Tuesday, September 7, 2010

సినిమా: ఐదేళ్ల తర్వాతా నిర్మాతకి అవే కష్టాలు

ఐదేళ్ల క్రితం రాష్ట్రవ్యాప్తంగా ఎగ్జిబిటర్ల మొహాల్లో ఆనందం తాండవించింది. డిస్ట్రిబ్యూటర్ల సిండికేట్లో లేకపోయినా తమ థియేటర్ల నిర్వహణ ఇక భారం కాదన్న భరోసా వారికి కొండంత శక్తినిచ్చింది. వినోదపు పన్నుని శ్లాబ్ ప్రకారం వసూలు చేసే పద్ధతికి స్వస్తిచెప్పి, అమ్ముడుపోయిన టికెట్ల మీద పన్ను వసూలు చేసే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2005 జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకు రావడంతో ఎగ్జిబిటర్ల వ్యవస్థకు మళ్లీ జవసత్వాలు వచ్చాయని అంతా సంబరపడ్డారు. ఈ విధానం వల్ల చిన్న నిర్మాతలు ఒడ్డున పడతారని మెజారిటీ మంది నమ్మారు.
కానీ ఐదేళ్ల తర్వాత చూసుకుంటే.. పరిస్థితి ఇంకా ఘోరంగా కనిపిస్తోంది. పర్సంటేజ్ విధానం అమల్లోకి వచ్చినా, థియేటర్ల లీజు వ్యవస్థ యధాతథంగా కొనసాగుతుండటమే దీనికి ప్రధాన కారణం. లీజుదారులు వసూలు చేస్తున్న అద్దెలు తమ లాభాల సంగతి అటుంచి, అసలు పుట్టినే ముంచుతున్నాయని ఎంతో మంది నిర్మాతలు వాపోతున్నారు. కాకపోతే ప్రస్తుత విధానంలో ఒక మేలుంది. సాధారణంగా చిన్న సినిమాలో ఇమేజ్ ఉన్న హీరోలు ఉండరు కాబట్టి ఓపెనింగ్ కలెక్షన్లు 30 నుంచి 50 శాతం మధ్యలో ఉంటాయి. శ్లాబ్ విధానంలో కలెక్షన్లతో నిమిత్తం లేకుండా థియేటర్లోని సీట్ల సంఖ్యని బట్టి వినోదపు పన్ను చెల్లించాలి. 35 ప్రింట్లలోపు విడుదలైన సినిమాకు 8 శాతం పన్ను చెల్లించాలి. అంటే 500 సీట్లున్న థియేటర్లో 40 సీట్లపై పన్ను తప్పనిసరిగా కట్టాల్సిందే. ఎన్ని సీట్లు నిండాయనే సంగతి ప్రభుత్వానికి అనవసరం.
చిన్న సినిమాకు బాగుందని మౌత్ టాక్ రావాలంటే నాలుగైదు రోజులు లేదా ఓ వారం సమయం పడుతుంది. ఈలోగా డిస్ట్రిబ్యూటర్/బయ్యరుకు థియేటర్ అద్దె భారమవుతుంది. రెండో వారం కలెక్షన్లు పుంజుకోకపోతే అసలుకే ఎసరు వస్తుందనే అభిప్రాయంతో వారం తర్వాత థియేటర్ నుంచి సినిమా ఎత్తేసేవాళ్లు. పర్సంటేజితో ఆ ఇబ్బంది పోతుందని అంతా ఆశించారు. కానీ జరిగింది మరొకటి. లీజుదారులు థియేటర్ల అద్దెని అనూహ్య స్థాయిలో పెంచేశారు. దీంతో ఒక మంచి సెంటర్లో తన సినిమాని విడుదల చేయాలంటే అధిక అద్దెని సమర్పించుకోవాల్సిన స్థితి చిన్న నిర్మాతలకి తలెత్తింది. అంత హెచ్చు అద్దెని కట్టే స్థోమతలేని నిర్మాతలు చిన్నా చితకా మారుమూల ప్రాంతాల్లోని థియేటర్లలో సినిమాని విడుదల చేసుకోక తప్పట్లేదు. దానివల్ల ఆ సినిమా చచ్చిపోతోంది.
శ్లాబ్ విధానం రాకముందు సినిమా థియేటర్లలో సగం కంటే ఎక్కువగా నేల, బెంచి తరగతుల సీట్లుండేవి. టికెట్ టాక్సింగ్ విధానం వల్లే ఆ పరిస్థితి కొనసాగింది. రిపీట్ ఆడియెన్స్ సైతం ఆ తరగతుల్లోనే ఎక్కువగా ఉండేవారు. ఫలితంగా ఎగ్జిబిటర్లు కలకలలాడుతూ వుండేవారు. శ్లాబ్ వచ్చాక పరిస్థితి పూర్తిగా తారుమారయ్యింది. కింది తరగతుల సీట్లు నామమాత్రమయ్యాయి. అవి ఫుల్ అయితే దిగువ స్థాయి ఆదాయ ప్రేక్షకులు సైతం ఎక్కువ రేటు టికెట్ కొనుగోలు చేసి వెళ్లాల్సిందే. పెద్ద సినిమాల విషయంలో ఎగ్జిబిటర్లకు ఇది లాభసాటి వ్యవహారం.
తమ అభిమాన హీరో సినిమా కోసం మాస్ ప్రేక్షకులు ఎక్కువ ధరపెట్టి టికెట్ కొనడానికి వెనుకాడరు. అందువల్ల భారీ సినిమాలు ఈ ఎక్కువ ధర టికెట్ల వల్ల లాభపడితే, చిన్న సినిమాలు నష్టాలు చవిచూస్తూ వచ్చాయి. చిత్రంగా ఇప్పుడూ అదే స్థితి వుంది. శ్లాబ్ కాలంలో వున్న సీట్లే ఇప్పుడూ ఉండటం, పెరిగిపోయిన అద్దెలే దీనికి కారణం. పరిస్థితి మెరుగు పడాలంటే అద్దెలు బాగా తగ్గాలి. కిందిస్థాయి సీట్ల సంఖ్య పెరగాలి. దాన్ని 'నాలుగు కుటుంబాలు' జరగనిస్తాయా?

No comments: