Friday, August 27, 2010

Movies: 'Promotion' Mantra


ఇవ్వాళా రేపూ లో-బడ్జెట్ సినిమా అయినా, భారీ బడ్జెట్ సినిమా అయినా కరెక్టుగా ప్రమోట్ చేయకపోతే కష్టమే. ఇమేజ్ ఉన్న హీరో సినిమా అయితే ప్రమోషన్ సరిగ్గా ఉంటే చాలు బీభత్సమైన ఓపెనింగ్స్. మొదటి రెండు వారాలు హౌస్ ఫుల్ కలెక్షన్లు. నిర్మాతకు కాసుల వర్షం కురిపించకున్నా ఆర్థికంగా చితికిపోకుండా కాపాడుతుంది.
ఆడియో ఎంత గ్రాండుగా విడుదల చేస్తే సినిమాను అంత బాగా ప్రమోట్ చేసుకున్నట్టు. అందుకే డబుల్ ప్లాటినమ్ డిస్క్ అనీ, ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ అనీ ఆడియో వేడుకలు ఎక్కువయ్యాయి ఈమధ్య. ప్రమోషన్ దృష్టిలో ఉంచుకునే జయాపజయాలతో సంబంధం లేకుండా, విడుదలకు ముందే ఇలాంటి వేడుకలు చేసేస్తున్నారు.
ప్రమోషన్ పరిధి, అవసరం పెరిగాక శత దినోత్సవ వేడుకలు, అర్ధ శతదినోత్సవ వేడుకలకు కాలం చెల్లిపోయింది. సినిమా కలెక్షన్లు, రికార్డులే తప్ప వందరోజుల పోస్టర్ చూసి గొప్పగా ఫీలయ్యే సినీ ప్రేమికులు ఇప్పుడు ఎవరూ లేకుండా పోయారు.
డబ్బింగ్ సినిమాలకు కూడా ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ రావటానికి కారణం ఆయా సంస్థలు చేస్తున్న ప్రమోషనే. హాలీవుడ్ సినిమా 'అవతార్', రజనీకాంత్ సినిమా 'శివాజి' సాధించిన విజయం ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

No comments: