Wednesday, October 6, 2010

సినిమా: ఎన్టీఆర్ పాత్రలో షాట్ గన్

షాట్‌గన్‌గా అభిమానులు పిలుచుకునే బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా తొలిసారి మీసం లేకుండా వెండి తెరపై కనిపించబోతున్నారు. అదీ రాంగోపాల్ వర్మ రూపొందించిన 'రక్త చరిత్ర' చిత్రంలో. ఈ సినిమాలో ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు పాత్రని పోషించారు.
పరిటాల రవి జీవితం ఆధారంగా వర్మ రూపొందించిన ఈ సినిమా తన కెరీర్‌లోనే ఉత్తమ చిత్రమనీ, నటునిగా ఈ సినిమా తనకు చాలా మంచి పేరు తీసుకొస్తుందని సిన్హా అంటున్నారు. 'రక్త చరిత్ర' తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో ఈ నెల ద్వితీయార్థంలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఇందులో పరిటాల రవిగా వివేక్ ఓబరాయ్, మద్దెలచెరువు సూరిగా సూర్య నటించారు. సిన్హా ఈ మూడు భాషల్లోనూ దర్శనమివ్వనున్నారు. దీనికోసం ఆయన తెలుగు, తమిళ భాషల్లో సంభాషణల్ని అర్థం చేసుకుని మరీ నటించారు. "ఈ సినిమా కోసం నిజంగా కష్టపడ్డా. నేను బాగా నటించిన సినిమాల్లో ఇదొకటి.
సినిమా మొత్తం చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఆర్.జి.వి. (వర్మ) చాలా బాగా ఈ సినిమాని రూపొందించారు'' అని చెప్పారు సిన్హా. ఎన్టీఆర్ పాత్ర కోసం మీసాలు తీయడానికి మొదట ఆయన వెనుకాడారు. అయితే స్క్రిప్టు డిమాండ్ చేయడం వల్లా, వర్మ విజ్ఞప్తి మేరకు ఆయన మీసం తీసి నటించారు. సిన్హా బి.జె.పి.కి చెందిన పార్లమెంట్ సభ్యులనే సంగతి తెలిసిందే.

No comments: