Wednesday, September 29, 2010

Memories: Ghantasala Venkateswara Rao

అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 1922 డిసెంబర్ 4న గుడివాడ వద్ద చౌటపల్లిలో జన్మించారు. తన సినీ జీవితంలో వంద సినిమాల వరకు సంగీత దర్శకత్వం వహించి, దాదాపు ఎనిమిది వేల పాటలు ఆలపించారు. ఆయన తొలి తిరుమల తిరుపతి ఆస్థాన గాయకులు.
సినిమాల్లో తొలిసారి ఘంటసాల బలరామయ్య రూపొందించిన 'సీతారామ జననం'లో ప్రభల సత్యనారాయణతో కలిసి కోరస్ పాడారు. ఆ సినిమాలో సీతాజననం సన్నివేశంలో నటించారు కూడా. దానికి గాను అప్పట్లో 10 రూపాయల పారితోషికాన్ని అందుకున్నారు.
సినిమా పాటలతో పాటు కరుణశ్రీ 'పుష్ప విలాసం', కుంతీ విలాపం ఖండ కావ్యం, శ్రీ శ్రీ 'పొలాలనన్నీ హలాల దున్నీ', గురజాడ 'పుత్తడిబొమ్మ పూర్ణమ్మ' వంటివి గానం చేశారు. ఆయనకు భారత ప్రభుత్వం 1970లో పద్మశ్రీ అవార్డ్ ఇచ్చి సత్కరించింది.              
ఆయన 'పరోపకారం', 'సొంత ఊరు', 'భక్త రఘునాథ్' అనే మూడు చిత్రాలు నిర్మించారు. మూడూ ఫ్లాపవడంతో లక్షల్లో నష్టపోయారు. 1953-54లో ఆరు లక్షల రూపాయల అప్పుల్లో పడ్డారు. 11 సంవత్సరాలు కష్టపడి 1965 నాటికి వాటినన్నింటినీ తీర్చగలిగారు. ఈ అప్పుల కారణంగా ఇంట్లో పనిమనిషినీ, చాకలినీ మాన్పించేశారు.
ఆయనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని చెప్పినా వినకుండా పట్టుదలతో భగవద్గీత గానం చేశారు. కానీ హెచ్.ఎం.వి. వాళ్లు దాని రికార్డుల్ని విడుదల చేయక మునుపే ఆరోగ్యం మరింత క్షీణించి 1974 ఫిబ్రవరి 11న మరణించారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు చేతుల మీదుగా ఆయన ఆలపించిన భగవద్గీత రెండు లాంగ్ ప్లే రికార్డ్స్ విడుదలయ్యాయి.
ఆయన వివాహం మేనమామ కుమార్తె సావిత్రితో 1944 మార్చి 3న జరిగింది. ఆయనకు ఐదుగురు పిల్లలు.. విజయ్ కుమార్, రత్నకుమార్, శ్యామల, సుగుణ, శాంతి. సుగర్ వ్యాధితో విజయ్ కుమార్ 45 ఏళ్ల వయసులో మరణిస్తే ఆయన పిల్లల్ని కూడా రత్నకుమార్ చూసుకుంటున్నారు.
ఆర్థిక ఇబ్బందుల వల్ల సావిత్రమ్మ తమ ఇంటి కింది భాగం అద్దెకిచ్చి పైభాగంలోకి మారారు. తమ కారుని టాక్సీగా తిప్పడానికి ఇచ్చారు. హెచ్.ఎం.వి. వాళ్ల నుంచి ఇదివరకులా రాయల్టీ రావడం లేదు. తన నగల్ని అమ్మి ఆడపిల్లల పెళ్లిళ్లు చేశారు.

No comments: