Tuesday, September 28, 2010

సినిమా: రెండు మూడు నెలల్లో సినిమా తీసే సత్తా ఉందా?

ఈ రోజుల్లో పెద్ద హీరోల సినిమాల్ని రెండేళ్ల పాటు తీస్తున్నారు. అందుకు చక్కని ఉదాహరణలు - పవన్ కల్యాణ్ 'కొమరం పులి', మహేశ్ 'ఖలేజా'. నిన్నటికి నిన్న రాంచరణ్ 'మగధీర' నిర్మాణానికి కూడా రెండేళ్లు పట్టింది. కానీ టాకీలు మొదలైన తర్వాత చాలాకాలం పాటు ఎంత పెద్ద హీరో సినిమా అయినా రెండు మూడు నెలల్లోతీసేవాళ్లు. దర్శకులు చిత్తజల్లు పుల్లయ్య ఏ సినిమానైనా ఒకటిన్నర నెల లేదా రెండు నెలల్లో పూర్తి చేసేవాళ్లు.
దాదాపు ఒకేసారి నిర్మాణమై, విడుదలైన గోపీచంద్ 'లక్ష్మమ్మ', ఘంటసాల బలరామయ్య 'శ్రీ లక్ష్మమ్మ కథ' సినిమాలు రెండూ రెండు నెలల్లోనే తయారయ్యాయి. సుందర్ లాల్ నహతా (శ్రీ ప్రొడక్షన్స్) 'శాంతినివాసం' చిత్రాన్ని 3 నెలల్లో నిర్మించారు. షూటింగుకు పట్టిన కాలం కంటే ఎక్కువ కాలం అది థియేటర్లలో ప్రదర్శితమైంది. పెట్టుబడికి ఆరింతలు మించి నికర లాభం రావడం విశేషం. అదే నిర్మాత అక్కినేని, సావిత్రితో 'అభిమానం' (1960) సినిమాని రెండు నెలల్లోనే తీశారు. హేమాహేమీలు పనిచేసిన ఆ సినిమా రెండు నెలల్లో పూర్తి కావడం చిన్న విషయం కాదు.
నటీనటులందరూ ఆ సంస్థని అభిమానించడం వల్లా, ఆ సినిమాకి పనిచేసిన వాళ్లందరికీ డబ్బు ఠంచనుగా ఇవ్వడంవల్లా, ముందే తారలకు కాల్షీట్లు ఎక్కువ కావాలని చెప్పి, అన్న ప్రకారం అన్ని కాల్షీట్లు నిర్విఘ్నంగా ఉపయోగించుకోవడం వల్లా, అన్నిటికీ మించి ప్లానింగ్ అండ్ పంక్చువాలిటీ వల్లా, ఒక సెట్టుపై పని ముగిసే లోగా మరో సెట్టు సిద్ధం చేసుకుని 'బ్రేక్' లేకుండా షూటింగ్ కొనసాగిస్తూ వున్నందువల్లా డైరెక్టర్ చిత్తజల్లు శ్రీనివాసరావు (సి.యస్. రావు) 'అభిమానం'ను రెండు నెలల్లో పూర్తి చేయగలిగాడు.
మరిప్పుడు అలాంటి వాతావరణం ఉందా? డబ్బుని తప్ప మంచి సంస్థనైనా అభిమానించే తారలున్నారా? అందరికీ ఠంచనుగా డబ్బిచ్చే నిర్మాతలు ఎంతమంది ఉన్నారు? పక్కా ప్లానింగ్, పంక్చువాలిటీ ఎంత మంది పాటిస్తున్నారు? బ్రేక్ లేకుండా షూటింగులు కొనసాగించే దర్శకులు ఉన్నారా? అలా లేనందునే ఇవాళ ఇష్టమొచ్చినన్ని రోజులు షూటింగులు జరుగుతూ నిర్మాతని నిలువునా ముంచుతున్నాయి.                          

No comments: