Wednesday, September 1, 2010

Movies: Rs. 17 Crores deficit for 'Komaram Puli'?


పవన్ కల్యాణ్ సినిమా 'కొమరం పులి'పై ఫిలింనగర్ లో రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆ సినిమా ఎప్పుడు రిలీజయ్యేదీ ఇప్పటికీ స్పష్టం కాకపోవడమే ఈ ఊహాగానాలకు కారణం. సెప్టెంబర్ 2 పవన్ పుట్టిన రోజు కాబట్టి ఆ రోజే సినిమా వస్తుందని ఇప్పటిదాకా అందరూ అనుకున్నారు. అయితే ఆరోజు 'కొమరం పులి' రావడం లేదని తేలిపోయింది. సినిమాకి రీరికార్డింగ్ పూర్తికాకపోవడమే దీనికి కారణమనీ, రజనీకాంత్ సినిమా 'రోబో' పని పూర్తయినాకే 'కొమరం పులి'కి మిగిలి వున్న రీరికార్డింగ్ పూర్తి చేస్తానని రెహమాన్ అన్నాడనీ ప్రచారంలోకి వచ్చింది. అయితే అది కరెక్ట్ కాదని విశ్వసనీయ వర్గాల సమాచారం. రెహమాన్ కి సంబంధించిన పని పూర్తయిపోయిందనీ, 'కొమరం పులి' విడుదల వాయిదా పడటానికి కారణం ఫైనాన్స్ ప్రాబ్లమేననీ ఆ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆ సినిమా 17 కోట్ల రూపాయల డెఫిసిట్ తో ఉందనీ, అంత నష్టాన్ని తాను భరించలేననీ నిర్మాత శింగనమల రమేశ్ తేల్చి చెప్పడం వల్లే ఈ అనిశ్చిత స్థితి తలెత్తినట్లు సమాచారం. హీరో పవన్ కల్యాణ్ కూడా ఈ నష్టంలో కొంత భరించాలనేది ఆయన వాదన అంటున్నారు. మరోవైపు 'కొమరం పులి' తర్వాతే 'మహేశ్ ఖలేజా'ని విడుదల చేయాలని గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అధినేత అల్లు అరవింద్ పట్టుబడుతున్నట్లు ఆ వర్గాలు అంటున్నాయి. దీంతో ఇప్పటిదాకా అనుకుంటున్నట్లు 'మహేశ్ ఖలేజా' అయినా సెప్టెంబర్ 30న వస్తుందా అనేదాంట్లో సందిగ్ధత నెలకొంది.

No comments: