Thursday, September 9, 2010

సినిమా: రామానాయుడుకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు


ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సినిమాలు నిర్మించిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించిన డి. రామానాయుడు 2009 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందారు. సినీ రంగానికి సంబంధించి భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం ఇదే. 19 సంవత్సరాల తర్వాత ఈ అవార్డు మళ్లీ ఓ తెలుగు సినిమా వ్యక్తికి లభించింది. చివరిసారి 1991లో మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు ఈ అవార్డును అందుకున్నారు.
అక్టోబరులో గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ అవార్డు కింద స్వర్ణ కమలం, 10 లక్షల రూపాయల నగదు బహుమతి, శాలువాను రామానాయుడు అందుకుంటారు.
భారతదేశంలో ఎన్ని భాషల్లో సినిమాలు తయారవుతున్నాయో అన్ని భాషల్లోనూ సినిమాలు తీసిన నిర్మాతగా కూడా రామానాయుడు ఓ అరుదైన ఘనతని పొందారు. తెలుగులో 78 సినిమాలు, హిందీలో 20 సినిమాలు నిర్మించిన ఆయన బెంగాలీ, తమిళం, కన్నడ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, భోజిపురి భాషల్లోనూ సినిమాలు తీశారు.
ఆయన నిర్మించిన చిత్రాల్లో తెలుగులో రాముడు-భీముడు, ప్రేమనగర్, దేవత, అహ నా పెళ్లంట, బొబ్బిలిరాజా, ప్రేమించు సినిమాలు; హిందీలో ప్రేమ్ నగర్, దిల్ దార్, తోఫా, హమ్ ఆప్కే దిల్ మే రహతే హై సినిమాలు; బెంగాలీలో 'ఆశుక్', తమిళంలో 'వసంత మాళిగై', 'మధుర గీతమ్' సినిమాలు; ఇటీవల భోజిపురిలో తీసిన 'శివ' ఆయనకు మంచి పేరు తెచ్చాయి.
ప్రకాశం జిల్లా (అప్పట్లో గుంటూరు జిల్లా) కారంచేడులో 1936 జూన్ 6న జన్మించిన రామానాయుడు 1962లో మద్రాసుకు వెళ్లి తెలుగు సినీరంగలో కాలుమోపారు. మొదట అనురూపా ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థలో భాగస్వామి అయ్యి 'అనురాగం' సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్నారు. కానీ టైటిల్స్ లో మాత్రం ఆయన పేరు వేయలేదు. తర్వాత పెద్ద కుమారుడు సురేశ్ పేటిట సురేశ్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థని సొంతంగా స్థాపించిన రామానాయుడు తొలియత్నంలోనే ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో 'రాముడు-భీముడు' (1964) చిత్రాన్ని నిర్మించి ఘనవిజయాన్ని అందుకున్నారు. 'శ్రీకృష్ణ తులాభారం' (1966) వంటి మరో విజయం తర్వాత వరుసగా ఐదు ఫ్లాపులు చవిచూసిన ఆయనను 1971లో అక్కినేని హీరోగా వచ్చిన 'ప్రేమనగర్' సినిమా నిలబెట్టింది. అది సూపర్ డూపర్ హిట్ కావడంతో రామానాయుడు మళ్లీ వెనుతిరిగి చూసుకోనవసరం లేకపోయింది.
తెలుగు చిత్రసీమ హైదరాబాదుకు తరలి వచ్చాక రామానాయుడు స్టూడియోస్ ని నిర్మించి, సినిమా షూటింగులకు కావాల్సిన ఫ్లోర్లతో పాటు పోస్ట్ ప్రోడక్షన్ కి అవసరమైన అన్ని సదుపాయల్నీ ఏర్పాటు చేశారు. ఈమధ్యే విశాఖపట్నంలో 25 ఎకరాల సువిశాల స్థలంలో స్టూడియోని నిర్మించి అక్కడ కూడా సినిమాలు నిర్మించే ఏర్పాట్లు చేశారు. రామానాయుడుకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం పట్ల చిత్రసీమకు చెందిన పలువురు హర్షం వ్యక్తం చేశారు. వారిలో అక్కినేని, దాసరి, జమున, వాణిశ్రీ, వి.బి. రాజేంద్రప్రసాద్, కె. రాఘవేంద్రరావు, మోహన్ బాబు, సి. నారాయణరెడ్డి వంటి వాళ్లున్నారు.
అవార్డుకు ఆని విధాలా తగిన మనిషి: అక్కినేని
ఈ అవార్డుకు ఆని విధాలా తగిన మనిషి రామానాయుడు. ఆయన కేవలం నిర్మాత కాదు. బహుముఖ ప్రజ్ఞాశాలి. సినిమాకి సంబంధించిన అన్ని విషయాలలోనూ ఆయనకు అవగాహన ఉంది. ఏ వేషానికి ఎవరు సరిపోతారో ఆయనకు బాగా తెలుసు. సామాజిక స్పృహ ఉండి, ప్రేక్షకుల నాడి తెలిసిన నిర్మాత. ఆయన తీసినా సినిమాల్లో సామాజిక స్పృహ ఉంటుంది. 'ప్రేమనగర్' పైకి రొమాంటిక్ సినిమాగా కనిపిస్తుంది కానీ అందులో సామాజిక స్పృహ ఉంది. ఒక డబ్బున కురాడు తప్పుడు రీతిలో పెరిగితే ఎట్లా తయారవుతాడో అందులో నేను పోషించిన కల్యాణ్ పాత్ర చెబుతుంది. ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది.
నన్ను 'సినీ సత్యభామ'ను చేసింది ఆయనే: జమున
నన్ను 'సినీ సత్యభామ'ని చేసింది నాయుడుగారే. ఆయన బేనరులో నిర్మించిన తొలి సినిమా 'రాముడు-భీముడు'లోనూ, మూడో సినిమా 'శ్రీకృష్ణ తులాభారం'లోనూ నాయికగా నటించే అవకాశం నాకు కలిగింది. రెందూ సూపర్ హిట్టయ్యాయి. నాకూ మంచి పేరొచ్చింది. ముఖ్యంగా 'శ్రీకృష్ణ తులాభారం'లో చేసిన సత్యభామ పాత్ర ఎంత పేరు తెచ్చిందో చెప్పలేను. ఆ సినిమా తర్వాత సత్యభామ పాత్రంటే జమునే వేయాలి అన్నంతగా జనంలో ముద్రపడిందంటే ఆ క్రెడిట్ నాయుడుగారిదే. ఆయనకు ఫాల్కే అవార్డు రావడం ఒక తెలుగు నటిగా నాకెంతో గర్వంగా ఉంది.

No comments: