Wednesday, August 25, 2010

Society: Tollywood shakes with Drug and Sex Rockets



కొద్దిరోజులుగా జరుగుతున్న సంఘటనలు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మొదట డ్రగ్ రాకెట్, తర్వాత సెక్స్ రాకెట్ తెలుగు చిత్రసీమని గుక్క తిప్పుకోకుండా చేశాయి. ఈ రాకెట్లు బయట పడినందుకంటే వాటికి మీడియా ఇచ్చిన ప్రాధాన్యమే సినిమావాళ్లని మరింత బాధపెట్టినట్లు కనిపిస్తోంది. ఇలాంటి నేరాలు అన్ని రంగాల్లోనూ జరుగుతున్నా ఒక్క టాలీవుడ్ నే ఎందుకు టార్గెట్ చేసి, దానిపై లైవ్ షోలు, చర్చలు వంటివి పెట్టి, స్టోరీలు ప్రసారం చేసి, మొత్తం టాలీవుడ్ పరువుని బజారుపాలు చేస్తున్నారని వాళ్లు వాపోతున్నారు. 'మా' అధ్యక్షుడు మురళీమోహన్ వ్యక్తం చేసిన బాధ తీరు దీనికి మంచికి ఉదాహరణ. 'సార్, దాదాపు నాలుగు దశాబ్దాలుగా (ఆయన నటించిన తొలి సినిమా 'జగమే మాయ' వచ్చింది 1973లో) సినీరంగంలో ఉన్నారు కదా అప్పటికీ ఇప్పటికీ చిత్రసీమలో నైతిక విలువల్లో వచ్చిన మార్పుల గురించి మీ అభిప్రాయం చెబుతారా?' అనడిగా.
వెంటనే ఆయన రివర్సులో రియాక్ట్ అయ్యారు. "ఏం బాబూ ఇప్పటిదాకా చానళ్లలో మమ్మల్ని ఎంతగా భ్రష్టు పట్టించాలో అంతగా భ్రష్టు పట్టించారు. అది చాల్లేదా. ఇంకా ఏం మిగిలిందని మాట్లాడమంటున్నారు? ఏ ఫీల్డులో ఇలాంటివి జరగడం లేడు? అంతెందుకు మీ మీడియాలో నైతిక విలువలు బాగానే ఉన్నాయా? ఒకరిమీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు కదా? దయచేసి మమ్మల్నిలా వదిలెయ్యంది. మీరు ఏం రాసుకుంటారో రాసుకోండి. నేనేమీ దీనిపై మాట్లాడను" అని కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడి ఫోన్ పెట్టేశారు. ఫిల్మ్ చాంబర్ సెక్రెటరీ కె.సి. శేఖర్ బాబు కూడా దీనిపై తానేమీ మాట్లాడనన్నారు. దీనిబట్టి డ్రగ్స్, సెక్స్ రాకెట్లపై మీడియా చేసిన రాద్దాంతం టాలీవుడ్ ని ఎంతగా కుదిపేస్తున్నదో అర్థమవుతోంది. మీరేమంటారు?

No comments: