Tuesday, September 14, 2010

సినిమా: కొత్త హీరోయిన్లకు కలిసిరాని చిరంజీవి కుటుంబం


ఒకే కాంపౌండ్ హీరోల సినిమాలతో పరిచయమైన ఇద్దరు హీరోయిన్ల పరిస్థితి తెలుగులో అగమ్యగోచరంగా తయారయ్యింది. నిన్నటికి నిన్న 'వరుడు'లో అల్లు అర్జున్ సరసన నాయికగా పరిచయమైన భానుశ్రీ మెహ్రాని మళ్లీ పట్టించుకున్నవాళ్లే లేకపోయారు. ఇప్పటి వంతు 'పులి'లో పవన్ కల్యాణ్ సరసన నటించడం ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన నికిషా పటేల్ ది. 'పులి' కి సర్వత్రా నెగటివ్ టాక్ రావడం, సోమవారం నుంచి కలెక్షన్లు బాగా డ్రాప్ అవడం ఆమె కెరీర్ మీద ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్న ఆదివారం (12న) హైటెక్స్ లో జరిగిన కామెడీ అవార్డుల ఫంక్షన్ కీ, నిన్న (13న) 'రోబో' ట్రైలర్స్ ఆవిష్కరణ వేడుకకీ వచ్చిన ఆమె పట్ల మీడియా సహా ఎవరూ ఇంటరెస్ట్ చూపలేదు. చిన్న చిన్న తారలొస్తేనే ఎగబడే ఫోటోగ్రాఫర్లు ఆమెని చూసీ చూడనట్లే ఉన్నారు. అంటే ఆ సినిమా వల్ల నికిషా ఇసుమంత కూడా ఇమేజ్ పొందలేక పోయిందన్న మాట. బహుశా 'పులి' ఆమెకి మొదటి, చివరి తెలుగు సినిమా కావొచ్చేమో. లేదంటే చిన్న చిన్న హీరోలతో నటిస్తూ కాలక్షేపం చేయాల్సిందే. గతంలోనూ చిరంజీవి చివరి సినిమా 'శంకర్ దాదా ఎంబిబియస్' సినిమాలో నాయికగా పరిచయమైన కరిష్మా కోటక్ పరిస్థితి ఏమైందో మనకు తెలుసు. పెద్ద ఆఫర్లేమీ రాకపోవడంతో ఈమధ్యే 'గ్లామర్' అనే బి గ్రేడ్ సినిమాలో ఆమె కనిపించింది. అలాగే చిరంజీవి కుమారుడు రాంచరణ్ తొలి సినిమా 'చిరుత'లో నటించిన నేహాశర్మ సైతం సరైన అవకాశాలు పొందలేకపోయింది. దీన్నిబట్టి చూస్తుంటే చిరంజీవి కాంపౌండ్ ద్వారా పరిచయమయ్యే తారల గతి అంతే సంగతులు అనే అభిప్రాయం ఫిలింనగర్ లో వ్యాపిస్తోంది. కొత్త తారలూ బహుపరాక్.

No comments: