Saturday, September 11, 2010

సమాజం: కామస్వాముల లోకం


ఆధ్యాత్మిక ప్రపంచంలో అనాది నుంచి భారత దేశానికి ఉన్న విశిష్ట స్థానం క్రమేపీ మసకబారుతూ వస్తోంది. కొంతమంది కుహనా స్వాముల కామ కలాపాలతో ఇటీవలి కాలంలో మన ఆధ్యాత్మిక జీవన వాహిని కునారిల్లుతోంది. 'ఏ స్వామి చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం. రాసలీలలు, అవినీతి కార్యకలాపాలు తప్ప' అన్నట్లు తయారయ్యింది పరిస్థితి. ప్రజల బలహీనతల్ని, మూఢ నమ్మకాల్ని నకిలీ బాబాలు సొమ్ము చేసుకుంటున్నారు.
ఒకప్పటి ఆధ్యాత్మిక గురువులకు వేటిపైనా వ్యామోహం ఉండేది కాదు. దేహం అశాశ్వతమనీ, ఆత్మ ఒక్కటే శాశ్వతమనీ ప్రవచిస్తూ సన్యాసి తరహా జీవితాన్ని గడిపేవారు. ఇప్పటి స్వాములు అందుకు పూర్తిగా విరుద్ధం. ఐహిక సుఖాలే ముక్తిమార్గమని భక్తులకు బోధిస్తున్నారు. భగవంతుడి అవతారంగా తమని తాము ప్రచారం చేసుకుంటూ జనాల్ని మాయలో పడేస్తున్నారు. రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులే ఈ మాయలో పడుతున్నారంటే మామూలు ప్రజానీకం సంగతి వేరే చెప్పనవసరం లేదు కదా. సమకాలీనంగా కనీసం ఆరుగురు స్వాములపై హత్యానేరాలు, లైంగిక వేధింపుల కేసులు, తార్పుడు కేసులు నమోదయ్యాయంటే స్వాములోరి లీలలు ఎంతగా విస్తరిస్తున్నాయో అర్థం చేసుకోవాల్సిందే. కళ్లు చెదిరే భవంతులు, కోట్లాది రూపాయల విలువైన రియల్ ఎస్టేట్లు, సినీ తారల సాంగత్యం, అడుగులకు మడుగులొత్తే మందీ మార్బలం, సాష్టాంగ పడే కొందరు చట్టసభల ప్రతినిధులు వెరసి నకిలీలు వెలిగిపోతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో బాబాగా పరిచయస్తుడైన శివ ద్వివేదీ ఉరఫ్ ఇచ్ఛాధారి సంత్ స్వామి నెరపిన కోట్లాది రూపాయల 'సెక్స్' కుంభకోణం బయట పడటంతో ప్రపంచం నివ్వెరపోయింది. దక్షిణ తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన నిత్యానంద స్వామి రాసలీలలు తిలకించి సామాన్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవల్లంలోని కల్కి భగవాన్ ఆశ్రమంలో డ్రగ్స్ వినియోగం, అర్థనగ్న నృత్యాలు, కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాల కబ్జా సంగతులు ఆశ్రమ భక్తుల వల్లే బయటపడి అందర్నీ నిశ్చేష్టుల్ని చేసింది. ఇక పుట్టపర్తిలోని ఆధ్యాత్మిక కేంద్రం సత్యసాయి ప్రశాంతి నిలయంలో రెండు దశాబ్దాల క్రితం జరిగిన నలుగురి హత్య మిస్టరీ ఈనాటికీ వీడలేదు.
అనంతపురంలోని కాలేశ్వరస్వామిపై వస్తున్న స్థల కబ్జా ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడైతే ఆధ్యాత్మిక కేంద్రాలు కార్పొరేట్ స్థాయికి చేరువయ్యాయో, అవలక్షణలు కూడా అలవడ్డాయి. ఆధ్యాత్మిక ముసుగులో అరాచక స్వాములు అవతరించారు. ఈ నకిలీ స్వాములకి ప్రజలే బుద్ధి చెప్పి, తరిమితరిమి కొట్టాలి.

No comments: