Monday, September 20, 2010

సినిమా: మహేశ్ వర్సెస్ ఎన్టీఆర్



తెలుగులో ఇద్దరు టాప్ హీరోలు దసరాకి ఢీ అంటే ఢీ అంటున్నారు. ఆ ఇద్దరు - మహేశ్, జూనియర్ ఎన్టీఆర్. మహేశ్ హీరోగా నటించిన 'మహేశ్ ఖలేజా' సినిమా అక్టోబర్ 7న రిలీజ్ అవుతుందని నిన్న (సెప్టెంబర్ 19) ఆ సినిమా నిర్మాతలు శింగనమల రమేశ్, సి. కల్యాణ్ అధికారికంగా ప్రకటిస్తే, ఎన్టీఆర్ సినిమా 'బృందావనం' అక్టోబర్ 8న రిలీజవుతుందని ఆ సినిమా నిర్మాత రాజు ఈరోజు (సెప్టెంబర్ 20) ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. నిజానికి ఇంతకుమునుపు 'ఖలేజా' సెప్టెంబర్ 30న, 'బృందావనం' అక్టోబర్ 1న విడుదలవుతాయని వాళ్లు ప్రకటించారు.
కానీ రజనీకాంత్ 'రోబో' సినిమా విడుదల సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1కి మారడంతో దానికి అనుగుణంగా ఈ సినిమాలని కూడా ఓ వారం వెనక్కి జరిపారు. అయితే ఈ డేట్లు ఫైనల్ అవుతాయా, మళ్లీ పోస్ట్ పోన్ అవుతాయా అనే సంగతి చెప్పలేం. అయితే దసరాకి మాత్రం మహేశ్, ఎన్టీఆర్ 'నువ్వా నేనా' అనక తప్పేట్లు లేదు. వాళ్లిద్దరూ ఇలా ఢీకొనడం ఇదే ప్రథమం. అక్టోబర్ 17 విజయదశమి. 10 నుంచే దసరా సెలవులు మొదలు. వాటిని క్యాష్ చేసుకోవాలంటే 7 లేదా 8 తేదీల్లో సినిమాని విడుదల చేయాలి. అందుకే 'ఖలేజా', 'బృందావనం' సినిమాల్ని ఆ తేదీల్లో విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు.
ఇలా ఒక వారం తేడాతో మూడు మెగా మూవీలు వస్తుండటంతో థియేటర్లకు కొరత తప్పడం లేదు. ఇప్పటికీ 'రోబో' నైజాం బిజినెస్ సంగతి తేలకపోవడం వల్ల ఆ సినిమాని ఈ ప్రాంతంలో ఎన్ని థియేటర్లలో విడుదల చేసేదీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మరోవైపు 'ఖలేజా'ని అల్లు అరవింద్, 'బృందావనం'ని దిల్ రాజు విడుదల చేస్తున్నందువల్ల ప్రధాన థియేటర్లన్నీ ఈ రెండు సినిమాలకే బుక్ అయ్యాయి. అయినప్పటికీ ఒకే టైంలో ఈ మూడింటినీ విడుదల చేస్తున్నందువల్ల మరీ ఎక్కువ ప్రింట్లతో విడుదల సాధ్యం కాదు. ఈ సంగతిని నిర్మాత రాజు ఒప్పుకున్నారు కూడా. 'వంద థియేటర్లలో వేయాల్సింది తొంభై థియేటర్లలో వేస్తాం' అని ఆయన చెప్పారు.
ఏదేమైనా 'ఖలేజా', 'బృందావనం' సినిమాలపై అంచనాలు అంబరాన్ని చుంబిస్తున్నాయి. ల్యాబ్ రిపోర్టులు కూడా ఈ రెండింటికీ పాజిటివ్ గానే ఉండటం వల్ల రిజల్ట్ ఏమవుతుందనే కుతూహలం అందరిలో పెరుగుతోంది. ఇద్దరిలో గెలుపెవరిది? ఒకరు ఓడి, ఒకరు గెలుస్తారా? ఇద్దరూ గెలుస్తారా? లేక ఇద్దరూ చేతులెత్తేస్తారా? దీనిపై ఇద్దరు హీరోల అభిమానులు ఇప్పటికే పందేలు కడుతున్నారు. ఈ పందెంలో గెలుపు పుంజు ఎవరో?

No comments: