Sunday, October 10, 2010

మహిళ: ఆనాటి స్త్రీని మేల్కొలిపిన 'అనసూయ' (చివరి భాగం)

ఆనాటి సంఘంలో స్త్రీల పరిస్థితి ఎంత దయనీయంగా ఉండేదంటే.. "ఆ కాలంలో స్త్రీల స్థితి చాలా హైన్యంగా ఉండేది. మూర్ఖత్వానికి స్త్రీలు పుట్టినిండ్లుగా ఉండేవారు. వితంతువుల నిర్బంధనలు, కోడండ్రికములు చాలా ఎక్కువగా ఉండేవి.. ఇంతలో వరకట్నాలొకటి వచ్చిపడ్డాయి. వీటి మూలంగా ఆడపిల్లల అభివృద్ధి ఆగిపోయింది. ఆడపిల్ల పుట్టిందంటే పెళ్లి ఎలా చేస్తుమాని విచారిస్తున్నారు... మా కాలంలో ఆడపిల్లలను కన్న దరిద్రులెవరన్నా ఉంటే ఏ ముసలికో, ముతక్కో ఇచ్చి చేసేవారు. అంతేకానీ ఈ మాదిరిగా బేరంపెట్టి మర్యాదస్తులు, ధనవంతులు, పరువుగలవారు కూడా మగపిల్లలను అమ్ముకోవడం యెరగం. ఆత్మగౌరవం గల విద్యార్థులు ఈ అమ్ముడుబోవడానికి ఎలా ఒప్పుకుంటారో తెలియదు" (అప్పుడు-ఇప్పుడు-వృద్ధురాలు- 1920 మార్చి సంచిక). ఇప్పుడూ ఆ విద్యార్థుల ఆత్మగౌరవంలో మార్పేమీ లేదు కద!
స్త్రీలలో ఎప్పటికీ మారని గుణం ఉన్నది. అది తమ జాతిని తామే దూషించడం. ఇట్లాంటివి వద్దంటారు గుడుపూడి ఇందుమతీ దేవి తమ 'బ్రాహ్మణ వివాహ ప్రహసనము'లో. ఇందులో ఓ చోట చారుమతి అంటుంది.. "మన జాతిని మనమే దూషించితే, పురుషులేమనవలె? మనకు సరియైన విద్య లేకనే మనకీ మూర్ఖత్వము వదలకున్నది". ఇందులోనే మంగమ్మ "తెలియక మనవాళ్లు పోట్లాడుతారు గాని మూర్ఖాచారం వదిలితే దేశమే బాగుపడును. ముందొక నాచారమును కొత్తగా నాచరణలోనికి దెచ్చువారు ప్రథమమున చాలా ఇక్కట్లకు తలయొగ్గవలె. తర్వాత అందరూ చేస్తారు" అంటుంది.
మొత్తం మీద 'అనసూయ'లో స్త్రీలను చైతన్యవంతులను చేయాలనే తాపత్రయం కనిపిస్తుంది. విద్యవలనే అది సాధ్యమవుతుందనే ఉద్దేశం అందులో స్పష్టమవుతుంది. 'అనసూయ'కి కేవలం స్త్రీలే కాదు, పురుషులు కూడా రచనలు పంపేవారు. కృష్ణశాస్త్రి కవితలు కూడా కొన్ని వచ్చాయి. 'అన్వేషణము', 'అనుతాపము' లాంటి కవితలు వాటిలో ఉన్నాయి. విజ్ఞానదాయకమైన వ్యాసాలెన్నింటినో వెంకటరత్నమ్మ తన పత్రికలో ప్రచురించేవారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యమధ్యలో పత్రిక రావడం ఆలస్యమైనా భరించి రెండునెలలకి కలిపి ఒక సంచికను తీసుకొచ్చేవారామె. 1917లో మొదలైన పత్రిక ఎంతవరకూ వచ్చిందో కచ్చితంగా తెలీదు కానీ 1924 జూలై సంచిక వరకు పత్రిక లభ్యమవుతున్నది. ఆర్థిక ఇబ్బందుల మూలంగానే ఆ పత్రిక ఆగిపోయిందనుకోవచ్చు. ఏదేమైనా స్త్రీవిద్య, సమానత్వం కోసం స్వాతంత్ర్యానికి పూర్వమే స్త్రీ సంపాదకత్వంలో వచ్చిన ఓ గొప్ప మాసపత్రికగా 'అనసూయ'కి స్థానం ఉంటుంది.  (అయిపోయింది)                          

No comments: