Thursday, September 16, 2010

ట్రేడ్ రిపోర్ట్: 'పులి' ఫ్లాప్ షో!


పవన్ కల్యాణ్, ఎస్.జె. సూర్య కాంబినేషనులో వచ్చిన 'పులి' సినిమా బాక్సాఫీసు వద్ద కుదేలయ్యింది. ఆ సినిమా డిజాస్టర్ అని ట్రేడ్ వర్గాలు ముక్తకంఠంతో తేల్చి చెబుతున్నాయి. ఎంతో గ్రాండుగా అత్యధిక థియేటర్లలో ఈనెల 10న విడుదలైన ఆ సినిమాకి వారాంతం వసూళ్లు బాగానే ఉన్నా, సినిమా బాగాలేదనే టాక్ వ్యాపించడంతో సోమవారం నుంచి 30-50 శాతం వసూళ్లు పడిపోయాయి. దాంతో పవన్ కల్యాణ్ సినిమాల్లో ఇదివరకు అట్టర్ ఫ్లాపయిన 'జానీ'తో ఈ సినిమాని పోలుస్తున్నారు. ఫలితంగా రెండో వారం చాలా థియేటర్ల నుంచి ఈ సినిమా మాయమవనున్నది. ఇంకోవారం పోతేగానీ ఈ సినిమా ఏ స్థాయి ఫ్లాపనేదీ స్పష్టం కాదు. మరోవైపు ఈ సినిమాతో భారీగా నష్టపోయిన నిర్మాత శింగనమల రమేశ్ బాబుకి హీరో పవన్ తన రెమ్యూనరేషనులోంచి ఐదు కోట్ల రూపాయల్ని తిరిగిచ్చేశారనేది ఫిలింనగర్ వర్గాల భోగట్టా. అలాగే ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన అల్లు అరవింద్ సైతం మూడు కోట్ల రూపాయల్ని రమేశ్ కి ఇచ్చినట్లు చెబుతున్నారు.
'పులి' ఫ్లాపయినా దాన్ని క్యాష్ చేసుకోవడంలో జగపతిబాబు సినిమా 'గాయం-2' ఫెయిలయ్యింది. రెండో వారం ఆ సినిమా వసూళ్లు సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. 'మర్యాద రామన్న', 'డాన్ శీను' సినిమాల కలెక్షన్లు ఓ మోస్తరుగా నమోదయ్యాయి. రాజేంద్ర ప్రసాద్, శివాజి సినిమా 'బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం' సినిమా నేటితో (15తో) 50 రోజులు పూర్తి చేసుకుంది. భూమిక, భరత్ ఠాకూర్ల సినిమా 'తకిట తకిట'కి పెట్టిన డబ్బంతా వృథా అయినట్లే. మరోవైపు హాలీవు సినిమా 'రెసిడెంట్ ఈవిల్-4'కి యువ ప్రేక్షకులు బాగా వస్తున్నారు.

No comments: