Monday, August 30, 2010

Movies: Ram Gopal Varma's Counter Warning



"ఓబుల్ రెడ్డికి సంబంధించిన మనుషులు అతన్ని దుర్మార్గుడిగా చూపిస్తే ఊరుకునేది లేదని నాకు ఒక నోటీసు పంపారు. ఒకవేళ అలా చూపిస్తే, కోర్టు తీర్పు కోసం ఆగకుండా తమదైన పద్ధతిలో చంపుతామని రకరకాల వర్గాల ద్వారా వార్నింగులు పంపారు. నేను సినిమాలో ఏం చూపించానో అది సినిమా చూసే వరకూ ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. సినిమాలో ఉన్నవీ, లేనివీ వాళ్లకి వాళ్లు ఊహించుకుని నన్ను భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్న వాళ్లకి నేను ఇచ్చే వార్నింగ్ ఒక్కటే. నేను ఓబుల్ రెడ్డి మనుషులకి కాదు కదా..! చచ్చిపోయిన ఓబుల్ రెడ్డి దెయ్యమై తిరిగొచ్చినా కూడా భయపడను.
ఇది నా కౌంటర్ వార్నింగ్
-రాంగోపాల్ వర్మ"
ఇదీ రాంగోపాల్ వర్మ మార్కు రిటార్ట్. తెలుగుదేశం పార్టీకి చెందిన దివంగత ఎమ్మెల్యే పరిటాల రవి జీవిత కథ ఆధారంగా వర్మ 'రక్తచరిత్ర' తీస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా తొలి పార్ట్ రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలో ఓబుల్ రెడ్డి అనుయాయులుగా భావిస్తున్న వాళ్లు సినిమాలో ఓబుల్ రెడ్డిని విలన్ గా చూపించినట్లు తెలిసిందని, వెంటనే అలాంటి సన్నివేశాలు తొలగించాలని, లేనిపక్షంలో వర్మని చంపుతామని వర్మ ముంబై ఆఫీసుకి బెదిరింపు ఉత్తరాలు పంపారు. ఫోన్ కాల్స్ చేశారు. మరోవైపు ఓబుల్ రెడ్డి సోదరి ఉమాదేవి కూడా వర్మకు లీగల్ నోటీసు పంపింది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు వర్మ ఘాటుగా సమాధానమిచ్చారు.
పరిటాల రవి, ఓబుల్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. మరణించిన ఓబుల్ రెడ్డిపై పలు రేప్, మర్డర్ కేసులు పెండింగులో ఉన్నాయి.
మరోవైపు ఈ బెదిరింపు ఫోన్ల వెనుక మద్దెలచెరువు సూరి ఉన్నాడనే ప్రచారం కూఢా జరిగింది. ఓబుల్ రెడ్డికి సూరి సన్నిహితుడు. అయితే ఆ ఫోన్లకీ, తనకీ ఎలాంటి సంబంధమూ లేదనీ, వాటిని నమ్మవద్దనీ వర్మకి సూరి తెలిపినట్లు సమాచారం.
'రక్త చరిత్ర'లో పరిటాల రవిగా వివేక్ ఓబరాయ్, అతని భార్య సునీతగా రాధికా ఆప్టే, సూరిగా సూర్య, అతని భార్య భానుమతిగా ప్రియమణి, నాగమునిరెడ్డిగా కోట శ్రీనివాసరావు, ఎన్టీఆర్ గా శతృఘ్న సిన్హా నటించారు.

No comments: