాలీవుడ్ నుంచి దిగుమతి అవుతున్న, తమిళం నుంచి వస్తున్న డబ్బింగ్ సినిమాల్ని కూడా ఆదరిస్తున్న మన సినిమా ప్రియులు మన తెలుగు సినిమాల విషయంలో ఇలా పక్షపాతం చూపించడం కరెక్టేనా?

No comments: