Sunday, August 29, 2010

Movies: Silver screen Narada


తెలుగు సినిమాల్లో నారదుడి పాత్రను ఇప్పటివరకు ఎంతోమంది పోషించారు. ముఖ్యంగా నారదుడి పాత్ర అనగానే గుర్తుకువచ్చే పేరు కాంతారావు. ఆయనలా ఆ పాత్రలో ఒదిగిపోయిన నటులు ఇంకొకరు అవుపించరు. 'గంగా గౌరీ సంవాదం' (1958), 'దీపావళి' (1960), 'సతీ సులోచన' (1961), 'సీతారామ కల్యాణం' (1961), 'శ్రీకృష్ణార్జున యుద్ధం' (1963), 'శ్రీకృష్ణ పాండవీయం' (1966), 'శ్రీకృష్ణ తులాభారం' (1966) వంటి చిత్రాతో ఆయన అభినవ నారదుడిగా సినీ చరిత్రలో నిలిచిపోయారు. అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, హరనాథ్, పద్మనాభం, చంద్రమోహన్ కూడా ఆ పాత్రకు వన్నె తెచ్చారు. ఇటీవలి కాలంలో నారదుడి పాత్ర అంటే నరేశ్ వేస్తున్నారు.
ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ 'భక్త ప్రహ్లాద' (1967)లో నారదుడిగా మెప్పించారు. హాస్యనటులైన రేలంగి 'చెంచులక్ష్మి', 'భీష్మ' సినిమాల్లో, రమణారెడ్డి 'పార్వతీ కల్యాణం' (1962)లో, నూతన్ ప్రసాద్ 'కనకదుర్గా మహాత్మ్యం'లో నారద పాత్ర వేశారు.
విశేషమేమంటే ఒక నటి కూడా తెరమీద నారదుడిగా నటించడం. 'కృష్ణప్రేమ' (1943) సినిమాలో నారద పాత్రని టంగుటూరి సూర్యకుమారి పోషించారు. ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో ఆ పాత్రని చేసిన ఏకైక నటి ఆమే.

No comments: