Friday, August 27, 2010

Movies: 'Jai Bolo Telangana' launched


మహాలక్ష్మీ ఆర్ట్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'జై బోలో తెలంగాణ'. ఎన్. శంకర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం గురువారం ( 26ఆగస్టు) ఉదయం హైదరాబాద్ బేగంపేటలోని దత్త హ్యూమన్ సర్వీసెస్ సెంటర్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ జేఏసీ కో కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు క్లాప్‌నిచ్చారు. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర లోగోను ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు సంయుక్తంగా ఆవిష్కరించారు. స్క్రిప్టును ఉస్మానియా విశ్వవిద్యాలయం జేఏసీ నాయకులు ఎన్.శంకర్‌కు అందజేశారు.
ఎన్.శంకర్ మాట్లాడుతూ "ఇవాళ, రేపు షూటింగ్ చేస్తాం. తదుపరి షెడ్యూల్ సెప్టెంబరు 3 నుంచి ఉంటుంది. మిగిలిన వివరాలను త్వరలో వెల్లడిస్తామ''ని అన్నారు. "తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా తప్పక అందరినీ ఆకట్టుకుంటుంద''ని గీతరచయితలు గోరటి వెంకన్న, అందెశ్రీ, నందిని సిద్ధారెడ్డి, జయరాజ్, కోదారి శ్రీను, జూలూరి గౌరీ శంకర్ పేర్కొన్నారు.
"స్వాతంత్య్రం నేపథ్యంలో ఇప్పటిదాకా పలు సినిమాలు వచ్చాయి. విద్యార్థుల జీవితాలు, వారు త్యాగం చేసిన సన్నివేశాలు, ప్రత్యేక రాష్ట్రం వంటి వివరాలతో వస్తున్న ఈ చిత్రం కూడా అందరినీ అలరించాల''ని 'మా' అధ్యక్షుడు మురళీమోహన్ ఆకాంక్షించారు. సినిమా విజయాన్ని సాధించాలని పరుచూరి గోపాలకృష్ణ, బి.గోపాల్, కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు అభిలషించారు.
ఈ చిత్రానికి సంగీతం: చక్రి, పాటలు: కె.సి.ఆర్, సుద్దాల, గోరటి వెంకన్న, అందెశ్రీ, నందిని సిద్ధారెడ్డి, జయరాజ్, కోదారి శ్రీను, జూలూరి గౌరీ శంకర్, గద్దర్, మాటలు: ఊడుగుల వేణు, కెమెరా: రవి.కె.నీర్ల, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాణ-నిర్వహణ: ఎన్.శ్రీనివాస్, నిర్వహణ: ఎన్.అంజన్ బాబు, కళ: మధు రెబ్బ

No comments: