Wednesday, August 18, 2010

Movies: Can KOMARAM PULI and MAHESH KHALEJA survive?



తెలుగు చిత్రసీమలో ఇవాళ రెండు సినిమాల మీద ఆకాశమంత అంచనాలు నెలకొన్నాయి. వాటి మీద వేడి వేడి చర్చా ఎక్కువే. కారణం - ఆ రెండు సినిమాలు క్రేజీ ప్రాజెక్టులు. అంతకుమించి అత్యంత ఖరీదైన సినిమాలు. ఈసరికి ఆ సినిమాలేమిటో మీరు ఊహించే ఉంటారు. నిజమే. వాటిలో ఒకటి ఈ ఆగస్టు నెలలోనే విడుదల కాబోతున్న పవన్ కల్యాణ్ సినిమా 'కొమరం పులి' అయితే, మరొకటి సెప్టెంబర్ నెలాఖరులోనో లేదంటే అక్టోబర్ మొదట్లోనో రాబోతున్న మహేశ్ సినిమా 'ఖలేజా'.
విశేషమేమంటే ఈ రెండు సినిమాలూ ఒకే బ్యానర్ కింద నిర్మాణమవుతున్నాయి. ఆ బ్యానర్ - కనకరత్నా మూవీస్. దాని అధినేత శింగనమల రమేశ్ బాబు. ఫైనాన్షియరుగా సినిమా ప్రపంచానికి చాలా కాలం నుంచి సన్నిహితమైన శింగనమల సత్యరామమూర్తి కుమారుడే రమేశ్ బాబు. ఈయనా తండ్రి బాటలోనే ఫైనాన్షియరుగా కొనసాగుతూ కొంత కాలం క్రితం రాజశేఖర్ హీరోగా 'విలన్' సినిమాని నిర్మించారు. ఆ తర్వాత ఆయన తెలుగులో సినిమాలు తీస్తున్నది ఇప్పుడే. ఈ మధ్యలో ఆయన తమిళంలోని టాప్ హీరోలతో సినిమాలు నిర్మించారు.
నిర్మాణవ్యయంపై వేడి వేడి చర్చ
తెలుగులో పవన్ కల్యాణ్, మహేశ్ లతో ఆయన సినిమాలు ప్రకటించినప్పుడు ఎవరూ ఆశ్చర్యపోలేదు. ఫైనాన్షియరుగా ఆయన శక్తేమిటో చిత్రసీమకు తెలుసు కాబట్టి. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన నిర్మిస్తున్న సినిమాల బడ్జెట్ గురించీ ఒక్కో సంగతే తెలుస్తుంటే ఆశ్చర్యపోక తప్పని స్థితి.
నిరుడు రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్ నటించిన 'మగధీర' సినిమా బడ్జెట్ చూసి అందరూ ముక్కుమీద వేలేసుకున్నవాళ్లే. తెలుగు సినిమా పరిధిని మించి ఆ సినిమాకి భారీగా ఖర్చు పెట్టారనే వ్యాఖ్యానాలే అంతటా. అయితే ఆ సినిమా అనూహ్యమైన విజయం సాధించింది కాబట్టీ, తెలుగు చలనచిత్ర చరిత్రలోనే కనీవినీ కలెక్షన్ల తుఫాను సృష్టించింది కాబట్టీ నిర్మాత అల్లు అరవింద్ లాభాలు డండుకున్నారు. 35 కోట్ల రూపాయల వ్యయమైన ఆ సినిమా 80 కోట్ల రూపాయల్ని మించి వసూలు చేయడం నిజంగా ఘన చరిత్రే. అదృష్టం బాగుండి ఈ సినిమా బంపర్ హిట్టయ్యింది కాబట్టి సరిపోయింది. లేకపోతే, పరిస్థితి తారుమారైతే, ఆ సినిమా మీద పెట్టిన డబ్బంతా ఏమైపోయేది? ఇప్పుడు ఆ సినిమాకి మించి 'కొమరం పులి', 'ఖలేజా' సినిమాలకి వ్యయం చేస్తుండటం వల్లే తెలుగు సినిమా బడ్జెట్ గురించిన చర్చ మళ్లీ చిత్రసీమలో ఊపందుకుంది. రోజురోజుకీ నిర్మాణ వ్యయం కొండలా పెరిగిపోతూ, అదే స్థాయిలో నష్టాలూ సంభవిస్తుంటే, బడ్జెట్టుని కంట్రోల్ చేసుకోవాలని నిర్మాతల మండలి ఒకవైపు తన సభ్యులందరికీ పాఠాలు బోదిస్తోంది. మరోవైపు ఆ పాఠాల్ని పట్టించుకోకుండా, గతంలో ఎంతోమంది నిర్మాతలకి ఎదురైన గుణపాఠాల్ని ఖాతరు చేయకుండా కొంతమంది నిర్మాతలు తమ సినిమాలకి గల్లాపెట్టెలు ఖాళీ అయ్యే స్థాయిలో కాసులు ధారాళంగా కుమ్మరిస్తూనే ఉన్నారు.
కాంబినేషన్స్ మీదే దృష్టి
'కొమరం పులి', 'ఖలేజా' సినిమాల నిర్మాణ పనులు దాదాపు రెండేళ్ల క్రితమే మొదలయ్యాయి. నిజం చెప్పాలంటే చిత్ర పరిశ్రమలో వీటిని 'కాంబినేషన్ సినిమాలు' అని పిలుస్తున్నారు. కథని నమ్ముకుని తీసే సినిమాలు ఒకరకమైతే, హీరో హీరోయిన్ల లేదా హీరో డైరెక్టర్ల కాంబినేషన్ని నమ్ముకుని తీసే సినిమాలు ఇంకో రకం. ఈ రెండో రకం సినిమాలనే 'కాంబినేషన్ సినిమాలు' అంటారు. 'ఖుషి'తో సంచలనం సృష్టించిన హీరో డైరెక్టర్ల ద్వయం పవన్ కల్యాణ్, ఎస్.జె. సూర్య కాంబినేషనుతో 'కొమరం పులి' తయారవుతుంటే, 'అతడు'తో హిట్ సాధించిన హీరో డైరెక్టర్లు మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషనుతో 'మహేశ్ ఖలేజా' రూపొందుతోంది. 'అరుంధతి'తో సూపర్ హీరోయిన్ ఇమేజ్ పొందిన అనుష్క చేరికతో 'ఖలేజా' కాంబినేషనుకి మరింత క్రేజ్ వచ్చింది.
ఈ రెండు సినిమాల్లో మొదట 'కొమరం పులి' షూటింగ్ మొదలయ్యింది. ఆర్మీ ఆఫీసరుగా నటించిన పవన్ కల్యాణ్ సరసన నికిషా పటేల్ హీరోయినుగా పరిచయమవుతోంది. ఆమెది పోలీస్ ఆఫీసర్ పాత్ర. టెర్రరిస్టుల్ని ఏరిపారేసే బృంద నాయకుడిగా పవన్ కల్యాణ్ నటన ఈ సినిమాకి హైలైట్ అంటున్నారు. మెలితిప్పిన మీసంతో ఆయన ఆహార్యం ఇప్పటికే అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో నిర్మాణ వ్యయాన్ని పెంచే హెలికాప్టర్లు ఉపయోగించారు. భారీ ఛేజింగ్ సన్నివేశాల్లో ఎన్నో కార్లు ధ్వంసం చేశారు. పవన్ సహా సినిమాలో మిగతా పాత్రలు ఉపయోగించిన గన్సుని దుబాయ్ నుంచి తెప్పించారని వినిపిస్తోంది. కాస్ట్యూమ్సుకీ, పాటల చిత్రీకరణకీ విపరీతంగా ఖర్చు చేశారు. గ్రాఫిక్సునీ ఎక్కువగానే ఉపయోగించుకున్నారు. ప్రతి సన్నివేశంలోనూ భారీతనం ఉట్టిపడేట్లు చర్యలు తీసుకున్నారు. క్లైమాక్స్ సన్నివేశాలకి చేతికి ఎముకలేనట్లు వ్యయం చేశారు. ఇక దేశంలోనే అత్యంత ఖరీదైన మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్. రెహమాన్ ఈ సినిమాకి పనిచేశారు. ఈ రకంగా ఈ సినిమాకి విపరీతంగా డబ్బు ఖర్చుపెట్టారు. 'మగధీర'ని మించి ఈ సినిమాకి బడ్జెట్ ఎక్కువయ్యిందనేది చిత్రసీమలో ఇప్పుడు అందరూ చెబుతున్న మాట. అంటే ఏమిటి? 'మగధీర' స్థాయిలో విజయం సాధిస్తే తప్ప 'కొమరం పులి' మీద పెట్టుబడి పెట్టినవాళ్లు బయటపడే అవకాశం లేదు.
ఆవురావురుమంటున్న అభిమానులు
ఓవైపు 'కొమరం పులి' సెట్స్ మీదకు వెళ్లి కొద్ది రోజులైనా కాలేదు, 'ఖలేజా' మొదలైంది. మహేశ్ సరసన మొదట నాయికగా పార్వతీ మెల్టన్ ని తీసుకున్నారు. ఆ సమయంలోనే 'అరుంధతి' వచ్చి సూపర్ హిట్టయ్యింది. అంతే - పార్వతి స్థానంలో అనుష్క వచ్చి చేరింది. ఇది మహేశ్, అనుష్క తొలి కాంబినేషన్. గ్లామరులోనూ, ఒడ్డూ పొడుగుల్లోనూ ఒకరికి ఒకరు తీసిపోని జంట. దాంతో సహజంగానే ఈ సినిమా పట్ల ఆసక్తి పదింతలైంది. ఇటీవల 'ఖలేజా' టైటిల్ లోగోని 'ట్విట్టర్'లోని తన బ్లాగులో మహేశ్ బహిర్గతం చేసీ చేయగానే వచ్చిన స్పందన ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఏ స్థాయిలో ఉందో తెలిసింది. 'అతిథి' వచ్చి మూడేళ్లవడంతో మహేశ్ సినిమా కోసం ఆయన అభిమానులు ఆవురావురుమంటూ ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ శైలిలో యాక్షన్ ఎంటర్టైనరుగా రూపొందుతోన్న ఈ సినిమాకీ మంచినీళ్ల ప్రాయంలా డబ్బు ఖర్చు పెడుతున్నారు. సాధారణంగా త్రివిక్రమ్ సినిమా అంటే ఎక్కువ పని దినాలు ఉంటాయనీ, నెగటివ్ ఎక్కువ ఖర్చవుతుందనీ పేరు. ఏదేమైనా ఒకేసారి రెండు మహా భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించాల్సి రావడంతో శింగనమల రమేశ్ ఉక్కిరిబిక్కిరయ్యారు. అందుకే సీనియర్ నిర్మాత సి. కల్యాణ్ సాయం కోరారు. అలా ఈ సినిమాల ప్రొడక్షనులోకి అడుగుపెట్టారు కల్యాణ్. ఆయన పర్యవేక్షణ తర్వాతే ఈ సినిమాల షూటింగ్ వేగం అందుకుందన్నది బహిరంగ రహస్యం.
మొత్తానికి ఈ రెండు సినిమాల్లో 'కొమరం పులి' ప్రాజెక్టు పూర్తయ్యింది. కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'ఖలేజా' షూటింగ్ కూడా దాదాపు అయిపోయినట్లే. పోస్ట్ ప్రొడక్షన్ పనులే మిగిలాయి. వాటిని కూడా పూర్తిచేసి, 'కొమరం పులి' విడుదలైన నెల రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఈ సినిమాల నిర్మాణంలో పాలుపంచుకున్న డబ్బెంతో సుమారుగా తెలిసిన వాళ్లంతా ఆ డబ్బు ప్రేక్షకుల నుంచి రికవర్ అవుతుందా, లేదా - అనే చర్చల్లో మునిగి తేలుతున్నారు. ఇవి సూపర్ డూపర్ హిట్లయితే ఫర్వాలేదు, లేదంటే.. చూద్దాం ఏం జరుగుతుందో..

No comments: