Tuesday, October 26, 2010

ఫోకస్: 'నంది' లీలలు (చివరి భాగం)

'లీడర్'కి అన్యాయం?
'ఇంకోసారి' అనే సినిమా ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు పోయిందో సాధారణ ప్రేక్షకులకే కాదు విమర్శకులకి కూడా జ్ఞాపకం లేదు. ఆ సినిమాలో నటించించిన వెన్నెల కిశోర్ ఉత్తమ హాస్యనటుడిగా, దాన్ని డైరెక్ట్ చేసిన సుమాన్ పాతూరి తొలి చిత్ర దర్శకుడిగా అవార్డులు పొందారు. హాస్యనటుడిగా అవార్డునివ్వాలంటే అతను ఆ పాత్ర ద్వారా జనాన్ని బాగా నవ్వించాలి కదా. కానీ ఆ సినిమాని చూసిన వాళ్లెంతమంది? సుమన్ పాతూరితో పోలిస్తే ఉత్తమ తొలిచిత్ర దర్శకుడిగా ఎంపికకు అర్హత ఉన్నది ఉత్తమ సకుటుంబ కథా చలనచిత్రంగా అవార్డుకు ఎంపికైన 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' దర్శకుడు కిశోర్ కే అనేదే అత్యధిక విమర్శకుల అభిప్రాయం. ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎం.ఎం. కీరవాణిని ఎంపిక చేశారు. ప్రస్తుత సంగీత దర్శకుల్లో ఆయన అగ్రగణ్యుడనేది నిర్వివాదం. కానీ ఆయన ఆ అవార్డుకు ఎంపికైన చిత్రం సందర్భవశాత్తూ 'మగధీర' కాదు, 'వెంగమాంబ'! జనానికి తెలిసింది 'మగధీర' సంగీతమా? 'వెంగమాంబ' సంగీతమా? ఇలాగే మరికొన్ని అవార్డుల విషయంలోనూ ఇదే అభిప్రాయం కలుగుతుంది.
ఈ అవార్డుల విషయంలో అన్యాయం జరిగిన సినిమా ఏదంటే 'లీడర్' అనే చెప్పాలి. ఈ సినిమాకి కంటితుడుపుగా ఉత్తమ కథా రచయిత అవార్డునిచ్చారు. శేఖర్ కమ్ముల తయారుచేసిన కథ నచ్చిన జ్యూరీకి ఈ సినిమాలో మరే అంశమూ నచ్చకపోవడం వైచిత్రి. రాష్ట్రానికి ముఖ్యమంత్రయి, వ్యవస్థలోని అవినీతిని అంతం చేయాలని తపించే యువకుడి కథతో రూపొందిన ఈ సినిమా జ్యూరీని ఇతర అంశాల్లో ఎందుకు మెప్పించలేక పోయింది? ఉత్తమ చిత్రం కేటగిరీలో ఎంపికైన మూడు చిత్రాల్లోని కథకంటే ఈ సినిమా కథ ఉత్తమమైందని జ్యూరీకి తోచినప్పుడు ఉత్తమ చిత్రాలుగా వాటిని ఏ ప్రాతిపదిక ఆధారంగా ఎంపిక చేసినట్లు? 'నంది అవార్డుల జ్యూరీ లీలలు ఇన్నిన్నికాదయా' అని చెప్పడానికి ఇంతకు మించి నిదర్శనం మరేముంటుంది?  (అయిపోయింది)

No comments: